ఏపీ అధికార ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, టీడీపీ వ్యూహాత్మకంగా కొట్టిన దెబ్బకు బీజేపీ విలలాడుతోంది. లోక్‌సభ వేదికగా వైసీపీ, టీడీపీ సభ్యులు ప్రత్యేక హోదాపై ప్రశ్నలు సంధించి బీజేపీని ఇరకాటంలో పడేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఇప్పటికే అనేక మార్లు మోడీ సర్కార్ తేల్చి చెప్పింది.
కానీ ఇప్పుడు మరోసారి అదే విషయమై పార్లమెంట్‌లో కూడబలుక్కున్నట్టు వైసీపీ, టీడీపీ సభ్యులు ప్రశ్నించడం, దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏపీ మీడియాలో పతాక శీర్షికతో ప్రచురణ, ప్రసారం కావడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో తమ పార్టీని చావు దెబ్బ తీయడానికే ఓ పథకం ప్రకారం ఆ రెండు పార్టీలు మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చాయని ఏపీ బీజేపీ ముఖ్య నాయకులు అభిప్రాయపడుతున్నారు.
లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా, ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల హామీల అమలుపై ప్రశ్నించారు. కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ… ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించేది లేదని స్పష్టం చేశారు.
14వ ఆర్థిక సంఘం నివేదికతోనే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రకటించే అంశం ముగిసిందని పేర్కొన్నారు. అంతేకాదు, ప్రత్యేక హోదాకు బదులుగా రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కేంద్ర ఆర్థిక శాఖ ప్రయోజనాలు కల్పించిందని ఆయన తేల్చి చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ సమాధానంపై మిథున్‌రెడ్డితో పాటు రామ్మోహన్‌నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక ప్యాకేజీకి తాము అంగీకరించలేదని మిథున్ లోక్‌సభలో స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కావాలని ఆయన డిమాండ్ చేశారు. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ సరైన జవాబు ఇవ్వకుండా అవమానకరంగా, బాధ్యతా రాహిత్యంతో సమాధానం ఇచ్చారని కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ సమాధానం చూస్తుంటే మోడీ సర్కార్‌కు ఆసక్తి, జ్ఞానం లేనట్టు కనిపిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే అనేక మార్లు ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చేశామని, ఇప్పుడు మరోసారి అదే అంశాన్ని తెరపైకి తెచ్చి, బీజేపీని దోషిగా నిలబెట్టి రాజకీయంగా దెబ్బతీసే కుట్రలు ఓ పథకం ప్రకారం జరుగుతున్నాయని ఆ పార్టీ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇదంతా తిరుపతి ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పాలకప్రతిపక్ష పార్టీలు ఆడుతున్న డ్రామాగా బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
అందులోనూ తిరుపతి వేదికగానే ప్రధాన మంత్రి అభ్యర్థిగా మోడీ ప్రత్యేక హోదాపై హామీ ఇవ్వడం, ఇప్పుడు అదే స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండడంతో సమాధానం చెప్పుకోలేని దయనీయ స్థితిలో బీజేపీ ఆత్మరక్షణలో పడింది. రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీగా బీజేపీని పదేపదే ప్రజాకోర్టులో నిలబెట్టే ఆయుధంగా వైసీపీ, టీడీపీకి ప్రత్యేక హోదా అంశం పనికొస్తోంది.
తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ ప్రభావితం చేసే పార్టీ కాకపోయినా, దాని ఉనికే లేకుండా చేయాలనే వైసీపీ, టీడీపీ ప్రయత్నాల్లో భాగంగానే తాజాగా మరోసారి ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాల్ని తెరపైకి తీసుకురావడంలో ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఢిల్లీలో లోక్‌సభ వేదికగా కొట్టిన దెబ్బతో తిరుపతిలో బీజేపీ “అబ్బా” అని గిలగిలలాడుతోంది.