గుజరాత్ లో స్థానిక ఎన్నికల ప్రచారానికి అమిత్ షా వెళ్లారు! ఏపీలో స్థానిక ఎన్నికల ప్రచారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లలేదు! ఈ రెండింటికీ సంబంధం లేకపోయినా, అంతర్లీనంగా ఎంతో విషయం ఉంది. స్థానిక ఎన్నికల ప్రచారానికి తను వెళ్లనక్కర్లేదని, తను చేపట్టిన కార్యక్రమాలే గెలిపిస్తాయనే నమ్మకం, పరిపూర్ణ విశ్వాసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జగన్ కదల్లేదు. ఇప్పుడు తను మాట్లాడనక్కర్లేదని, తన పనులే మాట్లాడతాయనే విశ్వాసంతో వ్యవహరించారు జగన్. ఆ కాన్ఫిడెన్స్ నిజం అయ్యింది. పట్టణాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరేసింది.
అవతల చంద్రబాబు నాయుడు పంచాయతీ ఎన్నికలకు మెనిఫెస్టోను విడుదల చేసి, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లి, హైదరాబాద్ ను తనే ప్రపంచ పటంలో పెట్టినట్టుగా, విశాఖకు కూడా అదే పని చేసినట్టుగా అరిగిపోయిన పాత రికార్డునే వేశారు! మున్సిపల్ ఎన్నికల కోసం చంద్రబాబు నాయుడు దిగని హద్దు లేదు. అన్ని హద్దులూ దాటేసి వెళ్లి బ్యాలెన్స్ పరువు ఏదైనా ఉంటే అది తీసేసుకున్నారు చంద్రబాబు నాయుడు.
రేపు తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో చంద్రబాబు నాయుడు దిగేందుకు కూడా ఇక జారుడు మెట్లు లేవు! స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలకూ, వచ్చిన ఫలితాలకూ బేరీజు వేస్తే.. ఆయన తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తే అంత కన్నా అవమానం లేదు. అయితే రాజకీయాల్లో అవన్నీ అనుకోరు, అందులోనూ చంద్రబాబు నాయుడు అస్సలు అనుకోరు! ఎటొచ్చీ తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఎంత సిల్లీగా మాట్లాడతారనేదే తదుపరి పక్షం రోజుల్లో వినోదం.
ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి బై పోల్ విషయంలో ఇప్పటికే కసరత్తును చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మంత్రులను ఇన్ చార్జిలును ప్రకటించారు. కీలకమైన బాధ్యతులుగా వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఉండనే ఉన్నారు.
ఇలాంటి నేపథ్యంలో బహుశా వైఎస్ జగన్ ప్రత్యేకంగా తిరుపతి విషయంలో ఇక చేయాల్సిన కసరత్తు ఏమీ లేకపోవచ్చు. అయితే కనీసం ఒకటీ రెండు రోజులు అయినా ప్రచారానికి వెళ్తారా? లేక రెండేళ్ల తన పాలన తిరుపతిలో పాత మెజారిటీని పెంచి చూపిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉంటారో!