పరకాల ప్రభాకర్…ఈయనలో చాలా కోణాలున్నాయి. ఈయనలో జర్నలిస్టు, సామాజికవేత్త, రాజకీయ నేత, సలహాదారుడు … అన్నిటికీ మించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త. కానీ స్వతంత్ర భావాలున్న వ్యక్తి. భార్య కేంద్ర మంత్రి అయినప్పటికీ, మోడీ సర్కార్ ఆర్థిక విధానాలను తప్పు పట్టిన సందర్భం లేకపోలేదు. తాజాగా పరకాల ప్రభాకర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జనసేన పేరెత్తకుండానే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పరకాల మనస్తత్వానికి విరుద్ధంగా ఘాటు పదాలతో జనసేన నేతల్ని దుమ్ము రేపారు. సంచలనం కలిగిస్తున్న ఆ ట్వీట్ ఏంటో తెలుసుకుందాం.
“ఇంకా కుక్కలు మొరుగుతూనే ఉన్నట్టున్నాయి. కానివ్వండి. మళ్లీ రేపు తీరుబడి అయ్యాక ఒక్కొక్క కుక్కనీ మూతి పగిలేలా కొడతాను. ఏ కుక్కనీ నిరాశపరచను. ఆఫీస్‌కి వెళ్లి కిరాయి తీసుకోడం మరిచిపోకండి. రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలిపించుకోలేక పోయిన వాళ్లు అంతకన్నా ఇంకేమి చెయ్యగలరు?” అని పరకాల ట్విటర్ వేదికగా జనసైనికులను ఉతికి ఆరేశారు.
రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలిపించుకోలేక పోయిన వాళ్లు అంతకన్నా ఇంకేమి చెయ్యగలరనే ప్రశ్నతో… పరకాల ట్వీట్ జనసేన గురించే అని అందరికీ అర్థమైంది. జనసేనాని పవన్‌కల్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓట మిని మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ విషయాన్నే పరకాల పరోక్షంగా ప్రస్తావిస్తూ జనసైనికులపై విరుచుకుపడ్డారు.
పరకాల ట్వీట్లోని ప్రతి అక్షరం ముళ్ల కర్రతో పొడిచినట్టుగా ఉంది. పరకాల ట్వీట్‌ను టీడీపీ, వైసీపీ శ్రేణులు తమ సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేసి, పవన్‌కల్యాణ్‌ను కవ్విస్తుండడం గమనార్హం.
నరసాపురం ఎమ్మెల్యేగా రెండుసార్లు, అలాగే ఎమ్మెల్సీగా ఒకసారి పోటీ చేసి మీరు గెలవలేదు కదా అని మరికొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేనపై ఓ కేంద్ర మంత్రి భర్త ఈ రేంజ్లో విరుచుకు పడడం సహజంగానే సంచలనం కలిగిస్తోంది.