ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఒంటరి వాడయ్యారు. కష్టకాలంలో నైతిక మద్దతు కొరవడింది. ఐదేళ్ల పాటు రాజకీయంగా వాడుకున్న చంద్రబాబు, అధికారం నుంచి దిగిపోయిన తర్వాత ఏబీ ఎవరో తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదే ఏబీని మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నట్టు సమాచారం. ఎవరికోసమైతే తాను నేడు ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చిందో, వాళ్లిప్పుడు అంటరాని వాడిగా చూడడం అన్నిటికి మించి తీవ్ర ఆవేదన కలిగించిందని చెబుతున్నారు.
ఇంటెలిజెన్స్ చీఫ్గా పని చేసిన సమయంలో ఇజ్రాయెల్ నిఘా పరికరాలను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారనే ఆరోపణలపై గత ఏడాది ఫిబ్రవరి 8న ఏబీవీపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆ తర్వాత ఒకదాని తర్వాత మరొక విచారణతో ఏబీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం ఏకంగా సర్వీస్ నుంచే డిస్మిస్ చేయాలనే ప్రభుత్వ సిఫార్సుతో ఏబీ ఖంగుతిన్నారు. ఈ పరిణామాల్ని ఆయన అసలు ఊహించి ఉండరు.
చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఐదేళ్ల పాటు అవిశ్రాంతంగా ఏబీ వెంకటేశ్వరరావు పని చేశారనే అభిప్రాయాలు ఐపీ ఎస్, ఐఏఎస్ వర్గాల నుంచి వస్తున్నాయి. జగన్ ప్రభుత్వ చర్యలతో అగాథంలోకి కూరుకుపోతున్న ఏబీని మాట మాత్రం కూడా వెనకేసుకు రావాలనే ఆలోచన చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతల్లో కొరవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇదే తన పార్టీకి చెందిన మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, కూన రవికుమార్ తదితరులు జైలుపాలైనప్పుడు చంద్రబాబు, లోకేశ్, ఇతర టీడీపీ నేతలు మానవీయ కోణంలో వ్యవహరించిన తీరును ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు గుర్తు చేస్తున్నారు.
తమ పార్టీ, ప్రభుత్వం కోసం పనిచేసిన ఏబీకి ఇబ్బందులొస్తే …చంద్రబాబు, లోకేశ్ ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఇదే చంద్రబాబును పట్టించుకోకుండా ఇతర అధికారుల మాదిరిగా ఏబీ ఉండి ఉంటే… ఈ రోజు జగన్ ప్రభుత్వంతో పేచీనే లేదు కదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
కనీసం తామున్నామనే ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని కలిగించే సంకేతాల్ని ఏబీకి పంపకపోవడంపై బాబు సామాజిక వర్గం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఇలాగైతే భవిష్యత్లో చంద్రబాబుని నమ్ముకుని ఎవరు పని చేస్తారని ప్రశ్నించే వాళ్లు లేకపోలేదు.