ఏపీలో పెండింగ్ లో ఉన్న మున్సిపాలిటీల, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తతంగంపై ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టింది. ఇటీవల జరిగిన ఏపీ మున్సిపోల్స్ లో 75 మున్సిపాలిటీలకూ, 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. అయితే వివిధ కారణాలు, కోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్ల కారణంగా ఏకంగా 33 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వాటిల్లోని 11 మున్సిపాలిటీలకు ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉన్న విషయాన్ని ఎస్ఈసీ పరిశీలిస్తున్నారు.
ఈ పదకొండు మున్సిపాలిటీలకూ ఎన్నికలను నిర్వహించడానికి చట్టబద్ధమైన ఆటంకాలు లేవనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, వీటితో పాటు నెల్లూరు, శ్రీకాకుళం కార్పొరేషన్ల ఎన్నికలను నిర్వహించడానికి ఎస్ఈసీ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. వీటిల్లోని వార్డుల విభిజన, ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలను అతి త్వరలోనే పూర్తి చేసి ఈ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ను విడుదల చేసే ప్రయత్నంలో ఎస్ఈసీ ఉన్నట్టుగా తెలుస్తోంది.
చంద్రబాబు హయాంలో స్థానిక ఎన్నికలను పెండింగ్ లో పెట్టడానికే ప్రాధాన్యతను ఇచ్చారు. అప్పట్లో యేళ్లకు యేళ్లు పంచాయతీ, మున్సిపోల్స్, జడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించడానికి చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం ఉత్సాహం చూపించలేదు. అదే సమయంలో నాటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఆ ఎన్నికల నిర్వహణ గురించి పట్టించుకున్న దాఖలాలులేవు. తన పదవీకాలం ముగుస్తున్న దశలో ఎన్నికల నిర్వహణకు ఆయన పట్టు పట్టారు కానీ, టీడీపీ హయాంలో అలాంటి ప్రయత్నాలు చేయలేదు. అయితే ఇప్పుడు ఏ ఎన్నికలూ పెండింగ్ లో లేకుండా పూర్తి చేయాలనే ప్రయత్నం కనిపిస్తూ ఉంది.
పెండింగ్ లో ఉన్న, త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న మున్సిపల్, కార్పొరేషన్లలో.. పెనుకొండ మున్సిపాలిటీ, నెల్లూరు కార్పొరేషన్, కుప్పం మున్సిపాలిటీ.. వంటి ఆసక్తిదాయకమైన రాజకీయ వేదికలున్నాయి. నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం, ప్రకాశం – దర్శి, కడప జిల్లాలోని కమలాపురం మున్సిపాలిటీలకు కూడా త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. మొత్తానికి ఏపీలో మరో ఆసక్తిదాయకమైన పొలిటికల్ బ్యాటిల్ త్వరలోనే ఉండబోతున్నట్టుగా ఉంది!