ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కరోనా తగ్గుముఖం పడుతున్న వేళ.. పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా రాబోయే రెండేళ్లు జనంలోనే ఉండాలని పార్టీలన్నీ దాదాపు నిర్ణయించుకున్నాయి. దీనికి అధికార పార్టీ కూడా మినహాయింపు కాదు.
జనంలో ఉంటే, జనంతో కలసి నడిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ప్రత్యక్షంగా చూసిన పార్టీ వైసీపీ. అందుకే రెండో దఫా కూడా అదే వ్యూహంతో ముందుకెళ్లాలని చూస్తోంది.
వైసీపీ ప్లాన్ ఏంటి..?
సీఎం జగన్ జిల్లాల పర్యటన, రచ్చబండ కార్యక్రమం కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఆగస్ట్ 16 నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభించడం, అదే రోజున నాడు-నేడు పనుల్ని ప్రజలకు అంకితం చేయడం ద్వారా జగన్ మరోసారి జనం లోకి రాబోతున్నారు. అప్పటికి పరిస్థితులు చక్కబడితే అట్నుంచి అటే ఆ పర్యటనల్ని పొడిగిస్తారు. జిల్లాలను చుట్టేస్తారు.
ఎన్నాళ్ల నుంచి తాను ప్రారంభించాలనుకుంటున్న రచ్చబండ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే పట్టాలెక్కించాలనుకుంటున్నారు జగన్. 2019లో విజయానికి పాదయాత్ర ఎంత ఉపయోగపడిందో, 2024 గెలుపుకి రచ్చబండ అలాంటి నాందీ ప్రస్తావన కావాలనుకుంటున్నారు జగన్.
సచివాలయాల కాన్సెప్ట్ ని మరింత హైలెట్ చేసుకుంటూ, వాటి ద్వారా పాలనలో వచ్చిన మార్పుల్ని ప్రజలకు మరోసారి తెలియజేసేలా సచివాలయాల సందర్శన పెట్టుకున్నారు. ఇప్పటికే స్థానిక నాయకులు సహా అధికారులు సచివాలయాల పర్యవేక్షణకు వెళ్లాలని చెప్పారు జగన్. ఎన్నికల ఏడాది నాటికి ఆ సందర్శనను జగన్ కొనసాగిస్తారు.
టీడీపీ మాస్టర్ ప్లాన్ ఏంటి..?
చంద్రబాబుకి ఎప్పటినుంచో పాదయాత్ర చేయాలని ఉంది కానీ, వయసు సహకరించడం లేదు. పోనీ కొడుకుని రోడ్డుపైకి వదులుదామంటే.. దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని అర్థమై సైలెంట్ గా ఉన్నారు బాబు. ఎప్పుడూ జూమ్ మీటింగ్ లతో సరిపెట్టడం బాగోదు కనుక, పరామర్శల పేరిట బాబు రోడ్డుపైకొచ్చారు.
లోకేష్ శవ రాజకీయాల పేరిట తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా తండ్రీకొడుకులు సందర్భం దొరికిన ప్రతిసారి రోడ్డుపైనే మకాం వేస్తున్నారు. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మధ్యమధ్యలో నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదు కాబట్టి వాటిని విరమించుకున్నారు. ఎన్నికల ఏడాదిలో లోకేష్ సైకిల్ యాత్రపై మాత్రం తీవ్రంగా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
జనసేనాని వ్యూహం ఏంటి..?
బీజేపీతో కలవడంతో జనసేన పరిస్థితి 'నా ఘర్ కా నా ఘాట్ కా' అన్నట్టు తయారైంది. కేంద్రం పెట్రోలు మోత మోగిస్తున్నా సైలెంట్ గా ఉండాల్సిందే, వ్యాక్సిన్ కొరత వేధిస్తున్నా నోరు తెరవడానికి లేదు. ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న పవన్ కల్యాణ్ ఈ దఫా పూర్తిగా సోషల్ మీడియాకే పరిమితం అయ్యారు.
జనం మధ్యకు రావడం కంటే, షూటింగ్ స్పాట్ కి వెళ్లడానికే ఆయన ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అధినాయకుడు రోడ్డుపైకి అప్పుడే రారు కాబట్టి క్యాడర్ ఇటీవల పలు కార్యక్రమాలతో రోడ్డెక్కింది. నాదెండ్ల మనోహర్ సారధ్యం అంతంతమాత్రంగానే ఉంది.
బీజేపీ సాలోచన..
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సందర్భం ఇది. అంటే కేంద్రంలో అధికార పార్టీ జనాల్లోకి వెళ్తే చీవాట్లు తప్ప స్వాగతాలు ఉండవు. అందుకే ఏపీలో ఉనికి కాపాడుకోడానికి బీజేపీ తంటాలు పడుతోంది. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది.
ఎలాగోలా కేంద్రం పెద్దల దృష్టిలో పడి నామినేటెడ్ పోస్ట్ లు కొట్టేయడానికి నాయకులు కష్టపడుతున్నారే కానీ, నేరుగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు వారు ఇష్టపడటం లేదు. అందుకే పరిస్థితులకు తగ్గట్టు, సందర్భానుసారం వీర్రాజు నేతృత్వంలో వీళ్లు కూడా రోడ్లపై కొచ్చి హంగామా చేస్తున్నారు.
కాంగ్రెస్, వామపక్షాలు గల్లంతేనా..?
రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ తన చితికి తానే నిప్పంటించుకుంది. ఆ తర్వాత కనీసం పార్టీని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎవరితోనైనా పోటీ పడుతుంది అంటే అది వామపక్షాలతోనే. ఓట్లు లేవు, సీట్లు లేవు, నాయకులు లేరు. కేవలం పార్టీలు ఉన్నాయి, వాటికి గుర్తులున్నాయి అన్నట్టు ఉంది ఏపీలో కాంగ్రెస్, వామపక్షాల పరిస్థితి. అయినప్పటికీ వీళ్లు కూడా రోడ్డెక్కి ఏదో చేయాలని తాపత్రపడతున్నారు.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. రాష్ట్రంలో అప్పుడే రాజకీయ వేడి మొదలైనట్టు కనిపిస్తోంది. ఇప్పట్నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించి వైసీపీకి చెక్ పెట్టాలని టీడీపీ భావిస్తుంటే.. టీడీపీకి ఆ 23 కూడా రాకుండా చేసేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. రాబోయే రోజుల్లో ''రోడ్డు రాజకీయాలు'' మరింతగా బలపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.