''సోమవారం'' ఆశలు కూడా గల్లంతయ్యాయి. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా కోలుకోలేదు. లాక్ డౌన్ తర్వాత చేదు అనుభవాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ మొదలైంది. థియేటర్లు తెరిచిన తర్వాత తిమ్మరుసు, ఇష్క్ తో పాటు ఏకంగా 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడీ 5 సినిమాలు వీకెండ్ ముగిసేనాటికి దుకాణం సర్దేశాయి.
తిమ్మరుసుకు మొదటిరోజు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. రెండో రోజు పుంజుకుంది. దీంతో ఇది మెల్లగా అందుకుంటుందని అంతా అనుకున్నారు. నిన్నటి ఆక్యుపెన్సీ/వసూళ్లతో ఈ సినిమా కూడా ఫెయిల్యూర్ అనే విషయం పక్కా అయింది. సత్యదేవ్ నటించిన ఈ సినిమా ఇక కోలుకునే అవకాశం లేదు.
ఇష్క్ సినిమా అయితే రెండో రోజుకే పడిపోయింది. తేజ సజ్జ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మొదటి రోజే మౌత్ టాక్ బాగాలేదు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్లిష్ట పరిస్థితులకు ఈ బ్యాడ్ మౌత్ టాక్ కూడా యాడ్ అవ్వడంతో సినిమా వీకెండ్ లో కూడా ఆడలేదు. ఇక నిన్నటి పరిస్థితి అయితే మరీ ఘోరం.
ఈ రెండు సినిమాలతో పాటు వచ్చిన నరసింహపురం, త్రయం, పరుగెత్తు-పరుగెత్తు సినిమాలేవీ ఆకట్టుకోలేకపోయాయి. నరసింహపురం సినిమాకు అనంతపురం, విశాఖ, చిత్తూరులోని కొన్ని మాస్ థియేటర్లలో కలెక్షన్లు వచ్చినట్టు కనిపించినప్పటికీ.. అంతలోనే ఆ సినిమా ఆశలు కూడా ఆవిరయ్యాయి.
ఇవాళ్టి నుంచి బాక్సాఫీస్ ఖాళీ. మళ్లీ మరో శుక్రవారం వరకు బాక్సాఫీస్ ఎదురుచూడాల్సిందే. ఈ వారాంతం ఎస్ఆర్ కల్యాణమండపం, క్షీరసాగరమధనం, మెరిసే మెరిసే లాంటి సినిమాలొస్తున్నాయి.