తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతిని ఈనాడు మీడియా గ్రూప్ అవమానిస్తోంది. మహిళల విషయంలో గౌరవ మర్యాదలతో వ్యవహరించాలని లోకానికి చెప్పాల్సిన మీడియా సంస్థ, అందుకు విరుద్ధంగా చాప కింద నీరులా చిన్న చూపు చూడడం ఆవేదన కలిగిస్తుంది. లక్ష్మీపార్వతిని ఈనాడు ఏ విధంగా అవమానిస్తున్నదో తెలుసుకుందాం.
“ఏయూ గౌరవ ఆచార్యులుగా లక్ష్మీపార్వతి” శీర్షికతో ఈనాడు పత్రికలో చిన్న వార్తను చూడొచ్చు. వార్తలోకి వెళితే, లక్ష్మీపార్వతి పట్ల ఈనాడు ఎంత సంకుచితంగా ఆలోచించిందో అర్థమవుతుంది. మూడు వాక్యాల్లోని ఆ వార్త సాగిన విధానం ఎలాగుందంటే….
” ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ ఆచార్యులుగా తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి నియమితులయ్యారు. సోమవారం వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆమెకు అందజేశారు. ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి అభినందించారు” అని రాశారు. లోతుగా చదివితే ఈనాడు దురుద్దేశం ఏంటో తెలుస్తుంది.
లక్ష్మీపార్వతిని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భార్యగా ఈనాడు గుర్తించ నిరాకరించడాన్ని ఈ వార్తలో చూడొచ్చు. అందుకే ఇంటి పేరు లేకుండానే కేవలం లక్ష్మీపార్వతిగా రాసుకొచ్చారు. లక్ష్మీపార్వతి గురించి ఎప్పుడు రాసినా… దాదాపు ఇదే రీతిలో ఈనాడు వ్యవహరిస్తుండడాన్ని మహిళా సంఘాలు గుర్తు చేస్తున్నాయి. ఉదాహరణకు చంద్రబాబుపై లక్ష్మీపార్వతి పిటిషన్ కొట్టివేత వార్తను కూడా ఈనాడు ఆదే విధంగా ప్రజెంట్ చేసింది.
లక్ష్మీపార్వతిని తన భార్యగా వేలాది మంది సమక్షంలో ప్రకటించిన ఎన్టీఆర్‌కు, అలాగే ఆయన కుటుంబ సభ్యులకు లేని బాధ… ఈనాడుకు మాత్రం ఎందుకో అర్థం కావడం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.