బెదురులంక సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్న కార్తికేయ, ఈసారి ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కథ ఏంటనే విషయాన్ని ఇప్పటికే 'గ్రేట్ ఆంధ్ర'కు పూసగుచ్చినట్టు వివరించిన ఈ హీరో, ఈరోజు రిలీజైన ట్రయిలర్ లో కూడా ఏదీ దాచే ప్రయత్నం చేయలేదు.
సాధారణంగా ట్రయిలర్ కట్ లో అసలు మేటర్ ఏంటనేది చెప్పరు. సినిమాలో ఎట్రాక్షన్స్ చెబుతూనే, కథపై కాస్త సస్పెన్స్ మెయింటైన్ చేస్తారు. కానీ బెదురులంక ట్రయిలర్ లో అలాంటి సస్పెన్స్ ఏదీ ఉంచదలుచుకోలేదు. కథ ఏంటనేది మరోసారి క్లియర్ గా చెప్పేశారు.
బెదురులంక.. ఓ లంక గ్రామం. 2012 సెటప్. ఆ టైమ్ లో యుగాంతం అవుతుందని పలు ఛానెళ్లలు, ప్రసారమాధ్యమాల్లో తెగ ప్రచారం జరిగింది. దాన్ని ఆ గ్రామంలోని కొంతమంది క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రపంచం అంతం అయిపోతుందంటూ నమ్మించి, గ్రామస్తుల్ని దోచుకుంటారు.
సరిగ్గా అదే టైమ్ లో గ్రామంలోకి ప్రవేశిస్తాడు హీరో. ఈ కట్టుకథలు, మోసాల నుంచి హీరో తన గ్రామాన్ని ఎలా కాపాడుకున్నాడనేది ఈ సినిమా స్టోరీ. చెప్పుకోడానికి సీరియస్ సబ్జెక్ట్ గా ఉన్నప్పటికీ, దీన్ని కామెడీగా చెప్పే ప్రయత్నం చేశారు. ట్రయిలర్ లో కార్తికేయ లుక్, యాక్టింగ్ బాగున్నాయి. నేహాశెట్టి-కార్తికేయ కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది.
క్లాక్స్ డైరక్ట్ చేసిన ఈ సినిమాను రవీంద్ర బెనర్జీ నిర్మించాడు. మణిశర్మ సంగీతం అందించాడు. ఆగస్ట్ 25న రాబోతున్న ఈ సినిమాపై సరైన అంచనాల్ని సెట్ చేసింది బెదురులంక. అయితే ఒకటే సమస్య. దాదాపు ఇదే కాన్సెప్ట్ తో గతంలో స్కైల్యాబ్ అనే సినిమా వచ్చింది. దానికి, దీనికి ఎలాంటి సంబంధం/పోలికలు లేకపోతే అదే పదివేలు.