జగన్ సర్కారుకు ఆ నమ్మకం ఏంటి…?

ఏపీ సీఎం బాగా మొండి మనిషి. తాను అనుకున్నదే జరగాలనే పట్టుదల ఎక్కువ. ఇది జగన్ పైన విమర్శ కాదు. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక అంశాల్లో ఈ విషయం రుజువైంది. మూడు…

ఏపీ సీఎం బాగా మొండి మనిషి. తాను అనుకున్నదే జరగాలనే పట్టుదల ఎక్కువ. ఇది జగన్ పైన విమర్శ కాదు. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక అంశాల్లో ఈ విషయం రుజువైంది. మూడు రాజధానులని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి దానిపై పట్టు వీడలేదు. ఈ విషయంలో వైసీపీ ఒక్కటి ఒకవైపు ఉండగా, టీడీపీ, ఇతర పార్టీలన్నీ ఒకవైపు ఉన్నాయి. 

బీజీపీ కొంతకాలం దోబూచులాడినా ఇప్పుడు అమరావతికే జై కొడుతోంది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ హై కోర్టు తీర్పు ఇచ్చినా జగన్ వెనక్కి తగ్గలేదు. జగన్ తగ్గనప్పుడు మంత్రులు కూడా తగ్గేదేలే అనాలి కదా. ఆ విధంగానే అన్నారు. ఆరునూరైనా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామన్నారు. రాజధాని విశాఖకు తరలిపోవడం తప్పదన్నారు.

రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన స్పీకర్ కూడా ఇదే మాట అన్నారు. మొదటి నుంచి సీఎం జగన్ తో పాటు మంత్రులంతా మూడు రాజధానులపై ఎంతో నమ్మకంగా ఉన్నారు. హై కోర్టు వ్యతిరేకించినా ఈ నమ్మకాన్ని వదులుకోలేదు. కొందరు ముహూర్తాలు కూడా నిర్ణయించారు. విశాఖ నుంచి దసరా నుంచి పరిపాలన మొదలవుతుందని కొందరంటే, దీపావళి నుంచి ప్రారంభమవుతుందని కొందరున్నారు. మొత్తం మీద అమరావతికి అనుకూలంగా తీర్పు వచ్చిన ఆరు నెలల తరువాత ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. హై కోర్టు తీర్పు మీద స్తే ఇవ్వాలని పిటిషన్ వేసింది. సుప్రీం కోర్టు స్పందన ఏ విధంగా ఉంటుందో తెలియదు. సర్కారుకు అనుకూలంగా తీర్పు వస్తే జగన్ హ్యాపీ. వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తారనేది ప్రశ్న. 

సుప్రీం కోర్టు కూడా అమరావతికే అనుకూలంగా తీర్పు ఇస్తే దాన్ని అమలు చేయడం తప్ప మరో మార్గం లేదు. ఎందుకంటే సుప్రీం కోర్టు తీర్పే అంతిమం కాబట్టి. ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళడానికి ముందే మంత్రి గుడివాడ అమర్ నాథ్ 3 రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ విధానంలో ఎలాంటి మార్పు లేదని అసెంబ్లీలో  తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే విశాఖ కేంద్రంగా పాలన మొదలవుతుందన్నారు. రాజధాని పేరిట రూ.లక్షల కోట్లు ఖర్చు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్న ఆయన తక్కువ ఖర్చుతో విశాఖ నగరాన్ని అభివృధ్ధి చేస్తామని స్పష్టం చేశారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ విధానమని, ఇందులో ఎలాంటి మార్పు లేదన్నారు. కర్నూలు కేంద్రంగా హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ రాయలసీమ డిక్లరేషన్‌లో చెప్పి… ఇప్పుడు ఆ పార్టీ నేతలు పాదయాత్రలో ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. 

రాజధాని విశాఖ తరలించేందుకు అవసరమైన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని మంత్రి అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. ఇదే అభిప్రాయాన్ని ఇతర మంత్రులు కూడా ఇప్పుటి నుంచో చెబుతున్నారు. అమరావతిపై ఏపీ హైకోర్టు తీర్పును వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేయడాన్ని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తప్పుబట్టారు. 

వైసీపీ ప్రభుత్వానికి మరోసారి భంగపాటు తప్పదన్నారు. ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయకుండా ఆలస్యంచేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు హైకోర్టు చట్టసభల్ని అవమానించే తీర్పు ఇచ్చిందంటూ ఆరోపించడాన్ని కూడా ఆక్షేపించారు. దురుద్దేశంతోనే హైకోర్టు తీర్పును వక్రీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కనకమేడల విమర్శించారు. మరోవైపు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా సుప్రీంకోర్టులో వైసీపీ ప్రభుత్వ పిటిషన్ పై స్పందించారు.

హైకోర్టు తరహాలోనే సుప్రీంకోర్టులోనూ ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటి తీర్పు వస్తుందని కేశవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల ఆకాంక్షలను సుప్రీంకోర్టు కూడా కాదనే అవకాశం లేదని కేశవ్ తెలిపారు. అమరావతి రైతుల పోరాటం వృథా పోదన్నారు. రైతుల సంకల్పం ముందు ప్రభుత్వ కుట్రలు చాలా చిన్నవని పీఏసీ ఛైర్మన్ పేర్కొన్నారు. తద్వారా సుప్రీంకోర్టులోనూ హైకోర్టు తీర్పే రిపీట్ అవుతుందనేలా కేశవ్ వ్యాఖ్యానించారు. 

మొత్తం మీద ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ సుప్రీం కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే జగన్ వ్యూహం ఏమిటనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది.