ఈ జులైలో విడుదలైన ‘‘థాంక్యూ’’ సినిమా ప్రి-రిలీజ్ సందర్భంగా జీవితంలో మనం అనేకమంది కృతజ్ఞులుగా ఉండాలనే సందేశాన్ని యీ సినిమా యిస్తుందంటూ వక్తలు మాట్లాడగా విని సంతోషించాను. మనం సారీ చెప్పడానికి కష్టపెట్టుకుంటాం, థాంక్యూ చెప్పడానికి యిష్టపడం. ఎవరినైనా టైమెంతో అడిగి అవతలివాడు చెప్పాక థాంక్యూ అనం, ఓహో అంటాం, హోటల్లో సర్వర్ సర్వ్ చేస్తే అది వాడి డ్యూటీ కదా అనుకుంటాం. తల్లి కానీ, భార్య కానీ బాగా వంట చేస్తే వాళ్లు చేయాల్సింది అదే కదా అనుకుని ఊరుకుంటాం. వంటకం రుచి పాడైతే మాత్రం వెంటనే చెప్పేస్తాం. పాశ్చాత్యదేశాల్లో ప్రతీదానికీ వాళ్లు థాంక్యూ ఎదురు చూస్తారని గ్రహించినప్పుడు విసుక్కుంటాం.
అందంగా ఉన్నామని విర్రవీగుతాం. మన ఒడ్డూ, పొడుగూ, ఫేషియల్ ఫీచర్లు, ఆరోగ్యం.. అన్నీ తలిదండ్రుల జీన్స్ నుంచి వచ్చాయని, అద్దం ముందు నిలబడినప్పుడు వాళ్లను తలచుకోవాలని మనకు తోచదు. ఇక జీవితంలో ఏదైనా సాధిస్తే మనం కష్టపడడం వలననే పైకి వచ్చామనుకుంటాం. మనం మంచివాళ్లం కాబట్టి, మహా అయితే దేవుడు హెల్ప్ చేశాడు కానీ మానవమాత్రులెవరూ చేశారనుకోం. మనం కష్టపడేందుకు, కష్టపడి ఆర్జించినది నిలుపుకునేందుకు వ్యవస్థ సహకరించిందని అస్సలు అనిపించదు. మనం అవతలివాళ్లకు యిచ్చినదే మనకు లెక్క. అవతలి వాళ్లిచ్చినది టేకెన్ ఫర్ గ్రాంటెడ్.
2005లో వరప్రసాద్‌కు పద్మభూషణ్ వచ్చింది. ఆయన సొంతూరు నెల్లూరులో సన్మానసభ. హేమాహేమీలందరూ వస్తున్నారు. మంచి ఉపన్యాసం యివ్వాలనుకుని నాతో మాట్లాడాడు. అప్పుడప్పుడు ఆయనకు నేను సౌండింగ్ బోర్డుని. కొన్ని విషయాల్లో తన ఆలోచనలను నాతో పంచుకుంటాడు. నాతో మాట్లాడుతూనే యింకా ముందుకి వెళ్లి ఆలోచిస్తాడు. సమస్యేమిటంటే ఆ ఆలోచనలు పుంఖానుపుంఖాలుగా వచ్చి పడుతూంటాయి. వాటినన్నిటినీ ఓ క్రమంలో పెట్టడానికి అనేక వ్యాపకాల కారణంగా సమయం చాలదు. అందుకని ఆ పని నాకు అప్పచెపుతాడు. నేను డ్రాఫ్ట్ తయారు చేసి యిచ్చాక తన కవితాధోరణి రంగరించి చిలవలు, పలవలు దిద్దుతాడు. వేదిక మీద అప్పటికప్పుడు ఆశువుగా కొన్ని చేరుస్తాడు.
ఇంతకీ చెప్పవచ్చేదేమిటంటే ఎవరెవరికి థాంక్స్ చెప్పాలి అనే దగ్గర చర్చ మొదలుపెట్టాం. ‘ప్రభుత్వాల దాకా వెళ్లేముందు గురువుల దగ్గర మొదలు పెడతామా?’ అని నేనడిగితే ఆయన ‘వాళ్లే కాదు, స్కూలు, దానికి ఎన్నడో స్థలం యిచ్చిన దాతలు, దానికి రోడ్డు వేసి తాగునీరు, విద్యుత్ వగైరా సౌకర్యాలు అమర్చిన ప్రభుత్వ వ్యవస్థ వీటన్నిటినీ తలచుకోవాలి’ అంటూ ప్రారంభించాడు. ఆ థాట్ నాకు భలే నచ్చింది. మనలో చాలామందికి మన ఎలిమెంటరీ స్కూలు, హైస్కూలు పొడి అక్షరాలు మాత్రమే గుర్తుంటాయి. దాతల పేర్లు మొదట్లో పూర్తిగా పెట్టినా కాలక్రమేణా ఇనీషియల్స్‌కు కుదించేస్తారు. అదే మనకు గుర్తు. అలాగే మనకు కొందరు పెద్ద మొత్తాన్ని బ్యాంకులో వేసి, వడ్డీని ఏటేటా మెరిట్ స్టూడెంట్స్‌కు స్కాలర్‌షిప్ యివ్వమంటారు. పుచ్చుకున్నవాళ్లకు దాతల పొడి అక్షరాలు కూడా గుర్తుంటాయో లేదో డౌటు. వరప్రసాద్ ఉపన్యాసానికి మంచి స్పందన వచ్చింది. అప్పణ్నుంచి నేను దాన్ని అనేక రచనల్లో ఉపయోగించుకున్నాను.
ఎండగా ఉంటుంది, బస్సుకోసం ఎదురు చూస్తున్నాం. చెట్టు ఉంటే దాని నీడన నిలబడతాం, షెల్టర్ ఉంటే దానిలో కూర్చుంటాం. చెట్టు నాటినవాణ్ని తలచుకుంటామా? బస్సు షెల్టర్ బోర్డు మీద రాసిన దాతల పేర్ల కేసి తిరిగి చూస్తామా? అలాగే నగరాల్లో, పుణ్యక్షేత్రాల్లో సత్రాలు, ఊళ్లల్లో హాస్టళ్లు. ఎవరో పూర్వీకులు విరాళాలిచ్చి కట్టిస్తారు. వాడుకుంటాం. వారి గురించి తలచుకోనైనా తలచుకోము. ఇలాటి వాతావరణంలో ఒక మనిషి ఎదిగేందుకు సాయపడినవారికి కృతజ్ఞతలు చెప్పాలి అనే కాన్సెప్టుతో తీసిన సినిమా కాబట్టి చూడాలనుకున్నాను. కానీ సినిమా బాగా ఆడలేదు. ఒటిటిలో చూశాను. ఓపెనింగు చూస్తూనే నాకు దాదాపు ఏడెనిమిదేళ్ల క్రితం చదివిన ‘‘అంతర్జ్వలన’’ అనే సీరియల్ గుర్తుకు వచ్చింది. ఆ తర్వాత అది 2015లో పుస్తకంగా కూడా వచ్చింది. మూడు నాలుగు భాషల్లో అనువదితమైంది. ముందుగా దాని కథ చెప్పి, దాన్ని వీళ్లు ఎలా పాజిటివ్‌గా మార్చి ప్రెజెంటు చేశారో చెప్తాను.
ఆ నవల ఒక ఎన్నారై ఆత్మకథ. రాసినది గొర్తి సాయి బ్రహ్మానందం అనే ఎన్నారై. తను చూసిన, విన్న ఎన్నారైల జీవితాలకు తన అనుభవాలను కలిపి నవల రాశారు. కథానాయకుడు నందూ అమలాపురం వద్ద ఒక పల్లెటూరిలో దిగువ మధ్యతరగతికి చెందిన వ్యక్తి. తండ్రి కోర్టు గుమాస్తాగా పని చేసినా, కొడుకు కోరిక మేరకు యింజనీరింగు తర్వాత ఎమ్మెస్ కోసం అమెరికాకు పంపించాడు. 1993లో బోస్టన్‌లో దిగిన నందూ 2005 కల్లా చాలా పెద్ద వ్యక్తి అయిపోయాడు. వాళ్ల కంపెనీ పబ్లిక్ ఇస్యూకి వెళుతోందన్న ఆనందంలో పార్టీలో మద్యం బాగా తీసుకుని తిరిగి వస్తూ యాక్సిడెంటులో చిక్కుకుని మృత్యుశయ్య మీద ఉండి తన గతానుభవాలు గుర్తు చేసుకుంటాడు. చేసుకునేట్లా చేసినది అతని అంతరాత్మ. ‘నా కథ చెప్తాను విను’ అంటూ నందూ తన ప్రస్థానం చెప్తాడు. ఇలా ఓపెనింగు చాలా యింట్రస్టింగుగా ఉంటుంది.
నందూకు యూనివర్శిటీలో హరి అనే అతను పరిచయమయ్యాడు. అతని మేనమామ వరస అయ్యే రామ్ అనే ఆయన అతన్ని అమెరికాకు రప్పించి, చదువు ఖర్చు భరించాడు. అలా మొహమాటపెట్టి తన కూతురు దివ్యనిచ్చి పెళ్లి చేద్దామని ఐడియా. అది ముందే గ్రహించిన హరి వాళ్లకు దూరంగా మసిలాడు. కానీ నందూకి రామ్ అంటే గౌరవం. రామ్‌కి నందూ అంటే వాత్సల్యంతో అతన్ని అనేక విధాల ఆదుకున్నాడు. హరి చాలాచాలా బాగా చదువుకుని, సొంతంగా ఉద్యోగం తెచ్చుకుని, తన కూతుర్ని చేసుకోనని నిరాకరించాక ‘పోనీ నువ్వు చేసుకో’ అని నందూతో అన్నాడు. కానీ ఆ అమ్మాయి ఓ అమెరికన్‌ని ప్రేమించి, ఆ విషయం చెప్తే తట్టుకోలేక గుండెపోటు తెచ్చుకుని మరణించాడు. అప్పుడు నందూ ‘రామ్ అంకుల్ మీకెవరికీ తెలియకుండా నాకు 4 వేల డాలర్లిచ్చారు’ అంటూ చెక్కు వెనక్కి యిచ్చేసి తన నిజాయితీని చాటుకున్నాడు.
ఈ విషయాన్ని తన అంతరాత్మకు నందూ చెప్పినపుడు అది ‘నిజం చెప్పు, నీకు రామ్ యిచ్చినది 28 వేల డాలర్లు కదూ, దానిలో ఏడో వంతే తిరిగి యిచ్చి ఆ కుటుంబాన్ని వంచించావు కదూ, దివ్యని చేసుకోవడం యిష్టం లేకపోయినా, రామ్‌ను ఏమార్చడానికి ఆ విషయాన్ని దాచావు కదూ’ అని నిలదీసింది. ఇలా ప్రతీ వ్యక్తి విషయంలోనూ యితను చేసిన కపటాన్ని అంతరాత్మ బయటపెట్టింది. ఈ బయటపెట్టడమంతా నవల చివర్లో జరుగుతుంది. అప్పటిదాకా నందూ చెప్పినదే నిజమని మనం అనుకుంటాం. పైకి వచ్చిన ప్రతీ వ్యక్తి హిపాక్రసీతో తన వెర్షనే చెప్తాడు, తన మచ్చలను, మరకలను దాచేస్తాడు అనే విషయం మనకు స్పష్టమౌతుంది. ఇది నవలలో థ్రిల్లింగ్ పాయింట్.
నందూ సాధారణ తెలివితేటలున్నవాడు. కానీ అతనికి కోమల్ అనే ఒక తెలివైన కొలీగ్, జాన్ అనే చాలా తెలివైన సీనియర్ తారసిల్లారు. వాళ్ల సాయంతో హైస్పీడ్ నెట్‌వర్కింగ్ స్విచ్ తయారు చేయడానికి కంపెనీ పెట్టాడు. జాన్ వేరే కంపెనీలో ఉద్యోగి కావడం చేత యితనికే బాధ్యతలన్నీ అప్పగించేశాడు. ఇతను వాళ్లందరి సాయం తీసుకుంటూనే ముఖ్యమైన ఫీచర్లున్న పేటెంట్లు తన పేర వచ్చేట్లు చూసుకున్నాడు. పనికిమాలినవాటికి వాళ్ల పేరు పెట్టాడు. ఇది కూడా చివర్లో తెలుస్తుంది. జాన్ భార్య ఎమిలీతో శృంగారం నెరపి, ఓ సారి పట్టుబడ్డాడు. జాన్ కోపంతో కంపెనీలోంచి బయటకు వెళ్లిపోయాడు. కానీ ఎమిలీ నందూపై ఒత్తిడి తెచ్చి జాన్‌ను మళ్లీ కంపెనీలోకి తీసుకునేట్లు చేసింది.
ఈ విషయాన్ని స్వగతంగా చెప్పుకున్నపుడు నందూ ఎమిలీకు తనకూ ఏ బంధమూ లేదని, ఆమెయే తనకు హఠాత్తుగా ముద్దు పెడితే ఆ విషయం వేరే వాళ్ల ద్వారా జాన్‌కు తెలిసిందని, కోపగించుకుని వెళ్లిపోయినా కొన్నాళ్లకు తనే ఔదార్యం ప్రదర్శించి జాన్‌ను వెనక్కి తీసుకున్నాననీ చెప్పుకున్నాడు. నిజమేమిటో అంతరాత్మే గుర్తు చేసింది.
పద్మ అనే ఒక కొలీగ్ యితన్ని ఎంతో ప్రేమించింది. పెళ్లి చేసుకోమని ఎన్నిసార్లు అడిగినా యితను దాటవేస్తూ పోయాడు. ఆమె నుంచి ఎంతో సాయం పొందాడు. కానీ కంపెనీయే నా లోకం అంటూ సరిగ్గా స్పందించకుండా, ఆమెకు కమిట్ కాడు. చివరకు ఎమిలీతో వ్యవహారం ఆమె కళ్లబడడంతో మనసు విరిగి దూరంగా వెళ్లిపోయింది. ఇతను తల్లి చూపించిన పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకు పద్మ కనబడింది. ఆమె భర్తతో విసిగి ఉంది. ఆర్థికపరమైన యిబ్బందుల్లో ఉంది. తన కంపెనీలో ఉద్యోగం యిచ్చి ఆదుకున్నానని స్వగతంలో చెప్పుకున్నాడు. కానీ అంతరాత్మ ‘నువ్వు ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నావు.’ అని గుర్తు చేసింది. ఈ విధంగా ఆమె ప్రేమ పొందాడు, ఆమెను అనుభవించాడు తప్ప ప్రేమను పంచలేదు.
ఇక కుటుంబ వ్యవహారాలకు వస్తే యితను వచ్చిన కొద్ది రోజులకే తండ్రి చనిపోయాడు. పోయినపుడు, సంవత్సరీకాలకు, ఆ తర్వాతా యితను వెళ్లలేదు. వీసా సాకు, ఖర్చుల సాకు, తర్వాతి రోజుల్లో కంపెనీ సాకు… ఎప్పుడూ ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది. తల్లి బాధ్యత అక్కా, బావల మీద పడేశాడు. కావాలంటే డబ్బు పంపుతానంటాడు. ఉత్తుత్తి ఒట్లతో తల్లిని ఏమారుస్తూంటాడు. చివరకు తల్లి చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి యితని తల్లిని పట్టించుకోదు. తన తలిదండ్రులను నెత్తిన పెట్టుకుని, అమెరికా రప్పించింది. మనుమడు పుట్టాడు కదాని యితని తల్లి అమెరికా వస్తే తృణీకరిస్తుంది, అవమానాల పాలు చేస్తుంది. ఇవన్నీ చూస్తూ యితను ఊరుకుంటాడు. ఇవన్నీ పట్టించుకోవడానికి కంపెనీ పనుల్లో క్షణం తీరిక లేదు అని తనకు తానే సర్దిచెప్పుకుంటాడు.
నవల చివర్లో అంతరాత్మ యీ భార్య గురించి ఏమీ చెప్పదు. ఒకవేళ పద్మ విషయం తెలిసి, ఆమె అలా మారిందేమో మనమే ఊహించుకోవాలి. ఏది ఏమైనా యితను కష్టపడి పైకి వస్తూనే, తన చుట్టూ ఉన్నవాళ్లకు టోకరా యిస్తూ, ఎదిగాడు. ఎదిగే క్రమంలో తప్పులు చేశాడు. కంపెనీలో అవకతవకలు చేశాడు. డబ్బు కాపీనం పెంచుకుని సొంతవాళ్లతో కూడా న్యాయంగా ప్రవర్తించలేదు. కంపెనీ ఆదాయం వంద మిలియన్లకు చేరుకుంది. పబ్లిక్ ఇస్యూకి వెళదామనుకుని పెద్ద పార్టీ చేశారు. 80 మంది ఉద్యోగులూ మిలియనీర్లు కాబోతున్నారన్న సంతోషంతో అందరూ చిత్తుగా తాగారు. కార్లో డ్రైవ్ చేసుకుంటూ యింటికి వస్తూంటే యాక్సిడెంటు జరిగింది. తలకు పెద్ద గాయమైంది. కోమాలోకి వెళ్లాడు. మరణం అంచుల్లో ఉండగా అంతరాత్మ పలకరించింది. నా కథ చెప్తాను అంటూ యిదంతా ఫ్లాష్‌బ్యాక్‌లో చెప్పాడు. మృత్యుముఖంలో ఉండగా కూడా ఆత్మవంచన చేసుకుని అసత్యాలు, అర్ధసత్యాలు చెప్పాడు. అంతరాత్మ దాన్ని ఎత్తి చూపించి అంతర్ధానమైంది. ఇతనిలో అంతర్జ్వలన ప్రారంభమైంది. ఇదీ నవల.
ఇక సినిమా దగ్గరకు వద్దాం. దీనిలో కూడా హీరో చైతన్య ఇండియా నుంచి అమెరికా వచ్చి, అక్కడ ఉన్న ప్రకాశ్ రాజ్ సాయం తీసుకున్నాడు. ఒక యాప్ డెవలప్ చేసి, కంపెనీ పెట్టి దశాబ్దకాలంలో అతి త్వరగా పైకి వచ్చాడు. అహం పెరిగింది. నా స్వయంకృషితోనే పైకి వచ్చాను అనుకున్నాడు. ఇదంతా నా నిర్వాకమే, దీనిలో వేరెవ్వరికీ వాటా లేదు అనుకున్నాడు. తన పాత కొలీగ్స్‌ను అవమానించి, పంపేశాడు. తొలి రోజుల్లో తనకు మేలు చేసిన ప్రకాశ్ రాజ్ తప్పనిసరి పరిస్థితుల్లో సాయం కోసం వస్తే అవమానించి పంపాడు. దాంతో అతనికి గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. అప్పుడు తెలిసింది, తనకు వెంచర్ కాపిటలిస్టుగా ముందుకు వచ్చిన వ్యక్తికి ప్రకాశ్ రాజే తన గురించి రికమెండ్ చేశాడని, గ్యారంటీ యిచ్చాడని! అది తెలిసి పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. ఛాతీలో నొప్పి వచ్చింది. అప్పుడు అతనిలో అంతరాత్మ మేల్కొంది. ప్రకాశ్ రాజ్ ఒక్కడికేనా, నువ్వు చాలామందికి ఋణపడి ఉన్నావు అంటూ గతాన్ని గుర్తు చేసింది. గతంలో వాళ్లు తనకు అపకారం చేశారనుకుంటూ వచ్చిన చైతన్య యిప్పుడు వాళ్లు తనకు ఉపకారమే చేశారని గుర్తించాడు. వెళ్లి థాంక్యూ అని చెప్పాడు. ఇదీ కథాంశం.
సినిమా ప్రారంభమైన అరగంటలోనే హీరోకి ఛాతీలో నొప్పి రావడం, అంతరాత్మ వచ్చి అతనితో సంభాషించి గతాన్ని తవ్వడం చూడగానే ఆ నవల గుర్తుకు వచ్చిందని చెప్పాను కదా. కానీ నవలలో ప్రొటగానిస్టు సజ్జనుడేమీ కాదు. మోసాలు చేసి పైకి వచ్చాడు. చనిపోయే క్షణంలో కూడా హిపాక్రసీతోనే ఉన్నాడు. తన దుష్కార్యాలు దాచి, తన వెర్షనే వినిపించాడు. నవలాంతంలో కూడా అతనికి కనువిప్పు కలిగినట్లు, రీలైజేషన్ వచ్చినట్లు ఏమీ చూపలేదు. అంతర్జ్వలన ప్రారంభమైంది అని చెప్పి వదిలేశారు. సినిమాలో మాత్రం హీరో కాబట్టి కాబోలు, త్వరగానే దిద్దుబాటు చర్యలు చేపట్టాడు. దానికి గంటన్నర పట్టింది. హీరో మొదట్లో అమాయకుడిగా, మంచివాడిగా ఎలా ఉండేవాడు, తర్వాత మార్పు ఎలా వచ్చింది అనేది నవలలో 150 పేజీల్లో చెప్పారు. కానీ సినిమాలో ఆ భాగాన్ని అతి త్వరగా చెప్పడానికి ఉపయోగించుకున్న పాత్ర రాశీ ఖన్నాది.
ఆమె అమెరికాలో హీరో కంటె ముందు నుంచీ ఉంది. ప్రకాశ్ రాజ్ జాబ్ ప్లేస్‌మెంట్ వ్యాపారం చేస్తూంటాడు. మంచివాడు, ఉపకారి. హీరో రూ.6 లక్షలు బాకీ ఉన్నా, ముందు ఉద్యోగం తెచ్చుకో, తర్వాత లెక్కలు చూసుకుందాంలే అంటూ అమెరికాకు రప్పించాడు. అతన్ని రిసీవ్ చేసుకోవడానికి ఫ్యామిలీ ఫ్రెండయిన రాశీని పంపాడు. వచ్చిన దగ్గర్నుంచి హీరో ఉద్యోగం గురించి కాకుండా, ఒక యాప్ గురించి మాట్లాడతాడు. ఏదైనా యాక్సిడెంటు జరిగితే అప్పటికప్పుడు రిపోర్టులు తీసి పంపించగల యాప్ డెవలప్ చేస్తానని అంటాడు. ఈ యాప్ ఏదో ఒక యాప్ లాటిది కాకుండా, అతని గతానికి చక్కగా ముడివేశారని చివర్లో అర్థమౌతుంది. ప్రకాశ్‌కు యిదంతా చికాగ్గా తోస్తుంది. యాప్ అయితే అమీర్‌పేటలోనే చేసుకోవచ్చు కదా, అమెరికా దాకా ఎందుకు రావడం? ముందు జాబ్ సంగతి చూడు అని మందలించాడు.
అది హీరోకు నచ్చలేదు. కమిషన్ పోతుందనే బాధతో ఆయన అలా అంటున్నాడు అనుకున్నాడు. హీరో తపన గుర్తించిన రాశీ అతనికి పెట్టుబడి యిచ్చింది. అతని కంపెనీలో ఉద్యోగినిగా చేరింది. ఈమె దివ్యలా తేలుతుందా, పద్మలా తేలుతుందా అనుకుంటే యిద్దరిలా కాదు, కాన్షస్ కీపర్‌గా తేలింది. అతనికి డబ్బిచ్చి ప్రోత్సహించడంతో పాటు, ప్రేమించి, లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉంది. అతని వలన గర్భం దాల్చి, యిలా స్వార్థపరుడిగా మారినవాడి వల్ల తల్లిని కావాలా అనుకుని గర్భం తీయించుకోబోయింది. ప్రకాశ్ రాజ్ మరణం తర్వాత అతన్ని తిట్టి తెగతెంపులు చేసుకుంది. అబార్షన్‌కు ముందు ప్రకాశ్ భార్య ఐన గైనకాలజిస్టుతో ఆమె సంభాషణ ద్వారానే హీరో ఎదుగుదల గురించి, అతనిలో వచ్చిన మార్పు గురించి మనకు తెలుస్తుంది.
హీరోకు ఛాతీ నొప్పి వచ్చి అంతరాత్మ ప్రత్యక్షమయ్యాక పారూ గురించి ఓ సారి తలచుకో అని అంతరాత్మ అనగానే గోదావరి జిల్లాల్లో గడిచిన అతని యౌవనాన్ని చూపిస్తారు. అతని తండ్రి రైల్వే ఉద్యోగి. హాకీ ఛాంపియన్. రైల్వే టీము ద్వారా జాతీయస్థాయిలో ఆడదామనుకున్న ఆశయం నెరవేరకుండా చనిపోయాడు. విధవరాలైన తల్లితో ఉంటూ, తండ్రి ఆశయం నెరవేరుద్దామని యితను అనుకుంటూన్న సమయంలో ఒక జమీందారు కూతురు పారూతో ప్రేమ పుట్టింది. ఆ విషయం తెలిసి, జమీందారు వీళ్లని బెదిరించి ఊర్నించి పంపించేశాడు. పారూ స్టేషన్‌కు వచ్చి, మీతో నేను వచ్చేస్తానంది.
అయితే యికపై భవిష్యత్తు ఎలా ఉంటుందన్న మాట వచ్చి, యిక చదువూ, సంధ్యా, హాకీ, గీకీ అన్నీ మర్చిపోయి సంపాదనలో పడాలి అని హీరో అన్నపుడు తనతో ప్రేమ అతని జీవితాశయానికి అవరోధంగా అవుతోందని గ్రహించి, ఆమె తన ప్రేమను త్యాగం చేసి, యింటికి తిరిగి వెళ్లిపోయింది. అయితే హీరో దాన్ని అపార్థం చేసుకున్నాడు. తనతో వచ్చేస్తే ఓ చిరుద్యోగి భార్యగా బతకాలని చివరి క్షణంలో అర్థమై, వెనక్కి వెళ్లిపోయిందని అనుకున్నాడు. ఇప్పుడు అంతరాత్మ ఆమె మనోగతాన్ని అవగతం చేయడంతో, తప్పు తెలుసుకుని ఇండియాకు వెళ్లి ఆమెను కలిశాడు. ఆమెకు పెళ్లయి యిద్దరు పిల్లలు. కానీ తన మాట మీరి స్టేషన్‌కు వెళ్లిందనే కోపంతో తండ్రి ఆమెతో మాట్లాడడం మానేశాడు. హీరో వెళ్లి అతనికి నచ్చచెప్పి కూతురితో మాట్లాడించాడు. తన లక్ష్యసిద్ధికై సాయపడినందుకు పారూకి థాంక్యూ చెప్పాక, అంతరాత్మ సూచన మేరకు వైజాగ్‌లోని తన పాత శత్రువు శర్వా దగ్గరకు వెళ్లాడు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2022)