సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గతంలో రాజధానిపై మాట్లాడిన మాటలేవీ గుర్తున్నట్టు లేదు. కానీ ఆయన మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఏవేవో గుర్తు చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడమే తప్ప సమాధానం చెప్పడం తమ పార్టీ వైఖరి కాదని సీపీఐ నేతలు ఆచరణ ద్వారా నిరూపించుకున్నారు. రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఇలా సవాల్ చేయడం చంద్రబాబు అభిమాన నాయకుడైన రామకృష్ణకు అసలు రుచించడం లేదు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ జగన్‌పై మండిపడ్డారు. రాజధాని వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వెళ్లడం సరైంది కాదని ఆయన తేల్చేశారు. తాను ప్రతిపక్షనేతగా శాసనసభలో అమరావతిని ఏపీ రాజధానిగా అంగీకరించిన విషయాన్ని జగన్ గుర్తుకు తెచ్చుకోవాలని రామకృష్ణ కోరడం గమనార్హం.
అమరావతిని నిర్వీర్యం చేయాలనే కుట్రతోనే జగన్ మూడు రాజధానుల అంశాన్ని మరోమారు తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ శాసనసభలో నిర్ణయించిన రాజధానిని మార్చాలనుకోవడం శాసనవ్యవస్థను అవమానించడమే అని రామకృష్ణ అన్నారు. శాసనవ్యవస్థపై జగన్ సర్కార్‌కు గౌరవం ఉంటే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే ఐవైఆర్ కృష్ణారావు రాసిన ఎవరి రాజధాని? పుస్తకావిష్కరణ సభలో రామకృష్ణ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదేందయ్యా రామకృష్ణ అప్పుడు అలా, ఇప్పుడిలా… రోజుకో మాట మాట్లాడ్డం మీ నుంచి నేర్చుకోవాలా? అంటూ సెటైర్లు విసురుతున్నారు. ఇంతకూ ఆ సభలో రామకృష్ణ ఏం మాట్లాడ్డారంటే…
“ప్రతిదీ పబ్లిసిటీనే. ఒక సారి సింగపూరు, మరొకసారి లండన్ అంటారు. తర్వాత కజికిస్తాన్ అంటారు. ఇప్పుడేమో అవన్నీ నమ్ముతారో లేదోనని బాహుబలి సెట్టింగ్స్ వేయిస్తానంటున్నారు. రాజధానిలో ఏం చేయాలని అనుకుంటున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు. ప్రజారాజధాని ఏ రకంగా ఉండాలి? దానిపై ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవడం లేదు. ఐఏఎస్ ఆఫీసర్లు చెబుతున్నదేంటంటే… లక్ష కోట్ల రూపాయలు, లక్ష ఎకరాలని. అసలు లక్ష ఎకరాల భూమి ఎందుకు? లక్ష కోట్ల రూపాయలు ఎందుకు? ఏం కట్టాలనుకున్నావు? వెనుకబడిన ప్రాంతాల పరిస్థితి ఏంటి? అభివృద్ధి అంతా ఇక్కడే జరిగితే, ఒక దగ్గరే కేంద్రీకరిస్తే వెనుకబడిన ప్రాంతాల్లో ఏం జరగాలి? హైదరాబాద్ విషయంలో ఏ తప్పు జరిగిందో , మరోమారు మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు” అని చంద్రబాబును తప్పు పట్టారు.
మరో వేర్పాటువాద ఉద్యమానికి ఆస్కారం ఇవ్వకూడదనే కదా జగన్ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ అంటూ మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. ప్రభుత్వం మారగానే తప్పు… ఒప్పు అవుతుందా అని సోషల్ మీడియాలో రామకృష్ణను ట్రోల్ చేస్తున్నారు.