హుజూరాబాద్ లో బీసీనా, రెడ్డా..?

టీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఈటల రాజేందర్‌ త్వరలో రాబోయే హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో తన భార్య (జమునా రెడ్డి) కులానికి చెందిన అభ్యర్థిని టీఆర్‌ఎస్‌ నుంచి ఎదుర్కొనే అవకాశం…

టీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఈటల రాజేందర్‌ త్వరలో రాబోయే హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో తన భార్య (జమునా రెడ్డి) కులానికి చెందిన అభ్యర్థిని టీఆర్‌ఎస్‌ నుంచి ఎదుర్కొనే అవకాశం లేదని ఈ రోజు తెలుగు పత్రికల అంచనాల ప్రకారం తేలిపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున మొదటిసారి పోటీచేసిన మాజీ యువ క్రికెటర్‌ పాడి కౌశిక్‌ రెడ్డిని పాలకపక్షం తరఫున ఉప ఎన్నికలో నిలపకూడదని పార్టీ నేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్టు సూచనలు అందుతుండడంతో పాత ప్రత్యర్థితో తలపడే అవకాశం ఈటలకు తప్పిపోయింది.

టీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కే అవకాశం ఉన్నవారి పేర్లను బట్టి చూస్తే బీసీ కులానికి చెందిన నేతనే పాలకపక్షం బరిలోకి దింపబోతోందని అర్థమౌతోంది. టీఆర్‌ఎస్‌లోకి కొత్తగా చేరిన హుజూరాబాద్‌ మాజీ టీడీపీ ఎమ్మెల్యే ఇనగాల పెద్దిరెడ్డి పేరు మొదట్లో కొద్దిగా వినిపించినా ఇక పూర్తిగా ఆ ప్రతిపాదన పక్కకు పోయినట్టే కనిపిస్తోంది. 

అలాగే, కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అయితే, పాలకపక్షాన్ని ఇక్కడ ఓడించడానికి రాజేందర్‌ భార్య జమున పోటీకి దిగుతారనే ప్రచారం కూడా ఓ మోస్తరుగా కొద్ది కాలం జరిగింది. మొత్తంమీద రాష్ట్ర మాజీ ఆరోగ్య మంత్రి, ఏడేళ్లుగా సీఎం కేసీఆర్‌ మంత్రివర్గ సహచరుడైన రాజేందర్‌కు పొగబెట్టే విషయంలో కౌశిక్‌రెడ్డి చక్కగా సహకరించారు.

అంతేగాక, ‘ఈటల రాజేందర్‌ అంతటా బీసీ కాదు, ఆయన ఇంట్లో భార్య సహా కూతురుకొడుకు–ఇలా అందరూ రెడ్లే. పేరు చివర తోక లేని రెడ్డి ఈటల హైదరాబాద్ లో మాత్రమే ఆయన బీసీ,’ అంటూ హోరెత్తించిన పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీని చేయడానికి అవసరమైన ప్రక్రియను రాష్ట్ర కేబినెట్‌ ప్రారంభించడం కీలక పరిణామం. దీని వల్ల రెడ్డి సామాజికవర్గంలో ముఖ్యమంత్రిపై అభిమానం పెరిగినా లేకున్నాగాని కీలక సమయంలో నమ్మి టీఆర్‌ఎస్‌కు ‘తమ వంతు సాయం’ అందించినోళ్లకు కేసీఆర్‌ న్యాయమే చేస్తారనే సదభిప్రాయం సర్వత్రా వ్యాపిస్తోంది. 

2004 ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల రాజకీయాల్లోకి టీఆర్‌ఎస్‌ తరఫున దిగిన రాజేందర్‌ను విజయం వరించింది. ఆ తర్వాత రెండు ఉప ఎన్నికలు సహా ఐదు శాసనసభ ఎన్నికల్లో (2004లో మొదటిసారి. తర్వాత: 2008, 2009,2010, 2014, 2018) తెలంగాణ రాష్ట్ర సమితి టికెట్‌పైన పోటీచేసి వరుస విజయాలు నమోదుచేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని కమలాపూర్‌ (ఇప్పుడు లేదు), హుజూరాబాద్‌ నుంచి మొత్తం ఆరుసార్లు పోటీచేసి గెలిచారు.

ఈ రెండింటిలో ఒక్కో అసెంబ్లీ స్థానం నుంచి మూడేసి సార్లు గెలిచారు. ఆరుసార్లు ఆయన ప్రత్యర్థులు ముద్దసాని దామోదర్‌ రెడ్డి (తెలుగుదేశం –మూడుసార్లు), కేతిరి సుదర్శన్‌రెడ్డి (ఒకసారి), పాడి కౌశిక్‌ రెడ్డి (ఒకసారి)మధ్యలో (2009లో మొదటిసారి హుజూరాబాద్‌ నుంచి పోటీచేసినప్పుడు) బీసీ అయిన వకుళాభరణం కృష్ణమోహన్‌రావు (కాంగ్రెస్‌–ఒకసారి). రాజేందర్‌ చేతిలో ఒకొక్కసారి ఓడిన పాడి కౌశిక్‌రెడ్డి (2018), వకుళాభరణం కృష్ణమోహన్‌రావు (2009)లు ఇద్దరూ ఇప్పుడు తాను వీడిన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం రాజేందర్‌కు అనుకూల పరిణామమో, కాదో తెలియదుగాని, వారికి ప్రయోజనకరంగా మారుతోంది.

గతంలో విస్తారంగా భూములున్న సంపన్న కుటుంబంలో పుట్టిన కౌశిక్‌రెడ్డి కేవలం 36 ఏళ్ల వయసులో పెద్దల సభలోకి అడుగుపెట్టడానికి సమాయత్తం కావడం  శుభ పరిణామమే. కాంగ్రెస్‌ వదిలి టీఆర్‌ఎస్‌లో చేరి (జులై 21) రెండు వారాలు నిండక ముందే హుజూరాబాద్‌లో ఆయాసపడకుండానే చాలా డైనమిక్‌గా కనిపించే కౌశిక్‌ ‘చట్టసభకు వెళ్లే దారి వెతుక్కోవడం’ చిన్న విషయం కాదు. 

బీసీ తిరుగుబాటుదారుపై బీసీయే అభ్యర్థి అయితేనా మంచిదా?

2002 నుంచీ టీఆర్‌ఎస్‌లో ఉంటూ పార్టీ టికెట్‌పై ఆరుసార్లూ గెలవడమేగాక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేతగా ఉండడం, 2014 నుంచి మొన్నటి వరకూ ఏడేళ్లకు పైగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంత్రివర్గంలో దాదాపు ‘అప్రకటిత’ కీలక మంత్రిగా కొనసాగిన రాజేందర్, చెప్పకతప్పదంటే కులానికి బీసీ–డీ (ముదిరాజ్‌).

అలాంటి బలమైన బీసీ నేత రాజేందర్‌ తెలంగాణలో బడా ఆధిపత్య కులమైన రెడ్ల అల్లుడు కావడంతో పూర్తి స్థాయి బీసీ ‘ఇమేజ్‌’ సాధించ లేదుగాని పార్టీ వీడే క్రమంలో పెట్టిన మీడియా సమావేశంలో, ‘నేను కూడా బీసీని. ముదిరాజ్‌ బిడ్డను,’ అని మరో బీసీ–డీ (మున్నూరు కాపు) మంత్రి గంగుల కమలాకర్‌ను హెచ్చరిస్తూ మాట్లాడిన సందర్భంలో ప్రకటించాల్సి వచ్చింది. గొల్లకురుమ కులాలకు గొర్రె పిల్లలు, బెస్తలు, చేపల పెంపకం వృత్తిలో ఉన్న ముదిరాజ్‌ తదితర వర్గాలకు చేప పిల్లలు పంపిణీ చేస్తూ కేసీఆర్‌ ‘బీసీల బంధు’గా అవతరించడానికి, హఠాత్తుగా దళిత బంధుగా మారడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో దాదాపు 19 ఏళ్లు తన పార్టీకి సేవలందించి, కేబినెట్‌ నుంచి, టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు పోయాక కేంద్రంలో పాలకపక్షమైన బీజేపీలో చేరిన రాజేందర్‌పై ఓ రెడ్డిని నిలబెట్టి గెలిపించడం కేసీఆర్‌కు కుదిరే పనో కాదో చెప్పలేం. కాని, తెలంగాణలో ఆధిపత్య కులంగా తిరుగులేని పేరు సంపాదించి, ఏడేళ్లుగా సీఎం పదవికి దూరమైన కులం (రెడ్డి) అభ్యర్ధిని, బీసీగా ఇటీవల బాగా ప్రచారంలోకి వచ్చిన ఈటలపై నిలబెట్టి తన ‘ఇమేజ్‌’ ఎందుకు చెడగొట్టుకోవాలనే ప్రశ్న కేసీఆర్‌కు ఎదురయినట్టు కనిపిస్తోంది.

అందుకే సోమవారం ప్రధాన తెలుగు దినపత్రికలన్నీ కూడా హుజూరాబాద్‌లో ఈటలపై టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా పోటీచేసే చాన్సున్న నేతల పేర్లు ప్రకటించాయి. ఈ పేర్లన్నీ బీసీ నాయకులవే. కాంగ్రెస్‌ నేపథ్యమున్న ఏపీ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌ (బీసీ–ఏ ఛాత్తాద శ్రీవైష్ణవ), గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ (బీసీ–డీ గొల్ల), ఎల్‌ (ఎలగందుల) రమణ (బీసీ–బీ పద్మశాలి)లో ఒకరికి టీఆర్‌ఎస్‌ టికెట్‌ రావచ్చనే అంచనాలు ప్రచారంలోకి వచ్చాయి. 

జగిత్యాల ఎమ్మెల్యేగా రెండుసార్లు, కరీంనగర్‌ ఎంపీగా ఒకసారి గెలిచి, నారా చంద్రబాబునాయుడు తెలుగుదేశం కేబినెట్‌లో దాదాపు రెండేళ్లు చేనేత మంత్రిగా చేసిన ఎల్‌ రమణ మొన్ననే రాష్ట్ష్ర తెలుగుదేశం అధ్యక్ష పదవి త్యాగం చేసి హుజూరాబాద్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయడానికి పాలకపార్టీలో చేరిన విషయం తెలిసిందే. మరి ఇంతటి సీనియర్‌ను రాజేందర్‌పై పోటీకి కారు గుర్తుపై నిలుపుతారా? అంటే అనుమానమే. 

ఇక్కడ ఉప ఎన్నికలో పోటీ బీజేపీకి, టీఆర్‌ఎస్‌కు మధ్య కాదు, రాజేందర్‌కూ కేసీఆర్‌ రాజకీయ ప్రతిష్ఠకూ మధ్య అనుకుంటే– అభ్యర్థి బీసీ అయినా, అనుభవం ఉన్న మొనగాడు అవసరం లేదు. ప్రభుత్వ పథకాల (రైతుబంధు, దళితబంధు వంటివి) పేరుతో రైతులకు, బడుగులకు అందే నగదు సాయమే టీఆర్‌ఎస్‌ను గట్టి పోటీలో ఉండేలా చేస్తుందనేది పార్టీ నాయకత్వం అంచనా. అలాంటప్పుడు 20 ఏళ్ల క్రితం తెలుగుదేశం నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన టీఎస్‌ఆర్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు, ఈటల పూర్వ అనుచరుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ అనే యువకుడైనా సరిపోతాడు పాలకపక్షం తరఫున ఉప ఎన్నికలో పోటీచేయడానికి అనే భావన టీఆర్‌ఎస్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. 

వకుళాభరణం కృష్ణమోహన్‌ ఇదివరికే అంటే 2009లోనే ఈటల చేతిలో 41,717 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. రమణ ఎన్నికల్లో గెలిచింది చివరిసారిగా 2009లోనే. ఇన్నాళ్లకు మళ్లీ పాలకపక్షంలో చేరి కుదురుకోకముందే, అపజయమెరగని రాజేందర్‌తో తలపడే సాహసం చేస్తారా? అంటే అనుమానమే. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో కౌశిక్‌రెడ్డిని 43,719 ఓట్లతో ఈటల ఓడించారు.

గతంలో టీఆర్‌ఎస్‌ టికెట్‌పై పోటీచేసి రాజేందర్‌ అత్యధికంగా సాధించిన మెజారిటీ 79,227 ఓట్లు. 2010 ఉప ఎన్నికలో ఆయన దివంగత మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డిని ఓడించి తెలంగాణ ఉద్యమ వేడిలో ఇంత ఆధిక్యం సాధించగలిగారు. 2014 సాధారణ ఎన్నికల్లో కూడా ఆయన టీఆర్‌ఎస్‌ గుర్తుపై తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డిని 57,037 ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఇలా ఐదుసార్లు తన సమీప ప్రత్యర్థులైన రెడ్లపై సునాయాసంగా గెలిచిన రాజేందర్‌ ఒకసారి తోటి బీసీ అయిన కృష్ణమోహన్‌ను ఓడించారని పైన చెప్పాను. 

మరి తన ఏడో అసెంబ్లీ ఎన్నికలో, తాను పోటీ చేయబోయే మూడో ఉప ఎన్నికలో ఆయన ఏ బీసీ అభ్యర్థిని ఓడిస్తారు? లేదా తాను ఐదుసార్లు ఓడించిన తన భార్య కులానికి చెందిన అభ్యర్థి చేతిలో అనూహ్యంగా ఓడిపోతారా? అని ప్రశ్నిస్తే ఏం జవాబు చెప్పాలి? కొత్త బీసీ ప్రత్యర్థి పాలకపక్షం టికెట్‌పై రంగంలోకి దిగితే రాజేందర్‌ గెలుపు సాధ్యమౌతుందేమో!

అలాగే బలవంతుడైన రెడ్డిని బరిలోకి దింపి హుజూరాబద్‌లో హీటు పెంచి ఓడిపోయేకంటే పాలకపక్షం రాష్ట్రవ్యాప్తంగా తెలియని బీసీ అభ్యర్ధితో నామినేషన్‌ వేయించి హుజూర్‌నగర్, నాగర్జునసాగర్‌లో మాదిరి ‘కష్టపడడమే’ మేలనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. 1983 జనవరిలో తెలుగుదేశం స్థాపకుడు ఎన్‌.టి. రామారావు ముఖ్యమంత్రి కావడానికి దోహదం చేసిన అసెంబ్లీ ఎన్నికల్లో తన మిత్రపక్షం రాష్ట్రీయ సంజయ్‌ మంచ్‌ టీడీపీ సైకిల్‌ గుర్తుపై పోటీచేసింది. 

పూర్వపు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి నుంచి మంచ్‌ తరఫున సైకిల్‌ గుర్తుపై (టీవీ ఛానళ్లు చూసే వారికి అత్యంత పరిచయం ఉన్న ముఖం) గోనె ప్రకాశ్‌రావు గెలిచారు. తెలుగుదేశంతో పేచీపడి  కొద్ది నెలలకే ఆయన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను సీఎం అయిన కొన్ని రోజులకే జరిగిన ఈ పెద్దపల్లి ఉప ఎన్నికలో ఎన్టీఆర్‌ ఒక ప్రయోగం చేశారు.

టీడీపీకి బీసీల గట్టి మద్దతున్న పార్టీగా వచ్చిన పేరు నిలబెట్టుకునేందుకు తెలుగుదేశం తన టికెట్‌ను బీసీ (పద్మశాలీ) వి.రమణయ్యకు ఇచ్చింది. అయితే, బీసీ అయిన రమణయ్యను అప్పటికి కొన్ని నెలల క్రితం గోనె ప్రకాశరావు చేతిలో పరాజయం పాలైన కాంగ్రెస్‌ అభ్యర్థి గీట్ల ముకుందరెడ్డి 3,269 ఓట్లతో ఓడించి సంచలనం సృష్టించారు. దీంతో ఈ ఉప ఎన్నిక ఫలితం 38 ఏళ్ల క్రితం పెద్ద చర్చనీయాంశమైంది. 

తెలంగాణలో బీసీకి పాలకపక్షం టికెట్‌ ఇచ్చినంత మాత్రాన అభ్యర్థి గెలుపు ఖాయమనుకుంటే పొరపాటనీ, ఆయా కాలాలను బట్టి ఎన్నికల్లో కులంతోపాటు అనేక అంశాలు అభ్యర్థుల జయాపజయాలు నిర్ణయిస్తాయని రాజకీయ పండితులు మరోసారి తేల్చిచెప్పేశారు. మరి, 1983 పెద్దపల్లి ఉప ఎన్నిక స్థాయిలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితానికి కూడా అంత ప్రచారం లభిస్తుందా? ఫలితం అంత అనూహ్యంగా ఉంటుందా? అనే ప్రశ్నలకు జవాబులు ఎవరు చెబుతారు!

నాంచార‌య్య మెరుగుమాల‌