అతడి వయసు 70 ఏళ్లు.. రామ-కృష్ణ అంటూ ఇంట్లో కాలం వెళ్లదీయాల్సిన వయసు. కానీ కామంతో రగిలిపోయాడు. ఆ వయసులో 14 ఏళ్ల మైనర్ ను రేప్ చేశాడు. చెబితే చంపేస్తానని బెదిరించాడు. అలా 6 నెలల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా 14 ఏళ్ల చిన్న వయసులో ఆమె గర్భవతి అయింది. హైదరాబాద్ శివార్లలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
జిన్నారం మండలం కిష్టాయిపల్లి గ్రామానికి చెందిన రుద్రయ్యకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కూలి చేసుకునే బతికే కుటుంబం వాళ్లది. అందుకే 14 ఏళ్ల తన కూతుర్ని కూడా ఓ ఇంట్లో పనికి పెట్టాడు రుద్రయ్య. ఆ ఇంట్లో ఉండే 70 ఏళ్ల దయానంద్, ఆ బాలికపై కన్నేశాడు. ఓ రోజు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు.
అలా అమ్మాయిని బెదిరించి 6 నెలలుగా అకృత్యానికి పాల్పడుతున్నాడు దయానంద్. అయితే వారం రోజులుగా బాలికకు వాంతులు అవుతున్నాయి. కడుపులో తిప్పుతున్నట్టు అనిపిస్తుండడంతో తండ్రి ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. బాలిక నెల తప్పిందని, ప్రస్తుతం మూడో నెల గర్భమని వైద్యులు తేల్చారు.
దీంతో విషయం తెలుసుకున్న రుద్రయ్య, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దయానంద్ ను అదుపులోకి తీసుకున్నారు. సమాజంలో అమ్మాయిలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోందనడానికి ఇదొక ఉదాహరణగా నిలిచింది.