కరోనా రాకపోయి ఉంటే.. ఈ వేసవి సీజన్లో ఎన్ని ఆఫర్లో. ఆన్ లైన్ ఆఫర్లతో పాటు, బయట షాపుల్లో కూడా సున్నావడ్డీ, నో కాస్ట్ ఈఎంఐ అంటూ ఊదరగొట్టేవారు. ఫ్రిజ్, ఏసీ, కూలర్.. వీటికి డిమాండ్ అమాంతం పెరిగిపోయేది. అడ్వర్టైజ్ మెంట్లతో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పండగ చేసుకునేవి. కానీ కరోనాతో సీన్ అంతా రివర్స్ అయింది.
ఫ్రిజ్, ఏసీ, కూలర్.. వాటిని కొనేవారు లేరు, అమ్మేవారు లేరు. అందుకే యాడ్స్ కూడా లేవు. అయితే ఇదే సమయంలో ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులకు మార్కెట్ పెరిగింది. మా కంపెనీ డ్రింక్ తాగండి రోగనిరోధక శక్తి పెంచుకోండి, మా బ్రాండ్ చవనప్రాశ రోజూ తీసుకోండి.. పుష్టిగా ఉండండి. ఇదిగో ఈ లిక్విడ్ తో మీ ఇళ్లు శుభ్రం చేసుకోండి.. వైరస్, బ్యాక్టీరియాలను తరిమేయండి. ఇలాంటి వాటికి స్పేస్ ఎక్కువైపోయింది.
ఆన్ లైన్లో కూడా ఆహారానికి సంబంధించి, రోగనిరోధక శక్తిని పెంచే ఉత్పత్తులనే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. ఉచిత సలహాలిచ్చే యూట్యూబ్ ఛానెళ్ల రేటింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఒకరకంగా ఇప్పుడంతా ఇమ్యూనిటీ పవర్ దే పైచేయి అన్నమాట. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు, కరోనా వచ్చినా మనకేమీ కాకుండా ఉండాలంటే ఏంచేయాలని ఆలోచిస్తున్నారు ప్రజలు.
వీరి ఆలోచనలే పెట్టుబడిగా కంపెనీలన్నీ ఇమ్యూనిటీ పవర్ పెంచే ప్రోడక్ట్స్ తో మార్కెట్ ని ముంచెత్తుతున్నాయి. విటమిన్ ట్యాబ్లెట్ల వాడకం కూడా కరోనా టైమ్ లో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిందని మెడికల్ వర్గాల సమాచారం. ఇక హెల్త్ డ్రింక్ ల కోసం వచ్చేవారు కూడా ఎక్కువయ్యారట, సంప్రదాయ చవనప్రాశలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. వాడతారో లేదో తర్వాత సంగతి.. ముందు ఓ బాటిల్ కొని ఇంట్లో పెట్టాలనే పాలసీలో అందరూ లాక్ డౌన్ టైమ్ లో వీటి కోసం ఎగబడుతున్నారు.
ఇలాంటి ఉత్పత్తులు వాడినా.. సహజంగా లభించే పదార్థాలతో రోగనిరోధక శక్తి పెంచుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. పాలు, గుడ్లు, పండ్లు, తాజా కూరగాయలు, తృణ ధాన్యాలు రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు. ఇక యాడ్స్ కు సంబంధించి శానిటైజర్లు, హ్యాండ్ వాష్ కిట్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎక్కడ చూసినా ఇవే యాడ్స్. ఇప్పుడు వీటిదే డామినేషన్ అంతా.