దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6654 కరోనా పాజిటివ్ కేసులు నిర్థారణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య లక్షా పాతిక వేలకు చేరుకుంది. మరోవైపు నిన్న ఒక్క రోజే కరోనా కారణంగా 137 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 3720కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ఈరోజు ఉదయం 8 గంటల నాటికి దేశవ్యాప్తంగా 51,783 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 69,597 మందికి ట్రీట్ మెంట్ కొనసాగుతోంది.
ఆంక్షల సడలింపు తర్వాత దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరించారు. అయినప్పటికీ కేంద్రం మినహాయింపులకే మొగ్గుచూపింది. ఫలితంగా ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. 5600 కేసులు నమోదైనప్పుడు ఒక రోజులో అదే గరిష్టం అనుకున్నాం. ఆ తర్వాత 6088 కేసులు నమోదయ్యాయి. నిన్న ఏకంగా 6654 కేసులు రికార్డ్ అయ్యాయి. ఇలా ఏరోజుకారోజు గరిష్టాన్ని తాకుతూ కరోనా కేసులు నమోదవ్వడం ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 4 రోజుల్లో ఏకంగా 25వేల కొత్త కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
ఎప్పట్లానే మహారాష్ట్రలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 44582కు పెరిగింది. మృతుల సంఖ్య 1517కు చేరుకుంది. మహారాష్ట్ర తర్వాత గుజరాత్, తమిళనాడు, ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.
మరో వారం రోజుల్లో లాక్ డౌన్ -4 కూడా ముగుస్తుంది. ఆ తర్వాత మరోసారి లాక్ డౌన్ విధించే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే దాదాపు మినహాయింపులు ఇచ్చేశారు. రాత్రిపూట కర్ఫ్యూ కూడా పూర్తిగా ఎత్తేస్తారు. వచ్చే నెల నుంచి రైలు, విమాన సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చేస్తాయి. మరోవైపు కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలే ఎవరికి వారు స్వీయ నియంత్రణ, శుభ్రత పాటించడం అత్యవసరం.