మూవీ రివ్యూ: నేను మీకు బాగా కావాల్సిన వాడిని

టైటిల్: నేను మీకు బాగా కావాల్సిన వాడిని రేటింగ్: 2/5 తారాగణం: కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్, సోను ఠాకుర్, ఎస్వీ కృష్ణా రెడ్డి, బాబా భాస్కర్, గెటప్ శీను తదితరులు కెమెరా: రాజ్…

టైటిల్: నేను మీకు బాగా కావాల్సిన వాడిని
రేటింగ్: 2/5
తారాగణం: కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్, సోను ఠాకుర్, ఎస్వీ కృష్ణా రెడ్డి, బాబా భాస్కర్, గెటప్ శీను తదితరులు
కెమెరా: రాజ్ నల్లి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి 
సంగీతం: మణిశర్మ
నిర్మాత: కోడి దివ్య దీప్తి
దర్శకత్వం: శ్రీధర్ గాదె
విడుదల తేదీ​: 16 సెప్టెంబర్ 2022

కిరణ్ అబ్బవరం కి యూత్ లో గుర్తింపుంది. అతని సినిమాల్ని ఇష్టపడే ఆడియన్స్ తయారవుతున్నారు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి ఎదగడం అంత ఈజీ కాదు. కానీ తన ప్రతిభ వల్ల, నిరంతర కృషి వల్ల ఎదుగుతున్నాడు. కానీ ఎందుకో ఒక్కో మెట్టు ఎక్కే ప్రయత్నంలో కాస్త అడుగు పెద్దది చేసి నాలుగైదు మెట్లు ఒకేసారి ఎక్కేయాలనుకుని మాస్ హీరోగా ముందుకొచ్చాడు. ఆ ప్రయత్నంలో సఫలీకృతుడై ఐదుమెట్లు ఎక్కేసాడా లేక అడుగు తడబడి ఉన్న చోటుకే జారాడా? చూద్దాం. 

పబ్బులో బాగా తాగేసి తూలిపోతున్న హీరోయిన్ కి, కారు డ్రైవర్ గా తెర మీదకొచ్చిన హీరోకి మధ్యన సీనుతో కథ మొదలౌతుంది. ఆమెను కిడ్నాపర్స్ నుంచి హీరో కాపాడడం, తాను ఎందుకంతలా తాగిందో చెప్పడం తర్వాత కథనం. ఇంటర్వెల్ వరకు హీరోయిన్ ఫ్లాష్ బ్యాకే. ఇక ద్వితీయార్థంలో హీరో ఫ్లాష్ బ్యాక్ మొదలౌతుంది. చివరికి ఇద్దరి కథలు ఒకచోట చేరి ముగుస్తాయి. 

ప్రేమించడం, లేచిపోవడం, తండ్రికి గుండెపోటు రావడం, హీరో వచ్చి హీరోయిన్ ని ఆదుకోవడం, చివరికి ఒక సామాజిక పాఠం చెప్పడం…ఈ అంశాలతో ఎన్ని సినిమాలొచ్చాయో చెప్పమంటే ఆయ్యే పని కాదు. ఆ మూసలో ఇది ఇంకొకటి. 

పెద్ద హీరోలే మాస్ కథల విషయంలో తప్పటడుగులు పడతాయని భయపడుతున్న తరుణమిది. రొటీన్ మాస్ మసాలా కంటెంట్ ని భరించే ఓపిక నేటి ఆడియన్స్ కి తగ్గుతోంది. మూస ధోరణులు పక్కనబెట్టి ఏదైనా కొత్తదనం ఉన్న కథని ఎంచుకుంటున్నారు. 

అలాంటిది రెండు మూడు సినిమాలతో కాస్త యూత్ లో పేరు తెచ్చుకుని ఇంకా మిగిలిన ఆడియన్స్ కి ముఖపరిచయం కూడా కాని యువనటుడు మాస్ కథతో, ఐటం సాంగ్స్, ఫైట్స్ గట్రా సరంజామాతో, భారీ హీరో ఇంట్రడక్షన్ సీన్స్ తో ముందుకొస్తే ఎలా ఉంటుంది? 

చిన్నపిల్లలు పెద్దవాళ్లల్లా వేషాలేసుకుని ఎవర్నో ఇమిటేట్ చేస్తుంటే సరదాగా కాసేపు చూసి ముచ్చటపడతాం తప్ప వారు పోషిస్తున్న పాత్రలోకి మమేకం కాము. ఇక్కడ కిరణ్ అబ్బవరం ని రొటీన్ మాస్ హీరోగా చూస్తుంటే అలాగే అనిపించింది. 

ఒకవేళ ఇటువంటి సినిమాలో నటించే ఆలోచన ఉన్నప్పుడు పెద్ద హీరోయిన్స్ ని, భారీ ప్యాడింగ్ ఆర్టిస్టుల్ని పెట్టుకుని చేసుండాల్సింది. అప్పుడు చూసే ఆడియన్స్ కి కాస్తైనా కన్విన్సింగ్ గా ఉంటుంది. ఆ పని కూడా చెయ్యలేదు. 

ద్వితీయార్థంలో హీరో ఒక రాయలసీమ ప్రాంతం లాంటి ఏరియా కి వెళ్ళి ఫైట్ చేస్తాడు. ఆ ట్రాకులో అమ్మాయి తండ్రిగా ఒకతను కనిపిస్తాడు. బాలనటుడికి గెడ్డం మీసం తగిలించినట్టుంది తప్ప అసలా పాత్ర ఏజ్ కి ఆ నటుడి గేజ్ కి అస్సలు సరిపోలేదు. ఇలాంటి క్యాస్టింగ్ మిస్టేక్స్ చాలానే ఉన్నాయి. 

హీరోయిన్ తండ్రి పాత్రలో ఎస్వీ కృష్ణారెడ్డి కనిపించారు. ఒకతరం ప్రేక్షకులకి ఈయన తెలుసు కానీ ఇప్పటి యువతకి ఆయన కూడా కొత్తే. 

ఇలా ప్యాడింగ్ విషయంలో పెద్ద పొరపాటు చేసి, మాస్ బిల్డప్పులు మాత్రం భారీగా ఇచ్చేస్తే ప్రేక్షకులకి నాన్ సింక్ కొట్టేసింది. 

కిరణ్ అబ్బవరం ట్యాలెంటెడ్ నటుడు. మంచి ఈజ్ ఉంది. మాస్ హీరో లక్షణాలున్నాయా అంటే ఉన్నాయి కానీ ఈ రేంజ్ బిల్డప్పులకి సరిపోడు. మాస్ ఎలిమెంట్స్ తోటే తన పర్సనాలిటీకి, ఏజ్ కి తగినట్టుగా కథా కథనాలు రాసుకోవాలి.

గతంలో కూడా చాలామంది హీరోలకి కాస్త గుర్తింపు రాగానే మాస్ హీరోలైపోవాలనే తపనతో పక్కన దారి పట్టి ఆవిరైపోయినవాళ్లున్నారు. కిరణ్ అబ్బవరం మాత్రం ఈ ఒక్క పొరపాటుతో ఆపి కాస్త విభిన్న తరహా చిత్రాలతో అలరిస్తాడని ఆశించాలి. 

టెక్నికల్ గా చూస్తే మణిశర్మ సంగీతం బాగుంది. ఒకటి రెండు పాటలు సాహిత్యపరంగా కూడా భాషావిలువలతో కూడి ఉన్నాయి. ముఖ్యంగా “మనసే చిలకలా” ఈ కోవలో ఆకట్టుకుంది. అలాగే “షెనాయ్ మోగిందే…” ఎక్కడో విన్న పాత పాటలా అనిపించినా ట్యూన్ పరంగా బాగుండి ఆకట్టుకుంది. ఇక ప్రధమార్థంలో వచ్చిన ఐటం సాంగ్ 1990-2000 ల నాటి అనేకమైన ఐటం పాటలకి ట్రిబ్యూట్ లా ఉంది. నేపథ్య సంగీతం జస్ట్ పర్వాలేదంతే. 

బాబా భాస్కర్ హీరో పక్కన కనిపిస్తూ కాసేపు వినోదాన్ని పంచాడు. అలాగే కిరణ్ అబ్బవరం సినిమాల్లో తరచూ కనిపించే ఒక నటుడు ఇందులో సెక్యూరిటీ గార్డ్ గా కనిపించాడు. 

మిగిలిన పరివారమంతా మామూలే. కథా కథనాలు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నాటి సినిమాల్ని గుర్తుచేస్తాయి. 

పాతచింతకాయ కథ, బిలో యావరేజ్ దర్శకత్వం, మూస మాస్ కథనం ఇందులో మైనస్సులైతే మణిశర్మ పాటలు, కిరణ్ నటన మాత్రం ప్లస్సులు. 

క్లైమాక్స్ లో ఒక ట్విస్టునిచ్చి క్లోజ్ చేయడం బాగానే ఉంది కానీ మళ్లీ అక్కడొక పాట పెట్టడం అతిగా ఉంది. కిరణ్ తనని తాను చాలా ఎక్కువ చేసుకుని ప్రేక్షకులని తక్కువ అంచనా వేసిన సినిమా ఇది.

బాటంలైన్: మరీ అంత కావాల్సినవాడైతే కాదు