సీబీఐ…నాడు వ‌ద్దే వ‌ద్దు, నేడు ముద్దు

తాము అధికారంలో ఉంటే మాత్రం సీబీఐ వ‌ద్దే వ‌ద్దు. ప్ర‌తిప‌క్షంలో ఉంటే మాత్రం ఎంతో ముద్దు. ఇది ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వైఖ‌రి. మ‌త్తు వైద్యుడు డాక్ట‌ర్ సుధాక‌ర్‌రావు కేసు ద‌ర్యాప్తు బాధ్య‌త‌ల‌ను సీబీఐకి…

తాము అధికారంలో ఉంటే మాత్రం సీబీఐ వ‌ద్దే వ‌ద్దు. ప్ర‌తిప‌క్షంలో ఉంటే మాత్రం ఎంతో ముద్దు. ఇది ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వైఖ‌రి. మ‌త్తు వైద్యుడు డాక్ట‌ర్ సుధాక‌ర్‌రావు కేసు ద‌ర్యాప్తు బాధ్య‌త‌ల‌ను సీబీఐకి అప్ప‌గిస్తూ హైకోర్టు ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు మొద‌లుకుని ఆ పార్టీ నేత‌లంతా సీబీఐ ద‌ర్యాప్తును స్వాగ‌తిస్తూ ర‌క‌ర‌కాల కామెంట్స్ చేశారు.

డాక్టర్‌ సుధాకర్‌ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. మాస్క్‌లు సరఫరా చేయాలని కోరినందుకు సుధాకర్‌పై పోలీసుల దౌర్జన్యం, అక్రమ నిర్బంధం, దుష్ప్రచారం వెనుక దాగి ఉన్న ప్రభుత్వ కుట్రను సీబీఐ వెలికితీయగలదని ఆయ‌న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఆయ‌న పుత్ర‌ర‌త్నం ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు. ‘మాస్కులు అడిగినందుకు ఒక దళిత డాక్టర్‌ ఎదుర్కొన్న అవమానాలు, బెదిరింపులు, వేధింపులు… అన్నీ సీబీఐ విచారణలో బయటపడతాయి’ అని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.  

వీరే కాకుండా టీడీపీ నాయ‌కులంతా సీబీఐ ద‌ర్యాప్తులో ప్ర‌భుత్వ కుట్ర బ‌య‌ట‌ప‌డుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. అంతా బాగుంది. మ‌రి ఇదే చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు సీబీఐ విష‌యంలో వ్య‌వ‌హ‌రించిన తీరేంటి? 2018, న‌వంబ‌ర్ 8న నాటి రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అనురాధ ర‌హ‌స్యంగా ఇచ్చిన ఉత్త‌ర్వుల్లో ఏముందో చెప్పాల్సిన ప‌నిలేదా?

సీబీఐ కేంద్రం చేతిలో పావుగా మారింద‌ని, అది ఏపీలో అడుగు పెట్ట‌కుండా  బాబు స‌ర్కార్ జారీ చేసిన ఉత్త‌ర్వులు కాదా? సీబీఐ కంటే రాష్ట్ర ద‌ర్యాప్తు సంస్థ‌లే మెరుగ్గా ప‌నిచేస్తాయ‌ని, త‌మ అనుమ‌తి లేకుండా ఏపీలో ఏ కేసు విచార‌ణ చేయ‌కూడ‌ద‌ని, అస‌లు రాష్ట్రానికే రాకూడ‌ద‌ని సీబీఐపై ఆంక్ష‌లు విధించ‌డాన్ని అప్పుడే మ‌రిచిపోయారా?  నాడు ప‌నికి రానిది, నేడు మాత్రం ఎలా ప‌నికొచ్చిందో చంద్ర‌బాబు అండ్ కోకు చెప్పే ద‌మ్ము ఉందా?  విధానాలు, అభిప్రాయాలు, విశ్వాసాలు అనేవి అధికారంలో ఉంటే ఒక‌లా, ప్ర‌తిప‌క్షంలో ఉంటే మ‌రోలా ఉంటాయా చంద్ర‌బాబు? ఇదేనా 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వ‌శాలి నీతి? 

త్వరలోనే టాలీవుడ్ కి గుడ్ న్యూస్