మనమంతా చిన్నప్పుడు తల్లి పాలు తాగుతూ, పురాణ గాథలు వింటూ పెరిగిన వాళ్లమే. దీపావళి ఎందుకు జరుపుకుంటామో అమ్మమ్మలు, నాయనమ్మలు వీరోచితంగా చెబుతుంటే ఎంతో శ్రద్ధగా విన్నాం. నరకాసురుడిని వధించడంతో మన జీవితాల్లో వెలుగులొచ్చాయని కథలుకథలుగా విన్నాం. ఎందుకో గానీ, ఆ దీపావళికి మే 23వ తేదీకి అవినాభావం సంబంధం ఉందని పిస్తోంది. ఆ నరకాసురుడు పదేపదే గుర్తొస్తున్నాడు. ఆ రాక్షసుడి ఆనవాళ్లు ఇంకా మనతోనే ఉన్నాయనిపిస్తోంది.
గత ఏడాది “నారా”సురుడి పాలనకు చరమ గీతం పాడిన రోజు. దీన్ని జనంలో చర్చకు రాకూడదనే నారాసుర అనుచర రాక్షస యంత్రాంగం అంతా కూడబలుక్కున్నట్టు వ్యవహరిస్తున్నాయి.
మరో సారి ఏపీ సర్కార్‌కు షాక్, జగన్‌కు దెబ్బమీద దెబ్బ, తీన్…మార్-హైకోర్టులో ఏపీ సర్కార్‌కు వరుస దెబ్బలు…లాంటి పతాక శీర్షికలతో ఎల్లో మీడియా పండుగ చేసుకుంటోంది. దీంట్లో తప్పు పట్టాల్సిందేమీ లేదు. సహజమే…ప్రత్యర్థులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పులు, ఆదేశాలు వచ్చినప్పుడు ఎవరైనా అదే పనిచేస్తారు. కానీ ఇక్కడ జగన్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అంశాలున్నాయి.
మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు…అదే కుక్కను మనిషి కరిస్తే వార్త అవుతుందంటారు. తాజాగా ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా సంబరాలకు కారణమైన అంశాలకు ఇదే సూత్రం వర్తిస్తుంది. ఎందుకంటే జగన్ సర్కార్ తీసుకున్న పాలనాపరమైన నిర్ణయాలపై ఏవో సాంకేతిక అంశాలను తీసుకుని న్యాయస్థానాల ద్వారా పదేపదే అడ్డు తగలగడం బహుశా దేశంలో మరెక్కడా ఉండదేమో.
అందులోనూ నిన్న హైకోర్టులో మూడు అంశాలపై కీలక తీర్పులు, ఆదేశాలు రావడం, ఈ రోజు పచ్చ పత్రికల్లో పతాక శీర్షికలు కావడం, మరోవైపు ప్రజాకోర్టులో జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించి ఏడాది కావడం యాదృచ్ఛికమే కావచ్చు కానీ, సీరియస్‌గా ఆలోచించాల్సిందే. జగన్ నాయకత్వంలోని వైసీపీ ఘన విజయం గురించి ఆ పత్రికల్లో అక్షరం కూడా రాయలేదంటే…మీడియాగా తమ ఓటమి గురించి చెప్పుకోవాల్సి వస్తుందని వాటికి భయం. అందుకే హైకోర్టులో జగన్ సర్కార్‌కు వ్యతిరేక తీర్పులపై పేజీలకు పేజీలు కథనాలు కుమ్మరించారు.
ప్రజల మనసులను ఆకట్టుకోలేని వాళ్లు, ఇతరత్రా మార్గాల ద్వారా పాలనకు అడ్డుతగులుతూ ఉండొచ్చు. దేవతలు యజ్ఞయా గాలు చేస్తుంటే రాక్షసులు ఆటంకాలు కలిగించడాన్ని మనం అనేక పురాణ కథల్లో విన్నాం. అంటే ఒక మంచి పనికి అవరోధాలు కలిగించే వాళ్లు ఏ కాలంలోనైనా ఉంటారు. ఇప్పుడు “నారా”సురుడిని చూస్తున్నాం.
గత ఏడాది నారాసురుడికి అంతం పలికామని జనం అనుకున్నారు. కానీ ఆ రాక్షసుడి ప్రాణం ఎక్కడుందో మరోసారి తెలిసి వచ్చింది. కానీ ఏ అన్యాయాన్నైనా ప్రకృతి ఒక పరిధి మేరకే భరిస్తుంది. మనిషికి సహనం ఉండాలే గానీ, దుర్మార్గులకు కాలం విధించే శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో తెలుసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
-సొదుం