అడిగితే చేసేవారిని నాయకులంటారు. అడగకుండానే చేసేవారిని ‘రూలర్ ’ అంటారు. దిశ చట్టం మొదలకుని అభివృద్ధి వికేంద్రీక రణ కోసం ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటు వరకు ఏ ఆందోళనలు, డిమాండ్లు లేకున్నా సాకారమవు తున్నా యంటే…దానికి కారణం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఎందుకంటే ఆయనో రూలర్. 3,600 కిలోమీటర్ల పైచిలుకు నడిచిన మహాపాదయాత్రికుడిగా అడగడుగునా జనం సమస్యలను చదివిన నేత.
ప్రజా కంటక పాలనకు శరమగీతం పాడిన రోజు… రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అధికార పార్టీని తునాతునకాలు చేసి తిరుగులేని ప్రజాబలంతో జగన్ నాయకత్వానికి బ్రహ్మరథం పట్టిన రోజు…అదే వైఎస్సార్ సీపీ అఖండ విజయం సాధించిన రోజు…సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అఖండ విజయం సాధించి నేటికి సరిగ్గా ఏడాది అవుతోంది.
2019 మే 11న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగగా అదే నెల 23న ఫలితాలు వెలువడ్డాయి. 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలుచుకుని 50 శాతం ఓట్లతో విజయ దుందుభి మోగించిన రోజు .‘కావాలి జగన్…రావాలి జగన్’ జన నినాదం నిజమైన రోజు. ఏపీకి సరికొత్త రూలర్‌ను ఎన్నుకున్న రోజు. ఈ సందర్భంగా జగన్ విజయ ప్రస్థానంపై ప్రత్యేక వ్యాసం.
టీడీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాల వల్ల కష్టనష్టాలకు గురవుతూ మూగరోదన చేస్తున్న వారి గుండె చప్పుడును వినే హృదయమున్న పాదయాత్రికుడు కావడం, అలాంటి వారికి జీవితంపై భరోసా కల్పించేందుకు ‘నేను విన్నాను-నేను ఉన్నాను ’ అనే ఓదార్పు మాటలు ప్రతిపక్షంలో ఓ నినాదమయ్యాయి. అధికారంలోకి వచ్చాక ఆ నినాదమే పాలనా విధానమైంది. ఎల్జీ పాలిమర్స్ విషవాయువు వల్ల మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఇవ్వడంతోనే ఆ విషయం నిరూపితమైంది. అలాగే మిగిలిన బాధితులను ఆదుకున్న విధానం ప్రతిపక్షాల మన్ననలు సైతం పొందింది, అధికార బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే పింఛన్ సొమ్మును మొదటి విడతగా రూ.250 పెంచుతూ ఫైల్‌పై మొదటి సంతకం చేయడం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం.
అంతేగా ఇంతటి కరోనా విపత్తులోనూ ప్రజలకు తానిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ముందుకెళ్లడం ప్రతి ఒక్కర్నీ ఆశ్చర్యపరుస్తోంది. నవతర్నాల అమలుకు ఏకంగా క్యాలెండర్‌నే విడుదల చేయడం జగన్ సాహసానికి, కార్యదక్షతకు నిలువెత్తు నిదర్శనం.
ఎన్నికలకు రెండేళ్లు ముందుగానే నవరత్నాల ప్రకటన
ప్రజలను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేసే పథకాలను ప్రవేశ పెట్టాలని వైఎస్ జగన్ మొదటి నుంచి ఆలోచిస్తూ వస్తున్నారు. ఆ మేధోమధనం నుంచే నవరత్నాలు పుట్టుకొచ్చాయి. 2017, జూలైలో గుంటూరులో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో 9 హామీలను ‘నవరత్నాలు’ పేరుతో ప్రకటించారు. ఇవే 2019 ఎన్నికల మ్యానిఫెస్టోగా తర్వాత కాలంలో రూపు దిద్దుకున్నాయి.
వైఎస్సార్ నవరత్నాలుః
1.వైఎస్సార్ రైతు భరోసా 2.అందరికీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 3.అమ్మ ఒడి 4.పింఛన్ల పెంపు 5. పేదలందరికి ఇళ్లు 6.ఫీజురీ ఎంబర్స్‌మెంట్ 7.వైఎస్సార్ జలయజ్ఞం 8.మద్యపాన నిషేదం 9.వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత
ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారంః
దివంగత ముఖ్యమంత్రి, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో వైఎస్సార్‌సీపీ అనే పేరుతో వైఎస్ జగన్ కొత్త పార్టీని స్థాపించారు. 2003లో చంద్రబాబు రాక్షస పాలనలో నరకం అనుభవిస్తున్న ప్రజలకు విముక్తి కల్పించేందుకు నాటి ప్రతిపక్ష నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు సుమారు 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆ తర్వాత ఆయన నాయకత్వంలో 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
తండ్రి పాదయాత్ర స్ఫూర్తితో వైఎస్ జగన్ ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. 2017, నవంబర్ 6న ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్ద నుంచి పాదయాత్ర మొదలైంది. దానికి ప్రజాసంకల్పయాత్ర అని పేరు పెట్టారు. 13 జిల్లాల మీదుగా సాగే పాదయాత్రలో రెండుకోట్ల మంది ప్రజలను నేరుగా కలుసుకోవాలని ప్రణాళిక రచించారు.
1.వైఎస్సార్ రైతు భరోసాః
ఒక కవి మాటల్లో చెప్పాలంటే వెన్నెముక వెనుక వైపు ఉన్నట్టుగానే, రైతులు కూడా వెనుకెనుకే ఉన్నారు. అలాంటి రైతును ఆదుకునేందుకు వైఎస్ జగన్ సర్కార్ రైతులకు భరోసా కల్పించేందుకు వైఎస్సార్ రైతుభరోసా అనే పథకాన్ని చేపట్టింది. ఈ పథకం కింద 48.49 లక్షల మంది రైతులకు ఏడాది రూ.13,500 చొప్పున విడతల వారీగా జమ చేయాలని సంకల్పించింది. ఇప్పటికే రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయ్యింది. నిజానికి మొదట రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇవ్వాలని జగన్ సర్కార్ భావించింది. అయితే రైతులకు ఎంత సాయం చేసినా తక్కువనే ఉద్దేశంతో ఐదేళ్లకు ఇవ్వడంతో పాటు మరో వెయ్యి రూపాయిలు పెంచి ,తనది రైతు పక్షపాతి ప్రభుత్వమని జగన్ సర్కార్ నిరూపించుకొంది.
రైతుల కోసం మరిన్ని
గ్రామ సచివాలయాల్లో రైతుల కోసం నాణ్యమైన పురుగు మందులు, విత్తనాలు అందుబాటులోకి తేనున్నారు. అలాగే రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గంలో విత్తన, ఎరువుల పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేయాలనే దిశగా పనులు జరుగుతున్నాయి.
రూ.4వేల కోట్లతో (కేంద్ర, రాష్ట్రాలు కలిపి) ప్రకృతి వైపరీత్యాల నిధి, అగ్రి కమిషన్, ఆయిల్‌ఫాం రైతులకు గిట్టుబాటు ధర కోసం నిధుల కేటాయింపు, కౌలు రైతుల కోసం సాగుదారుల హక్కుల బిల్లు. ఉచిత పంటల, పశుబీమా చెల్లించేందుకు నిధులు కేటాయించారు. గత ప్రభుత్వ ఇన్‌ఫుట్ సబ్సిడీ బకాయి రూ.2 వేల కోట్ల విడుదల చేశారు.
2. వైఎస్సార్ ఆరోగ్యశ్రీః
వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉన్న కుటుంబాలకు వైద్య ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అలాగే హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఎక్కడ వైద్యం చేయించుకున్నా పథకం వర్తించనుంది అలాగే వైద్యం చేయించుకున్న తర్వాత విశ్రాంతి సమయంలో నిపుణుల కమిటీ సూచన మేరకు రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5వేలు ఇస్తోంది.
అలాగే డయాలసిస్ చేయించుకునే వారు ,తలసేమియా , సికిల్‌సెల్ , హీమోఫీలియా బాధితులకు నెలకు రూ.10 వేలు. అలాగే కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేసేందుకు రూ.1500 కోట్లు కేటాయించారు. ఆరోగ్యశ్రీ పరిధి లోకి కొత్తగా 936 వ్యాధుల చేర్చారు. దీంతో మొత్తం 2031 వ్యాధులకు ఆరోగ్యశ్రీలో వైద్యం అందిస్తారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక సంస్కరణలను జగన్ సర్కార్ తీసుకొచ్చింది. ఆరోగ్యశ్రీలో మార్పులు వైఎస్ మార్క్ పాలనను గుర్తు తెస్తోంది.
3.అమ్మ ఒడి
జగన్ ప్రకటించిన మరో గొప్ప రత్నం అమ్మ ఒడి పథకం. ప్రతి ఒక్కరికి చదువు అందించాలన్న జగన్ సంకల్పం సమాజ మార్పునకు దోహదం చేస్తుంది. ఎందుకంటే సమస్యలన్నింటికి పరిష్కారం చదువే. చదువుతోనే ఆలోచన, ప్రశ్నించే తత్వం అలవడుతాయి. విద్యలేని వాడు వింత పశువు అని పాతరోజుల్లో ఓ నినాదం ఉండేది. అందువల్లే ప్రతి ఒక్కరికీ చదువు చెప్పించాలన్న ఆశయంతో జగన్ అమ్మ ఒడి పథకాన్నిప్రకటించాడు. ఈ పథకాన్ని 2020, జనవరి 9న చిత్తూరులో ప్రారంభించారు. మొదటి ఏడాది కింద రూ.15 వేల సొమ్ము అమ్మల ఖాతాల్లో జమ అయ్యింది. రెండో ఏడాదికి సంబంధించి ఈ సంవత్సరంలోనే డిసెంబర్‌లో వేయనున్నట్టు సంక్షేమ క్యాలెండర్‌లో పేర్కొన్నారు.
ఈ పథకం కింద ఒకటి నుంచి 12వ తరగతి వరకు పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు చొప్పున సాయం చేస్తున్నారు. ఇలా 45 లక్షల మంది అమ్మలకు వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నారు.
4.పింఛన్ల పెంపుః
పింఛన్ల పెంపునకు సంబంధించి జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న వేదికపై నుంచి తొలి సంతకం చేశారు. సామాజిక పింఛన్ల పెంపులో భాగంగా రూ.250 పెంచి మొత్తం రూ.2250 చొప్పున ఇస్తున్నారు. ప్రతి ఏడాది రూ.250 పెంచుతూ రూ.3 వేలు ఇస్తానని గతంలో జగన్ ఇచ్చిన హామీ నెరవేరుతోంది. అలాగే వృద్ధుల పింఛన్ వయస్సు 65 ఏళ్ల నుంచి 60కి తగ్గించారు. వికలాంగుల పింఛన్‌ను రూ.3వేలకు పెంచారు.
5. పేదలందరికి ఇళ్లుః
ఉగాదికి 25 లక్షల మంది ఇళ్లు ఇవ్వాలనే పట్టుదలతో జగన్ సర్కార్ శరవేగంగా భూసేకరణ చేపట్టింది. అయితే అనివార్య కారణాల వల్ల ఆ ప్రోగ్రాం వాయిదా పడింది. కరోనాతో మరింత ఆలస్యమైంది. కానీ పేదల సొంతింటి కల వైఎస్సార్ పుట్టిన రోజు సందర్భంగా నెరవేరనుంది. జూలైలో 27 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఇంటి నిర్మాణానికి పావలా వడ్డీతో బ్యాంక్ రుణసౌకర్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 20న 15 లక్షల వైఎస్సార్ గృహ నిర్మాణం ప్రారంభించనున్నట్టు సంక్షేమ క్యాలెండర్‌లో ప్రకటించారు.
6.ఫీజురీఎంబర్స్‌మెంట్ః
జగనన్న విద్యాదీవెన కింద పేద విద్యార్థులు ఏ చదువు చదువుకున్నా పూర్తిగా ఫీజురీయింబర్స్‌మెంట్. జగనన్న వసతి దీవెన పథకం కింద ప్రతి పేద విద్యార్థికి వసతి సౌకర్యం కల్పనకు ఏడాదికి రూ.20 వేలు అందజేస్తున్నారు. ఈ పథకాల కింద 11.44 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలిగించేందుకు జగన్ సర్కార్ బడ్జెట్‌లో రూ.5668 కోట్లు కేటాయించింది. 2021, ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన మూడో దఫా, జగనన్న వసతి దీవెన రెండో దఫా సొమ్మును జమ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.
7.వైఎస్సార్ జలయజ్ఞంః
2004లో డాక్టర్ వైఎస్సార్ ప్రతి ఎకరాకు సాగునీళ్లు అందించాలనే లక్ష్యంతో జలయజ్ఞం పథకానికి శ్రీకారం చుట్టారు. వైఎస్ ఆశయమే మరోసారి 2009లో అధికారాన్ని తెచ్చి పెట్టింది. తండ్రి ఆశయాన్ని కొనసాగింపుగా జగన్ సర్కార్ సాగునీటి ప్రాజెక్టులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం కడప పర్యటనలో ఉన్న జగన్ రాయచోటి సభలో మాట్లాడుతూ చెప్పిన అంశాలను పరిశీలిస్తే …ఆయన విజన్ ఏంటో అర్థం అవుతుంది.
రూ.60 వేల కోట్లతో ప్రాజెక్టులు
‘సాగునీటి ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు ప్రధాన కాలువలను విస్తరించి కరువును పారదోలేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. రూ.60,000 కోట్లు వెచ్చించి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు గోదావరి, కృష్ణా వరద జలాలను తరలించనున్నాం. మరో రూ.23 వేల కోట్లు ఖర్చు చేసి పోతిరెడ్డిపాడుతోపాటు కేసీ కెనాల్, నిప్పులవాగు, ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్, హంద్రీ–నీవా, అవుకు, గండికోట తదితర ప్రాజెక్టుల ప్రధాన కాలువల సామర్థ్యాన్ని పెంచుతాం’ అని జగన్ చెప్పారు. దీనికి అనుగుణంగానే ఇటీవల జీవో 203 జారీ చేశారు.
8.మద్యపాన నిషేధంః
రాష్ట్రంలోదశల వారీగా మద్యనిషేధం విధించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రాష్ట్రంలో 44వేల బెల్ట్‌షాపులను తొలగించింది. అలాగే 4380 మద్యం షాపుల్లో 880 తగ్గించింది. అంటే మిగిలింది 3500. బార్లలోనూ 40 శాతం తగ్గించాలని నిర్ణయం. మద్యం ధరల పెంపు, లైసెన్స్ ఫీజు భారీగా పెంపుతో మందుబాబులకు షాక్ ఇచ్చింది. ఇటీవల కూడా ధరలు అమాంతం పెంచేసి మందుబాబులకు షాక్ ఇచ్చింది. మద్యపాన నిషేధం నుంచి ప్రస్తుత ఏడాది మినహాయిస్తే మిగిలిన నాలుగేళ్లకు రూ.69,899 కోట్లు నష్టం వస్తుందని ఆర్థిక శాఖ అధికారుల అంచనా. మద్యాన్ని నిషేధించడం వల్ల ఆర్థికంగా నష్టపోతామని తెలిసి కూడా, అంతకంటే మందు వల్ల చోటు చేసుకునే దుష్ప్రరిణామాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొంది.
9.వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూతః
పొదుపు సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలు అందించే వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. దీనికోసం ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.1,788 కోట్లు కేటాయించింది. అలాగే సున్నావడ్డీకే రూ.16,819 కోట్లు రుణమివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. వైఎస్సార్ ఆసరా కింద మొదటి దఫా చెల్లింపులను ఈ ఏదాడి సెప్టెంబర్‌లో చేయనున్నారు.
అలాగే వైఎస్సార్ చేయూత పథకం కింద అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.75 వేలు చొప్పున దశల వారీగా సంబంధిత కార్పొరేషన్ల ద్వారా ఇవ్వడానికి ఇప్పటి నుంచే జగన్ సర్కార్ కసరత్తు చేస్తోంది.
గ్రామస్వరాజ్య స్థాపన కోసం
పల్లెలే ప్రగతికి మెట్టు. జాతిపిత గాంధీజీ గ్రామ స్వరాజ్యాన్ని కలలు కన్నారు. గ్రామీణులు తమ సమస్యల పరిష్కారం కోసం సుదూరాలకు వెళుతూ సమయాన్ని, డబ్బు వృథా చేసుకోకుండా వారి చెంతకే సచివాలయాలను జగన్ సర్కార్ తీసుకెళ్లింది. ఇందులో భాగంగా వార్డు వలంటీర్లను కూడా నియమించింది. 50 ఇళ్లకు ఒకరు చొప్పున గ్రామ వలంటీర్‌ను నియమించారు.
నాలుగు నెలల్లో 4.10 లక్షల ఉద్యోగాలు కల్పించారు. ఇందులో 1.40 లక్షల ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు దక్కాయి. కరోనా విపత్తు సమయంలో వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల వల్ల ఎన్నెన్ని ప్రయోజనాలు కలిగాయో అందరికీ తెలిసినవే.
సామాజిక విప్లవం
జనాభా ప్రాతిపదికన పదవులు లభించాలనేది వైఎస్ జగన్ సర్కార్ ఆశయం. ఇందులో భాగంగా సీఎం ఓ అడుగు ముందు కేశారు. మొట్ట మొదటగా తన కేబినెట్ నుంచే సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. కేబినెట్‌లో 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రి పదవులు ఇచ్చారు. అంతేకాకుండా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించారు. అన్ని నామినేటెడ్ పదవుల్లో (టీటీడీ మినహా) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం పదవులు లభించేలా అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చారు.
దేశంలోనే మొట్ట మొదటి సారిగా దిశ చట్టం
తెలంగాణలో డాక్టర్ దిశపై అత్యాచారం, హత్య దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో మహిళల రక్షణ కోసం దేశంలోనే మొట్ట మొదటిసారిగా దిశ చట్టాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టం తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశం దృష్టిని ఆకర్షించింది.
వైఎస్సార్ నవశకం
వైఎస్సార్ నవశకం పేరుతో సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేసింది, చేస్తోంది. ఈ పథకం కింద బియ్యం కార్డులు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు, వైఎస్సార్ పెన్షన్ కార్డు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి వసతి దీవెన కార్డులను అందజేసేందుకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. భవిష్యత్‌లో కూడా ఇదే పద్ధతిలో ఎంపిక చేస్తారు.
ఆర్టీసీ విలీనం…విప్లవాత్మకం
గతంలో ఏ ముఖ్యమంత్రి చేయడానికి సాహసించని విధంగా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది. అలాగే జనవరి ఒకటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని అసెంబ్లీ వేదికగా జగన్ ప్రకటించారు. అసెంబ్లీ సాక్షిగా ఆర్టీసీ ఉద్యోగుల కలలను జగన్ నెరవేర్చారు. సుమారు 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో ఆనంద వెలుగులు నింపారు.
ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల విద్య
జగన్ సర్కార్ చేపట్టనున్న మరో విప్లవాత్మక సంస్కరణ ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం. దీనిపై సాంకేతిక అంశాల అడ్డుతో న్యాయస్థానం సంబంధిత జీవోను కొట్టి వేసినప్పటికీ తల్లిదండ్రుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అందుకు తగ్గట్టు ముందడుగు వేస్తోంది. అలాగే బడుల్లో మౌలిక వసతుల కల్పన. మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.12 వేల కోట్లు కేటాయింపు. తొలిదశలో 15,715 పాఠశాలల్లో తొమ్మిది రకాల సౌకర్యాలను కల్పించడం.
మూడు రాజధానుల ప్రకటన
అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్ సర్కార్ ముందడుగు వేసింది. ఈ నెల 17న అసెంబ్లీ వేదికగా జగన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న అమరావతితో పాటు విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూల్‌ను న్యాయాలయ రాజధానిగా చేయాలనే ఆశయంతో జగన్ సర్కార్ కార్యాచారణ చేపట్టింది. ప్రస్తుతం ఇది అనేక కారణాల రీత్యా ప్రాసెస్‌లో ఉంది. ఈ రోజు కాకుంటే రేపు, రేపు కాకుంటే ఎల్లుండి…ఏ క్షణమైనా మూడు రాజధానుల ప్రక్రియ అమలుకు నోచుకోనుంది.
జగన్ అధికారంలోకి వచ్చే నాటికి ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మాత్రం ఉందనే చేదు నిజాన్నిగుర్తించాలి. మరోవైపు కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. అయినప్పటికీ మనసుంటే మార్గముంటుందనే జగన్ పాజిటివ్ దృక్పథమే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి మ్యానిఫెస్టో అమలుకు శ్రీకారం చుట్టేలా చేసింది. జగన్ ధైర్యం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరచడంతో పాటు ఆలోచింపజేస్తోంది.
మాట తప్పను, మడమ తిప్పను అనే నినాదాన్ని తండ్రి నుంచి వారసత్వంగా స్వీకరించిన జగన్ కూడా వైఎస్ మాదిరిగానే చెప్పింది చేస్తారనే నమ్మకం, విశ్వాసం పేద ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ప్రజల్లోని ఈ నమ్మకాన్ని ఈ నాలుగేళ్లు కూడా ఇలాగే కాపాడుకోగలిగితే జగన్‌కు మరో సారి అధికారం తిరుగుండదనేది సామాన్యులు మొదలుకుని మేధావుల వరకు ఉన్న అభిప్రాయం.
-సొదుం