రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ధరల పెరుగుదలపై చర్చలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యేలు దూకుడు ప్రదర్శించారు. బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేస్తూ, స్పీకర్ తమ్మినేని సీతారాం పోడియాన్ని ప్రతిపక్ష సభ్యులు చుట్టుముట్టారు.
నిత్యావసర ధరలపై టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో గొడవ మొదలైంది. అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి. టీడీపీ సభ్యుల వ్యవహారశైలిపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోజూ ఇదో వ్యాపకంగా మారిందని స్పీకర్ మండిపడ్డారు. ధరల పెరుగుదలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించినా ప్రయోజనం లేకపోయింది. టీడీపీ సభ్యులు నిరసన విరమించి చర్చల్లో పాల్గొనాలని స్పీకర్ కోరినప్పటికీ వారు వినిపించుకోలేదు.
మీకు ప్రతీరోజు ఇదొక అలవాటుగా మారిందని టీడీపీ సభ్యులనుద్దేశించి స్పీకర్ అన్నారు. మీ దుష్ప్రవర్తనకు సస్పెండ్ చేస్తున్నా అని హెచ్చరించారు. ప్రతి రోజు ఇదొక వ్యాపకం అయిపోయిందా మీకు. ఇంతకంటే వ్యాపకం లేదా అని ప్రతిపక్ష సభ్యులపై స్పీకర్ మండిపడ్డారు.
అసెంబ్లీ ప్రవర్తన నియమావళిని అతిక్రమించిన 13 మంది సభ్యుల్ని స్పీకర్ సస్పెండ్ చేశారు. సభ్యుల్ని బయటికి తీసుకెళ్లాలని మార్షల్స్‌ను స్పీకర్ ఆదేశించారు. అసెంబ్లీ మొదటి రోజు సమావేశాల్లో కూడా ఇదే రిపీట్ అయ్యింది. నిన్న కూడా టీడీపీ సభ్యుల్ని స్పీకర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో సమస్యల చర్చ కంటే రచ్చే ఎక్కువగా సాగుతోంది.