వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ సోదాలు నిర్వహించడం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ కవితకు సంబంధాలున్నాయని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
తన పరువుకు నష్టం కలిగించేలా బీజేపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేయడం చూశాం. అంతేకాదు, లిక్కర్ స్కామ్‌లో తన పేరు ప్రస్తావించొద్దని ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టుకు కవిత వెళ్లి, అనుకూల ఆదేశాలు పొందారు.
మరోవైపు వైసీపీ నేతలకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందంటూ టీడీపీ పదేపదే ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డికి సంబంధించి ఢిల్లీలోని ఆయన నివాసంలో ఇవాళ ఉదయం నుంచి ఈడీలు నిర్వహిస్తోంది.
ఇదే రీతిలో శుక్రవారం ఉదయం నుంచి దేశ వ్యాప్తంగా 40 చోట్ల ఈడీలు సోదాలు నిర్వహిస్తోంది. ఏపీకి వెళితే …నెల్లూరులో సోదాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ ఎంపీ ఇంట్లో ఈడీలు సోదాలు నిర్వహించడం రాజకీయ రంగు పులుముకోనుంది. ఒకవేళ ఆయన ఇంట్లో ఏమీ దొరక్కపోతే వైసీపీ ఊపిరి పీల్చుకుంటుంది. ఒకవేళ లిక్కర్‌కు సంబంధించి ఏవైనా ఆధారాలు దొరికితే మాత్రం టీడీపీ ఆరోపణలకు బలం కలిగించినట్టు అవుతుంది.