Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

మూవీ రివ్యూ: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

టైటిల్: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
రేటింగ్: 2/5
తారాగణం: సుధీర్ బాబు, కృతి శెట్టి, శ్రీకాంత్ అయ్యంగర్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు
కెమెరా: పీజీ విందా
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం: వివేక్ సాగర్ 
నిర్మాత: మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి 
దర్శకత్వం: ఇంద్రగంటి మోహన కృష్ణ
విడుదల తేదీ: 16 సెప్టెంబర్ 2022

తన ప్రతిభని చాటుకుని విషయమున్న సినిమాలు తీసిన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ, ప్రామినింగ్ నటుడనిపించుకున్న సుధీర్ బాబు, ఇంకా "ఉప్పెన" గాలి తగ్గని కృతి శెట్టి కాంబినేషన్ అనగానే కొంతవరకూ ఆసక్తి కలుగుతుంది. ఎటువంటి ప్రొమోషన్స్ లేకపోయినా కేవలం దర్శకుడి పేరు మీదున్న గౌరవం ఈ సినిమాపై దృష్టి సారించేలా చేసింది. 

అసక్తికరమైన పాటతో సినిమా టైటిల్స్ మొదలవుతాయి. ప్రెస్ మీట్లో జర్నలిస్టులంతా పాట రూపంలో ప్రశ్నలడగడం, హీరో పాటగానే సమాధానాలు చెప్పడమనే ఐడియా హిలారియస్ గా ఉంది. ఈ సారి ఇంద్రగంటివారు కామెడీ గంట గట్టిగానే కొడుతున్నారు కాబోలు అనే ఫీలింగ్ కలుగుతుంది. 

కానీ నెమ్మదిగా ఆ ఫీలింగ్స్ మీద మబ్బులు కమ్మేస్తాయి. 

హిట్ సినిమాల దర్శకుడిగా కనిపించే హీరోకి, సినిమాలంటే ఇష్టం లేని ఒక డాక్టర్ కి మధ్యలో నడుస్తుంటుంది కథ. సదరు హీరో ఆమెని తన సినిమాలో నటించమని వేడుకోవడం, ఆమె తల్లిదండ్రులను కూడా ఒప్పించే ప్రయత్నం చేయడం...ఇదే ప్రధమార్థమంతా. 

రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యానికి కారులో కూర్చుని 10 స్పీడులో ప్రయాణం చేస్తుంటే ఎలా ఉంటుంది? ఈ సినిమా చూస్తున్నంత సేపూ అదే ఫీలింగొస్తుంది. 

ఇంటర్వెల్లో ఇచ్చిన ట్విస్టుని ఆస్వాదించడానికి బదులు, ఇక్కడ దింపడానికి ఇంత సేపు నడిపావా నాయనా అని నిట్టూర్చడం ప్రేక్షకుల వంతౌతుంది. ఎందుకంటే ఆ పాయింట్ ఇంటర్వెలోనే చెప్పాలని నిర్ణయించుకున్న దర్శకుడు అప్పటివరకు సాగతీత కార్యక్రమం చేపట్టాడు తప్ప ఆసక్తికరంగా మలచలేకపోయాడు. 

అక్కర్లేని ఐటం సాంగ్, చివర్లో ఒక బలవంతపు ఫైటు..లాంటి ఫార్ములా ఎలిమెంట్స్ పెట్టాలి కాబట్టి పెట్టినట్టున్నాయి. 

కథనంలో గ్రిప్ లేకపోవడం వల్ల మాటిమాటికీ వాచ్ చూసుకునే పరిస్థితి.

కొన్ని చోట్ల ఎమెచ్యూర్ దర్శకుడు తీసినట్టుగా అనిపిస్తుంది తప్ప ఇంద్రగంటి పనితీరు అనిపించుకోదు. కథనంలో ఉన్న స్లోనెస్ ఒక స్టేజిలో విసుగు తెప్పిస్తుంది కూడా. 

అంత స్లో పేస్ గా అనిపించడానికి మరొక ప్రధాన కారణం అత్యంత పేలవమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. 

సందర్భోచితంగా సెకండాఫులో వచ్చే "కొత్త కొత్తగా..." అనే పాట తప్ప సంగీతపరంగా చాలా నీరసంగా ఉందనే చెప్పాలి. 

అసలీ కథని సినిమాగా కంటే టీవీ సీరియల్ గా తీసుంటే "కార్తీకదీపం" లాగ 1000 ఎపిసోడ్స్ నడపచ్చు. అంతటి స్కోపున్న కథ ఇది. పాల్ట్లు, సబ్ ప్లాట్లు పెంచుకుంటూ అలా సాగతీస్తూ వెళ్లిపోవచ్చు. ఆ లక్షణాలు ఆల్రెడీ ఇక్కడి కథనంలో కొన్నున్నాయి. 

సింపుల్ గా చెప్పాలంటే తాము చేసిన తప్పుని తెర మీద సినిమాగా చూసి పశ్చాత్తాపం చెందుతాయి ఇందులోని పాత్రలు. నిజమే.. తెర మీద ఏదైనా పెద్దగా కనిపిస్తుంది- ప్లస్సులు, మైనస్సులు కూడా. అది మంచి పాయింటే. అయితే ఆ పాయింటు వరకు రావడానికి చేసే ప్రయాణమే నీరసంగా ఉందంతే. 

హీరో తల్లిదండ్రులుంటారు తప్ప వాళ్లకి కథలో పెద్ద ఇంపార్టెన్స్ లేదు. జస్ట్ ప్యాడింగ్ అంతే. 

పరువుమర్యాదగల కుటుంబాలకు చెందిన తండ్రులకి ప్రతినిధిగా శ్రీకాంత్ అయ్యంగర్ కనిపించాడు. నటనలో ఇంటెన్సిటీ ఉన్నా పాత్ర రచనలో వేరియేషన్స్ లేవు. 

వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్ ఉన్నా ఒకటి రెండు పంచులు తప్ప పెద్దగా ఏమీ చెయ్యలేదు. సెకండాఫులో మాత్రం అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ తో పాటూ కిషోర్ ట్రాక్ నవ్వించగలిగింది. 

కృతిశెట్టి బాగానే చేసింది. తన పాత్రకి కొంత గ్రావిటీ ఉంది. 

సుధీర్ కి ఒకటి రెండు మంచి సీన్స్ ఉన్నాయి. ముఖ్యంగా తన ఫ్లాష్ బ్యాక్ చెప్పుకునే సీన్లో మరింత కన్విన్సింగ్ గా నటించి ఉండాల్సింది. అది చాలా కీలకమైన సన్నివేశం. 

రాహుల్ రామకృష్ణ పేరుకి తెర మీద కనిపిస్తున్నా అతనికి ఈ కథకి సమబంధం లేని సీరియస్ క్యారెక్టరిచ్చి ఉత్సవ విగ్రహంగా మిగిల్చారు. 

ఓవరాల్ ఇది పేలవమైన రచన. అన్ని పాత్రలకి న్యాయం చెసిన స్క్రిప్ట్ కాదు. ఒక చిన్న పాయింటుని డైలీ రాసుకోవచ్చేమో గానీ, రెండున్నర గంటల సినిమాగా మలచడం మాత్రం సాహసమే. ఒక చిన్న లైన్ తీసుకుని ఇంటర్వెల్లో ఫలానా ట్విస్టు, క్లైమాక్సులో ఫలనా సీను అని అనేసుకుని పెద్దగా కష్టపడకుండా చుట్టేసిన సినిమాలాగుంది. 

పాయింటు మంచిదే అయినా కథనంలో అంత హెవీనెస్ ని ఎవరూ ఆశించరు. యంగ్ ఆడియన్స్ కే కాదు, ఏ ఏజ్ వారికైనా హాల్లో కూర్చుని అంత బరువు మోయడం పనిష్మెంటే. 

బాటం లైన్: చెప్పింది చాలు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?