పది ఎంపీ సీట్లు, ముప్పై వరకూ అసెంబ్లీ సీట్లను కేటాయించి భారతీయ జనతా పార్టీ, జనసేనలను తన బుట్టలో వేసుకునేందుకు చంద్రబాబు నాయుడు శతథా ప్రయత్నిస్తున్నారని టాక్ లో భాగంగా.. ఎలాగూ తన పార్టీ గెలుపు అవకాశాలు లేని నియోజకవర్గాలను చంద్రబాబు నాయుడు ఈ బంపర్ ఆఫర్ లో భాగంగా ప్రతిపాదిస్తున్నారని సమాచారం.
చంద్రబాబు ఇచ్చే ఆఫర్లను బీజేపీ లోని ఢిల్లీ నేతల చెవిలో వేయడానికి చాలా మందే ఉన్నారు. ఆ మధ్యవర్తిత్వం చేయడానికి పత్రికాధిపతులు, మీడియా మొఘల్స్ తో సహా..బీజేపీలోకి చంద్రబాబు నాయుడు మూడేళ్ల కిందటే పంపిన లాబీయిస్టులు కూడా ఉన్నారు. మరి వీరు పది ఎంపీ సీట్లు.. అంటూ పది వేళ్లను బీజేపీ నేతల ముందు చూపిస్తూ వారిని టెంప్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నారని సమాచారం.
మరి 25 సీట్లున్న రాష్ట్రంలో.. బీజేపీకి కనీసం సొంతంగా ఒక్క ఎంపీ సీటు లేని రాష్ట్రంలో పొత్తుతో పది ఎంపీ టికెట్ల కేటాయింపు అంటే అక్కడి నేతలు టెంప్ట్ కావొచ్చు కూడా ! అయితే పది అనే మాటే కానీ, ఆ సీట్లు ఏవనేది వేరే సంగతి!
ఎంత అనుకూల సునామీ వచ్చినా టీడీపీ గెలవలేని ఎంపీ సీట్లు కొన్ని ఉన్నాయి. రాజంపేట, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, నంద్యాల, అరకు.. ఇలాంటి ఏడెనిమిది సీట్లలో తెలుగుదేశం పార్టీ బీజేపీని కూడదీసుకుని వెళ్లినా, పవన్ కల్యాణ్ ను వెంట తీసుకుని వెళ్లినా నెగ్గలేదు! గాలికిపోయే పిండి కృష్ణార్ఫణం అన్నట్టుగా.. ఇలాంటి సీట్లనే ఏడెనిమిదిని పెట్టి.. పోటీ ఇవ్వగలిగే రెండు సీట్లను బీజేపీ, జనసేనలకు తగిలించేసి చంద్రబాబు నాయుడు తన పబ్బం గడుపుకునే ప్రయత్నమూ చేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు.
ఇలాంటి సీట్లలో తెలుగుదేశం పోటీ చేసినా, చేయకపోయినా పోయేదేం లేదు, వచ్చేదేం లేదు. వీటినే బీజేపీ ఖాతాలోకి కలిపిస్తే.. ఆ పార్టీ తో పొత్తు పేరు దక్కుతుంది. సొంతంగా గెలవడం సాధ్యం అయ్యేది కాదు కాబట్టి బీజేపీ, జనసేన సపోర్ట్ అయినా దక్కుతుందనేది చంద్రబాబు వ్యూహం అనేది చాలా తేలికగా అర్థం అయ్యే అంశం. మరి పది ఎంపీ సీట్లు అనగానే.. బీజేపీ, జనసేనలు లుంగీలు ఎగ్గట్టుకుంటే.. అది చంద్రబాబు చేతిలో మరోసారి పావు కావడమే తప్ప అంతకు మించి ప్రయోజనం ఏమీ ఉండకపోవచ్చు!