కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో అడుగుపెడుతున్న సమయానికి సరిగ్గా.. అక్కడి కాంగ్రెస్ ముఖ్య నేత డీకే శివకుమార ను ఈడీ పిలవడం ఆసక్తిదాయకంగా మారింది. ఇప్పటికే చాలా కాలంగా డీకేశి ఈడీ కేసులను, విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ కేసుల్లో ఆయన అరెస్టు అయ్యి తీహార్ జైల్లో కూడా కొంత కాలం గడిపారు. ఆ తర్వాత బెయిల్ మీద విడుదలయ్యారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రకు డీకే శివకుమార కర్ణాటకలో భారీ ఎత్తున ఏర్పాటు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున డీకేశి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలిచే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అంగ, అర్థబలంలో డీకే కి సాటి వచ్చే కాంగ్రెస్ నేతలు లేరు. రాజకీయంగా బలవంతమైన వక్కలిగ సామాజికవర్గానికి చెందిన వారు డీకే. ఈ సామాజికవర్గం ఓటు బ్యాంకును గతంలో జేడీఎస్ గంపగుత్తగా చేజిక్కించుకుంది.
అయితే దేవేగౌడ, ఆయన తనయుడు కుమారస్వామిలకు గట్టి పోటీ ఇచ్చి.. వక్కలిగ ఓట్లను కాంగ్రెస్ వైపు మళ్లించిన ఘనుడు డీకేశి. సొంత సామాజికవర్గంలో మంచి పట్టు సంపాదించాడు. జేడీఎస్ బలహీనపడే కొద్దీ..ఆ ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు మళ్లించగల సత్తా ఉంది డీకేశికి. ఇప్పటికే డీకేకు పూర్తి స్థాయిలో పగ్గాలు అప్పగించాల్సింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే నాన్చుడు ధోరణితో కాంగ్రెస్ ఇంకా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్టుగా ఉంది.
ఈ పరిస్థితిని ముందే గ్రహించి డీకే పై వీలైనన్ని కేసులు పెట్టేశారు. ఈడీ, సీబీఐ కి ఆయనను అతిథిగా చేశారు. ఇక కర్ణాటకపై వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా ఆశలు పెట్టుకుంది. బీజేపీ బాగా వ్యతిరేకత కూడా ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ లేవడం అంటూ జరిగితే అది కర్ణాటక నుంచినే మొదలయ్యే అవకాశాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాహుల్ అటువైపు వెళ్తున్న వేళ, ముందుకే డీకేని ఈడీ ఆఫీసుకు పరిమితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ అంశంపై డీకే స్పందిస్తూ… తను ఈడీకి పూర్తిగా సహకరిస్తానంటూ అయితే, అసెంబ్లీ సమావేశాలు ఒకవైపు ఉండగా, మరోవైపు తమ నాయకుడు రాహుల్ యాత్ర కర్ణాటకను చేరుతున్న వేళ తనను పిలవడం మాత్రం తన హక్కులను హరించడమే అని ఆయన అంటున్నారు. మరి ఈ తరహా వ్యవహారాలు ఎవరికి మేలు చేస్తాయనేది ఎప్పుటి చరిత్రనో కాదు..గత రెండు దశాబ్దాల పొలిటికల్ హిస్టరీని గమనిస్తే చాలు అర్థం అవుతుంది!