బీసీసీఐ వ్యవహారాలను కాస్త క్రమపద్ధతిలో పెట్టడానికి లోథా కమిటీ సూచించిన సంస్కరణల్లో.. ప్రస్తుతం పదవుల్లో ఉన్న వారికి అనువుగా కొన్ని నియమాలను మార్చడానికి కోర్టు అనుమతి లభించిన నేపథ్యంలో… వ్యవహారాలు వేగంగా మారుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టడానికి కేంద్ర హోం మంత్రి, బీజేపీ ముఖ్య నేత అమిత్ షా తనయుడు జై షా రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఇప్పటికే జై షా బీసీసీఐ కి సంబంధించి రెండు కీలక పదవుల్లో ఉన్నారు. మామూలుగా అయితే.. బీసీసీఐ కాంట్రాక్టులో ఉన్న వారు రెండు హోదాల్లో కానీ, రెండు బాధ్యతల్లో కానీ ఉండటానికి లేదంటారు. కాంఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ అంటూ.. పెద్ద పెద్ద మాజీ క్రికెటర్లను సైతం ఒక పదవికే పరిమితం కావాలన్నారు!
ఆఖరికి క్రికెట్ కామెంటరీ చెప్పుకోవడం, ఏదైనా ఐపీఎల్ జట్టుతో ఒప్పందం.. ఇలా ఇవన్నీ కాంఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ గానే కనిపించాయి. దీంతోనే చాలా మంది ఆటగాళ్లు రిటైర్మెంట్ అనేస్తున్నారు. బీసీసీఐ జాబితాలో ఉంటే.. వేరే దేశాల్లో లీగులు ఆడేందుకు కూడా లేదు. దీంతో కొందరు యువ ఆటగాళ్లు కూడా బీసీసీఐతో బంధాన్ని తెంచుకుని ఫారెన్ లీగుల వైపు వెళ్తున్నారు.
ఆ సంగతలా ఉంటే.. జై షా తదుపరి టార్గెట్ బీసీసీఐ అధ్యక్ష పదవి అనే మాట వినిపిస్తోంది. గంగూలీని ఐసీసీ వైపు పంపించి జై షా బీసీసీఐ చీఫ్ గా పోటీలో నిలవనున్నారట! మరి జై షా పోటీలో నిలబడితే.. రాష్ట్రాల క్రికెట్ సంఘాల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించడం, ఆయన విజేతగా నిలవడం చాలా సులువు కావొచ్చు!