మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక విషయంలో క్షేత్ర స్థాయి పరిస్థితిని గురించిన పరిశీలనలు ఆసక్తిని రేకెత్తిస్తూ ఉన్నాయి. ఈ ఉప ఎన్నిక ను అనూహ్యంగా తెర మీదకు తీసుకు వచ్చింది భారతీయ జనతా పార్టీ. రాజగోపాల్ రెడ్డి అలాగనే కాంగ్రెస్ పైనా, టీఆర్ఎస్ పైనా విమర్శలు చేసుకుంటూ.. బీజేపీ సానుభూతి వచనాలు పలికి ఉంటే అడిగే వారు లేరు! కాంగ్రెస్ పార్టీ ఆయనపై వేటు వేయమని అడగదు, టీఆర్ఎస్ వేటు వేయదు.. ఎన్నికల వరకూ రోజులు అలా గడిచిపోయేవి. అప్పటి కథ అప్పుడు!
అయితే ఎందుకో ప్రతిష్టకుపోయారో కానీ.. ఉప ఎన్నికలను తెర మీదకు తెచ్చారు. మరి ఇప్పటికే అక్కడ అన్ని పార్టీలూ తమ తమ రచ్చను చేస్తూనే ఉన్నాయి. బీజేపీ తరఫున రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున పాల్వాయి స్రవంతిలు అభ్యర్థులుగా ఖరారు అయినట్టే. ఇక టీఆర్ఎస్ ఇప్పటికే చాలా పని పూర్తి చేసుకుంటోంది. నియోజకవర్గంలో బాధ్యులు, ఇతర కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి.
మూడు పార్టీలకూ ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్తగా పోయేదేమీ కాదు. అయితే కనీసం పోటీలో నిలిచి ఉనికిని చాటుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం! ఇక తమ హవా తగ్గలేదని నిరూపించుకోవడం టీఆర్ఎస్ కు అవసరం, ప్రతిష్టను నిలబెట్టుకోవడం బీజేపీకి పరువుతో కూడుకున్న అంశం!
మరి ఇంతకీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉందంటే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేక పవనాలు గట్టిగా వీస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి గ్రాఫ్ చాలా వరకూ పడిపోయిందని, ఉప ఎన్నికలో ఆయన విజేతగా నిలవడం అనేది సందేహాస్పందమైన అంశమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి క్షేత్ర స్థాయి పరిశీలకుల నుంచి. ఈ అంశంపై వారు స్పందిస్తూ.. ఆయన మూడో స్థానానికి పడిపోయినా పెద్దగా ఆశ్చర్యపోవద్దని కుండబద్ధలు కొడుతూ ఉండటం గమనార్హం!
ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఆయన బీజేపీ తరఫున పోటీ చేసి ఆ పార్టీకి ఊపు ఉందని నిరూపించాల్సిన అవసరం ఏమిటనేది సామాన్యుడి ప్రశ్న అని అంటున్నారు పరిశీలకులు. ఆయనకు బీజేపీపై మోజే ఉండవచ్చు గాక.. ఇప్పుడు ఉప ఎన్నికలు తెచ్చి మరీ నిరూపించాల్సిన అవసరం లేదు! ఒకవేళ రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరి ఉప ఎన్నికను తెచ్చి ఉంటే అదో లెక్క.
ఈటల తరహాలో ఏ ఇగో క్లాష్ తోనో, కేసీఆర్ అవమానించాడనో.. వెళ్లి ఉంటే, ప్రజలు సానుభూతి అయినా చూపించే వారేమో! ఆయన కాంగ్రెస్ తరఫున దక్కిన పదవికి రాజీనామా చేసి బీజేపీ వైపు పోటీ చేయడం అనేదే.. జనాలు ఆయన వైపు నిలిచే అవకాశాలను తగ్గించి వేస్తున్నట్టుగా ఉంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఊహించుకున్న లెవల్లో, బీజేపీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టగా తీసుకున్నంత స్థాయిలో అయితే క్షేత్ర స్థాయిలో ఊపు లేదని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలవడానికి తీవ్రంగానే కష్టపడాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఆయన గ్రాఫ్ బాగా తగ్గుముఖం పట్టిందని, పోలింగ్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అనే అభిప్రాయాలే ఇప్పుడు వినిపిస్తున్నాయి.