నాయ‌కుడంటే సౌర‌వ్ గంగూలీనే!

టీమిండియా క్రికెట్ జ‌ట్టుకు ఇంత వ‌ర‌కూ బెస్ట్ కెప్టెన్ ఎవ‌రు అంటే.. నిస్సందేహంగా సౌర‌వ్ గంగూలీ పేరునే చెబుతారు మెజారిటీ భార‌తీయ క్రికెట్ అభిమానులు. వాస్త‌వానికి గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా ప్ర‌పంచ‌క‌ప్ ను గెల‌వ‌లేదు.…

టీమిండియా క్రికెట్ జ‌ట్టుకు ఇంత వ‌ర‌కూ బెస్ట్ కెప్టెన్ ఎవ‌రు అంటే.. నిస్సందేహంగా సౌర‌వ్ గంగూలీ పేరునే చెబుతారు మెజారిటీ భార‌తీయ క్రికెట్ అభిమానులు. వాస్త‌వానికి గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా ప్ర‌పంచ‌క‌ప్ ను గెల‌వ‌లేదు. ధోనీ, కొహ్లీ కెప్టెన్సీల్లో నిలిచిన‌ట్టుగా టెస్టుల్లో ఎక్కువ కాలం నంబ‌ర్ ప్లేస్ నూ ఆక్ర‌మించ‌లేదు! నంబ‌ర్ల ప్ర‌కారం చూస్తే.. టీమిండియాకు విజ‌య‌వంత‌మైన కెప్టెన్లుగా ధోనీ, కొహ్లీనే నిలుస్తారు.  వీళ్లు ఎన్ని గెలిచినా, గెలిపించినా.. స‌గ‌టు క్రికెట్ ఫ్యాన్ కు మాత్రం గంగూలీనే అభిమాన కెప్టెన్. 

గంగూలీ వేసిన జాడ‌లో ఆ త‌ర్వాతి టీమిండియా కెప్టెన్లు న‌డిచారు, న‌డుస్తున్నారు అనేది క్రికెట్ అభిమానుల‌కు బాగా తెలిసిన అంశం. అందుకే కెప్టెన్ అంటే గంగూలీనే, నాయ‌క‌త్వం అంటే గంగూలీదే. త‌న నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను గంగూలీ ఆట వ‌దిలేశాకా వ‌దిలేయ‌లేదు. క్రికెట్ నుంచి రిటైర్ కాగానే నెమ్మ‌దిగా క్యాబ్ అధ్య‌క్షుడు అయ్యాడు. క్రికెట్ అసోసియేష‌న్ ఆఫ్ బెంగాల్ ప్రెసిడెంట్ గా వ‌ర‌స‌గా త‌నే ఎన్నిక‌వుతూ వ‌చ్చాడు. అంత‌లోనే అనూహ్యంగా బీసీసీఐ ప్రెసిడెంట్ గానూ అవ‌కాశం వ‌చ్చింది. అయితే క్యాబ్ అధ్య‌క్షుడిగా అప్ప‌టికే చాలా కాలం ఉండ‌టంతో, కొత్త నియ‌మాల ప్ర‌కారం గంగూలీ త్వ‌ర‌లోనే బీసీసీఐ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల్సి ఉంటుంది. మామూలు వాడైతే అంత‌టితో వ‌దిలేవాడేమో!

ఇప్పుడు ఏకంగా ఐసీసీ ప్రెసిడెంట్ హోదాపై క‌న్నేశాడు దాదా. త్వ‌ర‌లోనే అందుకు సంబంధించి ఎన్నిక జ‌ర‌గాల్సి ఉంది. వివిధ దేశాల క్రికెట్ బోర్డుల మ‌ద్ద‌తు పొందిన వారు ఐసీసీ ప్రెసిడెంట్ అయ్యే అవ‌కాశాలున్నాయి. ప్ర‌స్తుతం ఐసీసీ ప్రెసిడెంట్ కూడా ఇండియ‌నే ఉన్నాడు. శ‌శాంక్ మ‌నోహ‌ర్ ఆ స్థానంలో ఉన్నాడు.

లోథా క‌మిటీ బీసీసీఐకి పెట్టిన రూల్స్ ప్ర‌కారం.. మ‌రి కొంత కాలం పాటు గంగూలీ ఎలాంటి హోదాల‌నూ పొంద‌లేడు. కూలింగ్ పీరియ‌డ్ త‌ర్వాతే మ‌ళ్లీ క్రికెట్ ప‌ద‌వుల‌ను చేప‌ట్టే అవ‌కాశం ఉంది. ఆ కూలింగ్ పీరియ‌డ్ ఏకంగా ఐసీసీ ప్రెసిడెంట్ అయిపోయి సేద‌తీరాల‌ని దాదా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టుగా ఉన్నాడు. ఇప్ప‌టికే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు అధ్య‌క్షుడు, ఆ దేశ జ‌ట్టు మాజీ కెప్టెన్ స్మిత్ గంగూలీ పేరును ప్ర‌తిపాదించాడు. సౌర‌వ్ ఐసీసీ అధ్య‌క్షుడు కావ‌డం మేల‌ని స్మిత్ బ‌హిరంగ ప్ర‌తిపాద‌న చేశాడు. అయితే గంగూలీకి ఈ విష‌యంలో గ‌ట్టి పోటీ త‌ప్ప‌క‌పోవ‌చ్చు. ఇంగ్లిష్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మ‌న్ ఒక‌రు ఐసీసీ చీఫ్ ప‌ద‌వి మీద క‌న్నేసిన‌ట్టుగా ఉన్నాడు. అయితే  కాస్త గ‌ట్టిగా లాబీయింగ్ చేసుకుంటే సౌర‌వ్ కు ఐసీసీ అధ్య‌క్ష పీఠం ద‌క్క‌డం క‌ష్టం ఏమీ కాక‌పోవ‌చ్చు.