కేజిఎఫ్ పార్ట్ వన్న అన్నది విడుదల అయ్యే వరకు ఆ సినిమా సంగతులు తెలుగు ప్రేక్షకులు ఎవ్వరికీ పెద్దగా తెలియవు. ఆ సినిమా స్లోగా తెలుగులో కూడా మంచి కలెక్షన్లు రాబట్టుకుంది. మరీ అద్భుతమైన కలెక్షన్లు కాదు కానీ, ఓ కన్నడ డబ్బింగ్ సినిమాగా చూసకుంటే మంచి కలెక్షన్లే. దాంతో కేజిఎఫ్ పార్ట్ 2 మీద కాస్త అంచనాలు పెరిగాయి. ఆ సినిమా డైరక్టర్ ప్రశాంత్ నీల్ మీద తెలుగు హీరోల ఆసక్తి పెరిగింది.
కేజిఎప్ నిర్మాతలతో సాన్నిహిత్యం వుండి, పార్ట్ వన్ ను తెలుగునాట విడుదల చేసిన నిర్మాత సాయి కొర్రపాటినే రెండో పార్ట్ కూడా తీసుకుంటారు లేదా విడుదల చేస్తారు అని అందరూ అనుకున్నారు. అందుకని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈలోగా కేజిఎఫ్ 2 టీమ్ తరపున ముంబాయి మార్కెటింగ్ ఏజెన్సీలు రంగంలోకి దిగి, పార్ట్ వన్ ఎంత వసూలు చేసింది, పార్ట్ 2 ను ఎంతకు మార్కెట్ చేయొచ్చు లాంటివి అన్నీ ఎంక్వయిరీ చేయడం మొదలు పెట్టింది.
దాంతో తెలుగు సినిమా జనాలకు ఫీలర్ వదిలినట్లు అయింది. ఎవరికి వారు తెలుగు వెర్షన్ ఎంత కోట్ చేస్తున్నారు అని ఎంక్వయిరీ చేయడం ప్రారంభించారు. ఇలాంటి నేపథ్యంలో కేజిఎఫ్ 2 నిర్మాతలు తెలుగు థియేటర్ హక్కులను నలభై నుంచి యాభై కోట్ల రేంజ్ లో కోట్ చేసినట్లు తెలుస్తోంది. ఫస్ట్ ఆఫర్ ను తొలిభాగం అందించిన సాయి కొర్రపాటికే ఇచ్చారని, కానీ ఆయన 20 కోట్లు దాటితే అనవసరం అని వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కేజిఎఫ్ 2 తెలుగు థియేటర్ మార్కెట్ అక్కడ ఆగింది. దసరాకు వస్తున్న ఈ సినిమాను కొనే ఆలోచనలో దిల్ రాజు, ఆసియన్ సునీల్ లాంటి వాళ్లు వున్నారు. కానీ నలభై కోట్ల రేంజ్ అంటే మాత్రం వీరయినా వెనకడుగే వేస్తారు కానీ ముందుకు వెళ్లరు. మరి ఎక్కడ, ఏ రేటుకు సెటిల్ అవుతుందో చూడాలి.