ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని పెద్దలంటారు. అంటే మాటలు చెప్పినంత సులభం కాదు ఆ రెండు కార్యాలు చేపట్టడం అని అర్థం. ఒక జీవిత కాలం కష్టపడినా మన దేశంలో సొంతింటిని ఏర్పరచుకోవడం కష్టమే. ఎందుకంటే ప్రతి వస్తువు ధర విపరీతంగా పెరగడం వల్ల సామాన్యులు, దిగువ, మధ్య తరగతి కుటుంబీకులకు సొంతింటి కల…కలగానే మిగిలిపోతోంది.
అయితే ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ప్రదేశంగా ఇటలీలోని ముస్సోమెలికి పేరు. ఆ ప్రాంతాన్ని హిల్ ఆఫ్ హనీగా కూడా ఇష్టంగా పిలుచుకుంటారు. అంత సుందరమైన ప్రాంతంలో ఇల్లు చాలా తక్కువ రేటుకే దొరుకుతుందంటే మన వాళ్లైతే అసలు నమ్మరు. కానీ ఇది పచ్చి నిజం. ఒక్కో ఇల్లు ఒక డాలర్ లేదా అంతకంటే తక్కువకే సొంతమవుతుందంటే ఎవరు మాత్రం నమ్ముతారు.
వాతావరణ కాలుష్యానికి దూరంగా, ప్రకృతి ఒడిలో ఓలలాడాలనే మనుషులు, మనసులకు ఇది ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తుందంటే అతిశయోక్తి కాదు. దీంతో ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోడానికి సామాన్యులు మొదలుకుని ధనవంతుల వరకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. కాకపోతే కరోనా వైరస్ బారిన పడి అందమైన ఈ ప్రాంతం శ్మశానాన్ని తలపించింది. ఇప్పుడిప్పుడే కొవిడ్-19 నుంచి అందమైన ముస్సోమెలి తేరుకుంటోందని సమాచారం.
చౌకగా ఇల్లు, మనసును పరవశానికి లోను చేసే ప్రకృతి రమణీయత, కాలుష్యం లేని ఆ జీవితాన్ని ఊహించుకుంటే స్వర్గంలో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది. చక్కగా అక్కడికి వెళ్లి సెటిల్ కావాలనే కోరిక పుడుతోంది కదూ! ప్చ్…మన దేశంలో కూడా అలాంటి అవకాశం లభిస్తే ఎంత బాగుంటుందో కదా?