కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికకు వేళైందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి 28న చనిపోయారు. ఈ నేపథ్యంలో ఆరు నెలల్లోపు ఎన్నికలు జరపాల్సి ఉంది.
ఇప్పటికి నాలుగు నెలలుగా బద్వేలు ఎమ్మెల్యే లేని నియోజకవర్గంగా ఉంది. అలాగే కరోనాతో దేశ వ్యాప్తంగా కొందరు ఎంపీలు, ఎమ్మె ల్యేలు మృతి చెందిన విషయం తెలిసిందే. మరికొన్ని చోట్ల వివిధ కారణాలతో ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడంతో ఆ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
బద్వేలుతో పాటు తెలంగాణలో ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. రాజేందర్ జూన్ 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, ఆ వెంటనే ఆమోదించడం చకాచకా జరిగి పోయాయి. కారణాలేవైనా ఖాళీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో బద్వేలుతో పాటు హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాలకు ఈ నెలలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాజకీయ పార్టీలకు సంకేతాలు వచ్చినట్టు సమాచారం. సెప్టెంబరులో ఎన్నికలు ఉండొచ్చని సమాచారం. తెలంగాణలో ఉప ఎన్నిక వేడి రోజురోజుకూ పెరుగుతోంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో బద్వేలు ఉప ఎన్నికపై రాజకీయ పార్టీల్లో ఉలుకుపలుకు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
మరీ ముఖ్యంగా వైసీపీకి బద్వేలు కంచుకోట కావడంతో తాము చేయగలిగిందేమీ లేదనే నిస్పృహలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఉంది. ఒక రకంగా ఓటమికి టీడీపీ ముందే సిద్ధమైందనేందుకు బద్వేలు ఉప ఎన్నిక ఉదాహరణగా నిలవనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక మిగిల్చిన చేదు అనుభవాలను మరిచిపోకనే బద్వేలు ఉప ఎన్నిక రావడం టీడీపీకి ఒకింత తలనొప్పి అని చెప్పొచ్చు. బద్వేలు ఉప ఎన్నికను ఆహ్వానించడమంటే మరో ఓటమిని మూటకట్టుకునేందుకు సిద్ధపడడమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.