సామాన్యులకు పదవులు ఇవ్వడంలో ఎన్టీఆర్ తర్వాత, ఆ ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే దక్కుతుంది. కోటీశ్వరులకు తప్ప సామాన్యులకు ప్రస్తుత రాజకీయాల్లో ప్రవేశం లేదనే వాతావరణం ఆందోళన కలిగిస్తోంది. కానీ ఎవరూ ఊహించని విధంగా సాధారణ ఉద్యోగులు, సామాన్య వ్యక్తులకు లోక్‌సభ టికెట్లు ఇవ్వడమే కాకుండా, వారిని గెలిపించి అత్యున్నత చట్ట సభలకు పంపిన వైఎస్ జగన్ అభినందనీయుడు.
నందిగాం సురేష్ (బాపట్ల), గొడ్డేటి మాధవి (అరకు), చింతా అనురాధ (అమలాపురం), నల్లకొండగారి రెడ్డెప్ప (చిత్తూరు), గోరంట్ల మాధవ్ (హిందూపురం), తలారి రంగయ్య (అనంతపురం), డాక్టర్ గురుమూర్తి (తిరుపతి) తదితర విద్యావంతులు, ఉద్యోగులు లోక్‌సభలో అడుగు పెడతామని కనీసం కలలో కూడా ఊహించి ఉండరు. ఇదే విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో వీరు చెప్పిన సంగతి తెలిసిందే. వీరే కాకుండా ఇటీవల వివిధ నామినేటెడ్ పదవులు కూడా సామాన్యుల్ని వరించాయి. ఇంత వరకూ బాగానే ఉంది.
జగన్ పదవులు ఇవ్వడంతో వారికంటూ సమాజంలో ఓ హోదా వచ్చింది. అందుకు తగ్గట్టు మసలుకోవాల్సిన పరిస్థితి అనివార్యమైంది. అయితే రూపాయికి విలువ పడిపోయిన పరిస్థితుల్లో ఖర్చు తడిసి మోపెడు అవుతోందని ఎంపీలు మొదలుకుని నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్న వాళ్లు లబోదిబోమంటున్నారు.
జగన్ అన్న ఎంపీ చేశారనే సంబరం క్రమంగా కనుమరుగ వుతోందని, నెలకు హీనమంటే రూ.3 లక్షలు అప్పు అవుతోందని ఓ లోక్‌సభ సభ్యుడొకరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలకే డబ్బంతా సరిపోతోందని, ఏదైనా పని చేసి ఖర్చులకు సంపాదించుకుందామన్నా, ఆ పరిస్థితి లేదని నిష్టూర మాడుతున్నారు.
జగన్ పాలనలో చివరికి నేతలకు ఆదాయం వచ్చే పరిస్థితి కూడా లేదని, దీంతో స్టేటస్‌కు తగ్గట్టు కష్టమైనా నష్టమైనా కనీస ఖర్చులు భరించాల్సి వస్తోందని మరికొందరు ప్రజానిధులు వాపోతున్నారు. తమకు ఆర్థిక ఇబ్బందులంటే తప్పు పట్టే వాళ్లు ఉంటారని, కానీ ఇది పచ్చి నిజమని చెబుతున్నారు.
ఇటీవల ఓ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కించుకున్న నేత… శక్తికి మించి అప్పు చేసి మరీ కారు పెట్టుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. పదవులొచ్చిన వారిది ఒక బాధ, రానివారిది మరో రకమైన బాధ అన్నట్టుగా తయారైందనే గుసగుసలు వైసీపీలో వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా దళిత ఎంపీలు, వెనుకబడిన కులాలకు చెందిన నాయకులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. తమది మూగరోధన అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఎంపీ చెబుతున్నారు. అలాగని పదవి వద్దని చెప్పలేక, వస్తే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పరిస్థితి. ఈ సమస్యకు పరిష్కారం ఉందా? అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.