ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కేసీఆర్ కి బాగా తెలుసు. అందుకే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఆయన పూర్తిగా తగ్గారు. ఎన్నికలు ఇప్పుడు వద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి తేల్చి చెప్పారు. దీంతో వివాదాల తేనెతుట్టెకు మరికొన్నిరోజులు దూరంగా ఉండే అవకాశం ఆయనకు లభించినట్టయింది.
వాస్తవానికి జూన్ లోనే ఏడుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసింది. వీరిలో ఆరుగురు ఎమ్మెల్యే కోటాలో ఎన్నిక కావాల్సినవారు కాగా, ఒక్కరిని మాత్రం గవర్నర్ ఎంపిక చేయాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు చక్కబడ్డాయి. తెలంగాణలో సెకండ్ వేవ్ భయాలు దాదాపుగా తొలగిపోయాయి, జనజీవనం సాధారణ స్థాయికి చేరుకుంది.
అయినా కూడా ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోసం కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. నోటిఫికేషన్ విడుదల చేయమంటారా అంటూ అడిగింది. కేసీఆర్ ఊహించని విధంగా బదులిచ్చారు. కరోనా కష్టకాలంలో ఎన్నికలు వద్దంటూ లేఖ రాశారు, ఇటు ఆశావహులకు షాకిచ్చారు.
అన్నీ చేసిన కేసీఆర్ కి ఇదొక లెక్కా..?
సెకండ్ వేవ్ జోరుగా ఉన్న సమయంలోనే తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు లేని కరోనా నిబంధనలు కేసీఆర్ కి ఇప్పుడు గుర్తు రావడం నిజంగా విడ్డూరమే. గతంలో కేసీఆర్ చేపట్టిన గార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారం వల్లనే ఆ ప్రాంతంలో కరోనా కేసులు భారీగా పెరిగాయనే అపవాదు కూడా ఉంది.
కరోనా కేసులు భారీగా పెరుగుతున్నా లాక్ డౌన్ పై మీనమేషాలు లెక్కించి కోర్టుతో చీవాట్లు తిన్న కేసీఆరేనా ఇప్పుడిలా ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా కోరింది అంటూ ఆ పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. పైగా ఇవి ప్రజలంతా ఓట్లు వేసే సాధారణ ఎన్నికలు కావు, ఎమ్మెల్యేలు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు.
అది కూడా అత్యంత భద్రతా ప్రమాణాల మధ్య అసెంబ్లీలో ఓటింగ్ జరుగుతుంది. మరి ఇక్కడ కొవిడ్ నిబంధనల ప్రస్తావన ఏముంటుంది. ఎమ్మెల్యేలు ఎలాగూ జాగ్రత్త తీసుకుంటారు. అవసరమైతే ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్ష నిర్వహించే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ ఎన్నికలతో సామాన్య ప్రజలకు ఇబ్బంది ఉండదు. ప్రచారం కూడా లేదు కాబట్టి, ఎవరికీ ఎలాంటి కష్టం, నష్టం ఉండదు.
మరి కేసీఆర్ ఎందుకు వెనక్కి తగ్గారు?
కేసీఆర్ కి ఉన్నఫలంగా వివాదాల తేనెతుట్టె కదిపేందుకు ఇష్టంలేదు. ఇప్పటికే ఆయన చాలామందికి హామీలు ఇచ్చేశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో సహకరించినందుకు కోటిరెడ్డికి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు కేసీఆర్. బహిరంగ సభలో ఆ ప్రకటన చేశారు. అదే జరిగితే సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డిని సామాజిక కారణాలతో పక్కనపెట్టాల్సిన పరిస్థితి. విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, రజక, పద్మశాలి వర్గాలకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామంటూ గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ కేసీఆర్ కి గుర్తుండే ఉంటుంది.
మాజీ స్పీకర్ మధుసూదనా చారి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బోడికుంట వెంకటేశ్వర్లు, పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, దేశపతి శ్రీనివాస్, రమేష్ రెడ్డి.. ఇలా ఆశావహుల పేర్లు చెప్పుకుంటూ పోతే.. ఇటీవలే పార్టీలో చేరిన ఎల్.రమణ వరకు ఆ లిస్ట్ ఉంది. మరి చేతిలో ఉన్న ఏడు స్థానాలతో ఇంతమందిని కేసీఆర్ సంతృప్తిపరచగలరా..?
పైగా ఇది హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ.. అందుకే ఎందుకీ రచ్చ అనుకున్నారేమో. ఇప్పటికిప్పుడు తనపై బరువు, భారం లేకుండా కేసీఆర్ సేఫ్ గేమ్ ఆడారు. కరోనా సాకుతో ఎమ్మెల్సీ ఎన్నికల వాయిదా కోరారు.