నరసాపురం వైసిపి అసమ్మతి ఎమ్.పి రఘురామకృష్ణరాజు, రెండు టీవీ చానళ్లకు సంబంధించిన కేసులో సుప్రింకోర్టులో సిఐడి వేసిన అఫిడవిట్ లోని అంశాలు చూస్తే తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారం ట్విస్టుల మీద ట్విస్టులతో ధ్రిల్లర్ మాదిరి సాగుతోందని చెప్పాలి.
విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే యత్నం చేస్తున్నారని, అందుకు రెండు టీవీ చానళ్లు సహకరిస్తూ కుట్రలో భాగస్వామ్యులుగా ఉన్నాయంటూ అభియోగాలు మోపి రఘురాజుపై కేసు పెట్టడం, ఆయనను హైదరాబాద్ లో అరెస్టు చేసి గుంటూరుకు తీసుకు వెళ్లడం, తదుపరి ఆయనను సిఐడి విచారించడం, ఆ మీదట కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంలో తనను సిఐడి వారు కొట్టారని రాజు ఆరోపించడం వంటి ఘట్టాలు ఒక సినిమా మాదిరిగా సాగాయి.
అక్కడితో ఆగలేదు. హైకోర్టులో బెయిల్ రాకపోవడం, వెంటనే ఆయన సుప్రింకోర్టుకు వెళ్లడం, ఆర్మి ఆస్పత్రిలో వైధ్య పరీక్షలకు పంపాలని కోర్టు ఆదేశించడమే కాకుండా, ఆయనకు బెయిల్ మంజూరు చేయడం జరిగిపోయాయి. ఆ సందర్భంలో రాజద్రోహం సెక్షన్ లపై కూడా కోర్టులో పెద్ద చర్చే జరిగింది. ఆ తర్వాత రఘురాజు ఆర్మి ఆస్పత్రి నుంచి చెప్పాపెట్టకుండా డిల్లీ వెళ్లి, అక్కడ నుంచి ఆపరేషన్ ఆరంభించడం కూడా ఆసక్తికరంగానే ఉంది.
కొద్దిరోజులు ముఖ్యమంత్రి జగన్ కు లేఖలు రాయడం, ఆ తర్వాత మళ్లీ టివీలలో రాజకీయ అంశాలపై మాట్లాడడం వంటివి చేస్తూ వస్తున్నారు. అలాగే రెండు మీడియా సంస్థలు కూడా సుప్రింకోర్టును ఆశ్రయించి తమపై నిర్భంద చర్యలు ఏవీ లేకుండా రక్షణ పొందగలిగాయి. ఈ నేపద్యంలో ఏపీ సిఐడి సుప్రింకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లోని అంశాలను బార్ అండ్ బెంచ్ వెబ్ సైట్ ఆధారంగా టిడిపికి మద్దతు ఇచ్చే మీడియా ముందుగా వార్తగా కవర్ చేస్తూ, దానిని తనకు అనుకూలంగా మలచుకునే యత్నం చేసింది.
అదేదో రఘురాజు వ్యాఖ్యల వీడియోల కోసం ఒక టీవీ చానల్ యజమాని 8 లక్షల యూరోలు చెల్లించారని అఫిడవిట్ లో ఉన్నట్లుగా ప్రచారం చేశారు. అయితే అది కేవలం వారిమద్య ఆర్దిక లావాదేవీలను తెలియచేయడానికే ఈ విషయం వెల్లడించారని తేలింది. వీటన్నిటిని ఆయన ఖండిస్తున్నారు. అది వేరే విషయం. రఘురాజు ఆయా ప్రముఖులతో ముఖ్యంగా టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ లతో జరిపిన వాట్సప్ చాట్ లకు సంబందించిన విశేషాలు వేరే మీడియాలో రావడంతో సిఐడి అఫిడవిట్ లో అసలు ఏమి ఉందో కొంతవరకు అర్ధం అయింది.
వైసిపి అసమ్మతి ఎమ్.పి తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని వాదిస్తున్నారు. కాని ప్రత్యర్ధి రాజకీయ పార్టీ నేతతో సంప్రదింపులు జరిపి వైసిపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఆయన చేసిన ప్రయత్నాలు అన్నిటిని సిఐడి బయటపెట్టిందని అనుకోవాలి. ఈ చాట్ లో టిడిపి నేత ఒక కేసు విషయంలో ఎపి హైకోర్టులోని ఒక న్యాయమూర్తి కులం గురించి ప్రస్తావించడమే కాకుండా, న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేరీతిలో ఆ జడ్జిని పంపించేయాలని అన్నట్లుగా కూడా అఫిడవిట్ లో ఉన్నట్లు మీడియా కధనాలు చెబుతున్నాయి.
అలాగే కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు పెంచడానికి రాజు ప్రయత్నించారని, అందుకు కొన్ని టీవీ చానళ్లవారు సహకరించారన్న అబియోగాన్ని మోపిన సిఐడి, దీనికి సంబందించి కొన్ని ఆధారాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. అంతిమంగా సుప్రింకోర్టులో ఈ కేసు ఏమి అవుతుందో కాని, టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ను రఘురాజు ద్వారా వేయించడంలో కాని, ఇతర అంశాలలో కాని కుట్రలు పన్నారని వైసిపి చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతున్నట్లుగా ఉంది.
అయితే సాంకేతికంగా ఈ వాట్సప్ చాట్ లను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటుందా? లేదా అన్నది తెలియదు. ఇప్పటివరకు రఘురాజు కేసులో సిఐడి కన్నా, రాజు దే పైచేయిగా వస్తోంది. మరి ఇప్పుడు సిఐడి తాజా అఫిడవిట్ లో వచ్చిన విశేషాలు చూస్తే , రాజు కొంతవరకు ఆత్మరక్షణలో పడవచ్చని కొందరు నిపుణుల అభిప్రాయంగా ఉంది. కోర్టులో ఏమి అయినా, కాకపోయినా, ప్రజా క్షేత్రంలో ఈ అఫిడవిట్ లోని అంశాలు చదివిన వారికి ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా ఏదో పెద్ద కుట్రే జరుగుతోందన్న భావన కలుగుతుంది.
మామూలుగా అయితే తెలుగుదేశం నేతలు వారికి సంబందం లేకపోతే ఈపాటికి తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. వారికి మధ్దతు ఇచ్చే మీడియా గగ్గోలు పెడుతుండేది. కాని టిడిపి నేతలు ఎందుకో మౌనం దాల్చారు. ఇది కూడా ఆసక్తికరమైన అంశమే. గతంలో ఓటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబు ఆత్మరక్షణలో పడి, డిల్లీ వరకు వెళ్లి, ఎలాగొలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో రాజీ కుదుర్చుకుని కేసునుంచి బయటపడ్డారు.
మరి ఈ చాటింగ్ వ్యవహారం చంద్రబాబు, లోకేష్ లకు కూడా తలనొప్పి అవుతుందా? లేదా అన్నది అప్పుడే చెప్పలేం. మొత్తం మీద రఘురాజు, రెండు మీడియా సంస్థల వచ్చిన కేసు పరిణామాలు ఎలా ఉంటాయో, ఎన్ని ట్విస్టులు ఉంటాయో తెరపై చూడవలసిందే.
కొమ్మినేని శ్రీనివాసరావు