ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ పునర్వస్థీకరణలో పదవిని కోల్పోయిన పశ్చిమబెంగాల్ బీజేపీ నేత బాబుల్ సుప్రియో తను రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఆయన ఒక పోస్టు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. తను ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా, రాజకీయాల నుంచి కూడా వైదొలుగుతున్నట్టుగా సుప్రియో ప్రకటించుకున్నాడు. తను ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టుగా, బీజేపీ నుంచి కూడా వైదొలిగి ఏ పార్టీలోనూ చేరడం లేదంటూ ప్రకటించుకున్నారు. తను రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నట్టుగా ఈయన ప్రకటించారు.
అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీ ఇలా ప్రకటించడం ఆసక్తిదాయకమైన అంశమే. సుప్రియో అసహనం అంతా మంత్రి పదవిని కోల్పోవడం వల్లనే అనే స్పష్టం అవుతోంది. 2014లో తొలిసారి ఎంపీగా గెలిచారీయన. బీజేపీలోకి చేరి, ఎంపీగా నెగ్గారు. 2019లోనూ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవలి వరకూ కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఆశాకిరణాల్లో ఒకరిగా నిలిచారీయన. అయితే ఇటీవలే ఈయనను మంత్రివర్గం నుంచి తొలగించారు.
అయితే దానికి ముందో ఆసక్తిదాయకమైన పరిణామం చోటు చేసుకుంది. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ ఎంపీల్లో ఒకరు బాబుల్ సుప్రియో. ఎంపీగా, కేంద్రమంత్రిగా ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈయన ఆ ఎన్నికల్లో చిత్తయ్యారు. బాబుల్ సుప్రియోపై టీఎంసీ అభ్యర్థి దాదాపు 50 వేల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించాడు. ప్రజలు అవకాశం ఇచ్చారని చెప్పి ఆట ఆడితే చెల్లదని అటు సుప్రియోకు, బీజేపీకి గట్టి సందేశమే అందినట్టుగా ఉంది.
ఎమ్మెల్యేగా ఓడిపోయిన నువ్వు… ఇక మంత్రిగా ఎందుకనుకున్నారో ఏమో కానీ, ఈయనను కేంద్రమంత్రి వర్గం నుంచి మోడీ తొలగించారు. ఈ విషయంపై ఇప్పటి వరకూ బాహాటంగా అసహనం వ్యక్తం చేయని సుప్రియో.. ఎంపీ పదవికి రాజీనామా అంటూ ప్రకటించుకున్నారు. అయితే నిజంగా చేస్తారా? ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ పదవికి రాజీనామా చేసి, బెంగాల్ లో ఉప ఎన్నిక తెస్తానంటే బీజేపీ హైకమాండ్ అందుకు పర్మిషన్ ఇస్తుందా? అనేవి ఆసక్తిదాయకమైన విషయాలు.
ఈ అంశంపై టీఎంసీ నేతలు స్పందిస్తూ.. ఇదొక పొలిటికల్ డ్రామా అని, ఆయన రాజీనామా చేయాలనుకుంటే.. లోక్ సభ స్పీకర్ కు రాజీనామా లేఖ పంపాలి తప్ప, ఫేస్ బుక్ లో పోస్టు పెడితే ఉపయోగం ఏంటంటూ.. టీఎంసీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.