ఈ సారి ఒలింపిక్స్ లో స్వర్ణం మీద గురిపెట్టినట్టుగా కనిపించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సింధూ సెమిస్ లో ఓటమి పాలైంది. చైనిస్ తైపీకి చెందిన తన చిరకాల ప్రత్యర్థి చేతిలో ఆమె మరోసారి ఓటమి పాలైంది. స్వర్ణ పతకం అవకాశాలు అలా చేజారగా, ఇక కాంస్య పతకం ఆశలు మాత్రం మిగిలే ఉన్నాయి. సెమిస్ లో ఓటమి పాలైన ఇద్దరు బ్యాడ్మింటన్ ప్లేయర్లు కాంస్య పతకం కోసం ఈ సండే తలపడుతున్నారు. ఈ మ్యాచ్ లో సింధూకు చైనీ ప్లేయర్ తో తలపడుతోంది. గత ఒలింపిక్స్ లో సిల్వర్ సాధించిన సింధూ, మరోసారి అదే ఫీట్ సాధించే అవకాశాలు మిగిలే ఉన్నాయి. ఇలా ఒలింపిక్స్ పతకం విషయంలో ఈ సండే ఇండియాకు ఒక బిగ్ డే గా నిలుస్తోంది.
అలాగే ఆదివారం రోజున మరో కీలకమైన మ్యాచ్ జరగనుంది. అది హాకీ కి సంబంధించింది. ఇప్పటికే హాకీలో క్వార్టర్ ఫైనల్ కు చేరిన భారత జట్టు.. ఆ మ్యాచ్ లో గ్రేట్ బ్రిటన్ తో తలపడనుంది. గ్రేట్ బ్రిటన్ పై విజయం సాధిస్తే.. భారత జట్టు సెమిస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. సెమిస్ కు చేరితే ఏదో ఒక పతకం కోసం పోరాటానికి అవకాశం లభించినట్టే. అయితే ఎప్పుడు ఎలా ఆడుతుందో అంతుబట్టని రీతిలో ప్రదర్శనను ఇచ్చే భారత హాకీ టీమ్ గ్రేట్ బ్రిటన్ తో మ్యాచ్ ను ఎలా ముగిస్తుందనేది ఆసక్తిదాయకమైన అంశమే.
1980 ఒలింపిక్స్ తర్వాత ఇండియా హాకీలో ఎలాంటి పతకాన్నీ సాధించిన దాఖలాలు లేవు. దాదాపు 40 యేళ్ల తర్వాత హాకీలో ఇండియా పతకం సాధిస్తే అంతకు మించిన అద్భుతం ఉండదు. ఈ సారి ఒలింపిక్స్ లో ఇండియన్ హాకీ టీమ్ గోల్డ్ మెడల్ సాధిస్తే.. కోట్ల రూపాయల బహుమతులు ఇస్తామంటూ ఇప్పటికే అనౌన్స్ మెంట్లు వస్తున్నాయి. మరి క్వార్టర్స్ లో పురుషుల హాకీ టీమ్ ప్రదర్శన ఎలా ఉంటుందనేది ఉత్కంఠభరితంగా మారింది. అలాగే మహిళల హాకీ టీమ్ కూడా క్వార్టర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇక ఆదివారం మ్యాచ్ ల విషయానికి వస్తే పురుషుల హెవీ వెయిట్ బాక్సింగ్ లో సంతోష్ కుమార్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ మ్యాచ్ లో అతడు నెగ్గితే బాక్సింగ్ లో మరో పతకం ఖాయమైనట్టే. ఇప్పటికే మహిళల హెవీ వెయిట్ విభాగంలో భారత బాక్సర్ సెమిస్ లోకి చేరారు. బాక్సింగ్ లో సెమిస్ కు చేరితే ఎలాగూ పతకం ఖాయం కాబట్టి.. సంతోష్ మరొక్క మ్యాచ్ నెగ్గినా ఇంకో పతకం ఖరారు అయినట్టే.