మొత్తానికి బీజేపీ ఎమ్మెల్సీకే షాక్ … ?

అవును మరి.. రాజకీయం ఆంటే అలాగే ఉంటుంది మరి. మనకు నచ్చినట్లుగా మనం మాట్లాడుతూంటే అవతల వారు నచ్చిన డిమాండ్ వారు చేస్తారు. ఈ సంగతి అర్ధమయ్యేసరికి బీజేపీకి ఏపీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే…

అవును మరి.. రాజకీయం ఆంటే అలాగే ఉంటుంది మరి. మనకు నచ్చినట్లుగా మనం మాట్లాడుతూంటే అవతల వారు నచ్చిన డిమాండ్ వారు చేస్తారు. ఈ సంగతి అర్ధమయ్యేసరికి బీజేపీకి ఏపీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే పదవికే ఎసరు వచ్చేలా ఉంది. మరో రెండేళ్ల పదవీకాలం చేతిలో ఉండగానే రాజీనామా చేసేయమంటున్నారు ఉక్కు ఉద్యమకారులు.

మీ పదవిని వదులుకోవాల్సిందే అంటూ గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. ప్లే కార్డులతో రోడ్ల మీదకు వచ్చి ఆందోళన కూడా చేపడుతున్నారు. ఇంతకీ బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ చేసిన నేరమేంటి అంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సమర్ధించడమే. అవును వేళ కాని వేళ పార్టీ లైన్ అంటూ ఏదేదో మాట్లాడితే ఇలాగే కధ ఉంటుంది మరి.

ఒక వైపు ఆరు నెలలుగా అలుపెరగని తీరున ఉక్కు ఉద్యోగులు ఆందోళన చేస్తూంటే బీజేపీ నాయకులు ఎవరూ ఇప్పటిదాకా అసలు ప‌ట్టించుకోలేదు. విశాఖలోనే మాధవ్ లాంటి నాయకులు ఉంటూ కూడా అక్కడే ఉన్న ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తామంటే కూడా ఉలకలేదు, పలకలేదు. 

ఇపుడు తాపీగా ఉక్కు ప్రైవేటీకరణ అవుతుంది అయినా కార్మికులకు న్యాయమే జరుగుతుంది అంటూ బీజేపీ పెద్దలు నీతి కధలు చెబుతూంటే ఎవరికైనా మండుకురాదా.

అందుకే మా ఉద్యోగాల సంగతి తరువాత ముందు అర్జంటుగా మీ ఎమ్మెల్సీ ఉద్యోగానికి రాజీనామా చేసేయండి అంటూ మాధవ్ కి అల్టిమేటం జారీ చేశారు ఉక్కు ఉద్యమకారులు. మొత్తానికి అటు కేంద్రాన్ని సమర్ధించి ఇటు లోకల్ గా ఉన్న కార్మికులతో పెట్టుకున్న దానికి బీజేపీ ఎమ్మెల్సీ తెగ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.