పారితోషికం కింద కోట్లు అందుకుంటున్న తరువాత వాటిని ఎక్కడో అక్కడ పెట్టుబడి పెట్టాల్సిందే. అందుకే సినిమా జనాలు ఎక్కువగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతుంటారు. భూములు, ఆఫీస్ స్పేస్ లు అన్న వాటిపైనే ఎక్కువ మదుపు పెడతారు.
లేటెస్ట్ గా ఎన్టీఆర్ హైదరాబాద్ నగర శివార్లలో ఆరు ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసారు. దాని రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ఇప్పుడే పూర్తి చేసుకున్నారు. ఇంతకు ముందు ఆఫీస్ స్పేస్ ల మీద ఎన్టీఆర్ ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు.
హీరో నితిన్ నెల్లూరు-తిరుపతి మధ్యలో 48 ఎకరాల మామిడి, నిమ్మ తోట ను తీసుకునే ప్రయత్నంలో వున్నారు. ప్రస్తుతం బేర సారాలు నడుస్తున్నాయి.
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చిలుకూరు సమీపంలో మంచి ఫార్మ్ లాండ్ కొనుగోలు చేసారు. అక్కడ ఆయన తండ్రి బెల్లం కొండ సురేష్ ఓ మాంచి ఫార్మ్ హౌస్ కట్టే ప్రయత్నాల్లో వున్నారు.
వీరికి భిన్నంగా వుంది నయనతార పెట్టుబడి. చెన్నయ్ లోని చాయ్ విల్లా అనే చైన్ కేఫ్ ల్లో అయిదు కోట్లు పెట్టుబడి పెట్టింది ఆమె.
కాఫీ డే స్టోర్ ల మాదిరిగా చాయ్ విల్లా కూడా చెయిన్ స్టోర్ లు నిర్వహిస్తోంది. ఆ స్టోర్ ల విస్తరణకు నయనతార పెట్టుబడి అందించింది.