విమానాల్లో ప్రయాణాలు.. ఆన్ లైన్ లో అమ్మకాలు

దొంగతనం చేసేవాడు ఏం చేస్తాడు..? కొట్టుకొచ్చిన వస్తువుల్ని ఎంతో కొంత రేటుకు అమ్మేస్తాడు. తన దారిన తాను పోతాడు. కానీ వీళ్లు మాత్రం హైటెక్ దొంగలు. దొంగతనం చేయడానికి విమానాల్లో వస్తారు, దర్జాగా దొంగతనం…

దొంగతనం చేసేవాడు ఏం చేస్తాడు..? కొట్టుకొచ్చిన వస్తువుల్ని ఎంతో కొంత రేటుకు అమ్మేస్తాడు. తన దారిన తాను పోతాడు. కానీ వీళ్లు మాత్రం హైటెక్ దొంగలు. దొంగతనం చేయడానికి విమానాల్లో వస్తారు, దర్జాగా దొంగతనం చేస్తారు. అలా దొంగిలించిన వాటిని ఓఎల్ఎక్స్ లో పెట్టి అమ్మేస్తారు. వీళ్లు దొంగిలించేవి కేవలం బైక్స్ మాత్రమే.

రాజస్థాన్ కు చెందిన వికాస్, ధావల్, దశరథ్ హైటెక్ దొంగలు. ఆన్ లైన్లో కస్టమర్లు అప్ లోడ్ చేసిన బండి కాగితాల ఆధారంగా నకిలీ డాక్యుమెంట్లు తయారుచేస్తారు. ఆర్సీ బుక్కులతో పాటు.. పొల్యూషన్ సర్టిఫికెట్లు కూడా రెడీ చేస్తారు. ఇలా రెడీ అయిన తర్వాతే అసలు మేటర్ లోకి వస్తారు..

ఇలా డాక్యుమెంట్లు రెడీ చేసిన తర్వాత వీళ్లంతా రాజస్థాన్ నుంచి బెంగళూరుకు విమానంలో వస్తారు. పార్క్ చేసిన బైక్స్ కు హ్యాండిల్ లాక్స్ విరగ్గొట్టి తస్కరిస్తారు. ఎవ్వరూ ఆపకుండా ఉండేందుకు, ఆ బైక్స్ కు పోలీస్ స్టిక్కర్లు కూడా అతికిస్తారు. ఆ తర్వాత తాము తయారుచేసిన డాక్యుమెంట్లు ఆధారంగా నంబర్ ప్లేట్లు, ఇతర పార్టులు మార్చేసి.. ఓఎల్ఎక్స్ లో పెట్టి అమ్మేస్తారు.

వచ్చిన డబ్బుతో మళ్లీ విమానాల్లో రాజస్థాన్ వెళ్లి జల్సాలు చేస్తోంది ఈ గ్యాంగ్. డబ్బులు అయిపోయిన వెంటనే మళ్లీ విమానాల్లో బెంగళూరు రావడం, బైకులు కొట్టేయడం ఇదే వీళ్ల పని. 

మొత్తానికి వీళ్ల పాపం పండింది. బైక్ కొట్టేస్తున్నప్పుడు రికార్డ్ అయిన సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా బెంగళూరు పోలీసులు వీళ్లందర్నీ పట్టుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 26 బైకుల్ని వీళ్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే అమ్మేసిన బైకులు పదుల సంఖ్యలో ఉండొచ్చని అనుమానిస్తున్నారు.