పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది అరణ్య. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఒకే రోజు విడుదల చేయాలనేది ప్లాన్. కేవలం ఈ భారీ రిలీజ్ కోసమే సంక్రాంతిని కూడా వదులుకుంది యూనిట్. కానీ వాళ్ల కోరిక నెరవేరలేదు. అరణ్య హిందీ వెర్షన్ విడుదల కావడం లేదు. ఈ మేరకు ఈరోస్ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది.
“ఈ న్యూస్ షేర్ చేయడం కాస్త బాధగానే ఉంది. హిందీ మార్కెట్లో ఉన్న కరోనా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని హాథీ మేరీ సాథీ విడుదలను నిలుపుచేయాలని నిర్ణయించాం దీనిపై మరిన్ని అప్ డేట్స్ ను త్వరలోనే అందిస్తాం. అయితే అరణ్య, కాదన్ మాత్రం సౌత్ మార్కెట్లో విడుదలవుతాయి.”
తెలుగులో అరణ్యగా, తమిళ్ లో కాదన్ గా, హిందీలో హాథీ మేరీ సాధీగా తెరకెక్కింది ఈ ప్రాజెక్టు. ఇప్పుడు కేవలం సౌత్ లో మాత్రమే రిలీజ్ అవుతోంది. బాహుబలి తర్వాత తన సినిమా ఒకేసారి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుందని భావించిన రానాకు ఇది చిన్న ఎదురుదెబ్బ. అయితే హిందీ మార్కెట్ పై మరింత దృష్టిపెట్టడానికి, ఇంకాస్త గట్టిగా ప్రచారం చేయడానికి వాళ్లకు టైమ్ దొరుకుతుంది.
ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కింది హాథీ మేరీ సాధీ సినిమా. థాయిలాండ్, కేరళ, సతార్, మహాబలేశ్వరం అడవుల్లో ఈ సినిమాను షూట్ చేశారు. సినిమాలో రానా తండ్రి పాత్రకు వెంకటేష్, వాయిస్ ఓవర్ ఇచ్చారు.