ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా తమ చేతిలో కీలుబొమ్మలాంటి వారిని పెట్టుకోవాలనేది చంద్రబాబు ఆలోచన. అయితే తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో ఆయన అచ్చెన్నాయుడికి ఓటేశారు. అచ్చెన్నలాంటి దూకుడు మనస్తత్వం ఉన్న నాయకుడి ముందు లోకేష్ తేలిపోతారని తెలిసినా కూడా ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చి మమ అనిపించారు. అయితే అక్కడ్నుంచే అచ్చెన్నను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు.
పరోక్షంగా టీడీపీ అనుకూల మీడియా కూడా అచ్చెన్న పరపతి తగ్గించే పనుల్లో పడింది. చంద్రబాబు మాట్లాడినా, చినబాబు ట్వీట్ చేసినా బ్యానర్ ఐటమ్ గా వేసే టీడీపీ మీడియా.. అచ్చెన్నాయుడి నిరసనలు, ఆందోళనలకు సరైన ప్రయారిటీ ఇవ్వట్లేదు. రాగా పోగా.. పట్టాభిరాం లాంటి వారిని అను'కుల' మీడియా హైలెట్ చేస్తోంది, బీసీ అయిన అచ్చెన్నను మాత్రం కావాలనే తొక్కేస్తోంది.
పార్లమెంటరీ పార్టీల అధ్యక్షుల ఎంపికలో అవమానం..
ఇటీవల పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా అధ్యక్షుల్ని నియమించింది టీడీపీ. అయితే ఈ ఎంపికలో అచ్చెన్నాయుడికి ఏమాత్రం ప్రయారిటీ ఇవ్వలేదు. అచ్చెన్నాయుడు సిఫార్సుల్ని కూడా కావాలనే పక్కనపెట్టారని అంటారు. నియామకాల తర్వాత ఆయా నాయకులతో అచ్చెన్న నేరుగా టచ్ లోకి వెళ్లాలని చూశారని, దానికి కూడా అధినేత బ్రేకులు వేశారు.
వాస్తవానికి అచ్చెన్నాయుడు కుటుంబానికి సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ పూర్తిగా భ్రష్టుపట్టిపోయిన దశలో కూడా కింజరాపు కుటుంబం మాత్రం వైసీపీ హవాను తట్టుకుని నిలబడగలిగింది.
కనీసం ఆ గౌరవం కూడా చంద్రబాబు వారికి ఇవ్వడంలేదు. ఒకరకంగా బాబులో వారి పట్ల అభద్రతా భావం కూడా ఉందనేది నిజం. అందుకే అచ్చెన్నాయుడిని కానీ, రామ్మోహన్ నాయుడిని కానీ, ఎదగనివ్వడం లేదు. పార్టీలో ఉన్న ఒకే ఒక్క మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని వాయిస్ కూడా ఎక్కడా వినిపించకుండా చేశారు.
అచ్చెన్నను బలిపశువుని చేస్తున్నారా..?
ఈఎస్ఐ స్కామ్ లో కూడా అచ్చెన్న ఓ పావు మాత్రమే. అసలు లబ్ధిదారులు చంద్రబాబు కుటుంబమేనని అంటారు. ఒక రకంగా బాబు బండారం బయటపెట్టకుండానే అచ్చెన్నాయుడు జైలుకెళ్లి వచ్చారు.
అయితే ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఇప్పుడు అచ్చెన్నను పార్టీ కోసం బలిపశువుని చేస్తున్నారని టీడీపీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. అనుకూల మీడియాలో అచ్చెన్నాయుడి ప్రయారిటీని పూర్తిగా తగ్గించేయడానికి కారణం చంద్రబాబేనని అంటారు.