కర్ణాటక కొత్త సీఎంగా బొమ్మై ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఇక కీలకమైన మంత్రివర్గ ఏర్పాటు వ్యవహారం మాత్రం మిగిలే ఉంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇప్పుడప్పుడే కాదన్నట్టుగా స్పందించడం ఆసక్తిదాయకంగా మారింది. దీనికి టైమ్ తీసుకుంటుందన్నట్టుగా ఆయన స్పందించారు.
గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఇప్పటికే అక్కడ అసంతృప్త వాదులు భగ్గమనే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో పాటు.. డిప్యూటీ సీఎం హోదాల విషయంలో, మంత్రివర్గం విషయంలో కొందరు అప్పుడే సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు.
బొమ్మై మంత్రివర్గంలో తనకు స్థానంలో అవకాశం అక్కర్లేదంటూ మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ వ్యాఖ్యానించారు. గతంలో ఈయన కర్ణాటక సీఎంగా చేశారు. అయితే యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యాకా మంత్రిగా వ్యవహరించాల్సి వచ్చింది.
యడియూరప్ప అంటే సీనియర్ కాబట్టి తను పని చేసినట్టుగా, తనకంటే జూనియర్ అయిన బొమ్మై మంత్రివర్గంలో తనకు స్థానం అక్కర్లేదంటూ ఆయన అసహనంతోనే తేల్చేశారు. ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించిన వారిలో షెట్టర్ ఉన్నారు. ఇప్పుడు మంత్రి పదవి వద్దనడం ద్వారా ఆయన అసంతృప్తిని చాటే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక అసంతృప్తవాదుల్లో ఒకరిగా ఉన్నారు శ్రీరాములు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలప్పుడు శ్రీరాములుకు బీజేపీ హైకమాండ్ చాలా ప్రాధాన్యతను ఇచ్చింది. ఒక దశలో ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థి అనేంత రేంజ్ లో హడావుడి జరిగింది. అయితే ప్రస్తుత పరిణామాల్లో శ్రీరాములు తనకు ఇసుమంత ప్రాధాన్యత కూడా దక్కడం లేదనే భావనలో ఉన్నాడట.
ఇక ఉపముఖ్యమంత్రి పదవుల విషయంలో కూడా పోటీ నెలకొని ఉంది. కనీసం ఐదు ఉపముఖ్యమంత్రులను ఎంపిక చేయనుందట అధిష్టానం. ఆ పదవులను కులాల వారీగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కసరత్తు అయితే సాగుతూ ఉన్నట్టే. ఎవరెవరికి మంత్రివర్గంలో స్థానం అనే అంశంపై… ప్రకటనలు వస్తే.. అసంతృప్తి భగ్గుమనే అవకాశాలున్నాయి.
ప్రత్యేకించి యడియూరప్ప మంత్రివర్గంలో స్థానం అనే హామీతో కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ప్రస్తుత మంత్రులున్నారు. అలాంటి వారికి కొత్త కేబినెట్లో స్థానం దక్కుతుందా లేదా.. అనేది ఆసక్తిదాయకంగా మారింది. అన్నింటికీ మించి.. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వానికి పెద్ద మెజారిటీ లేదు. ఆరేడు మంది ఎమ్మెల్యేల మెజారిటీ మాత్రమే ఉంది.
ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి వచ్చిన నేపథ్యంలో మంత్రివర్గ మార్పు చేర్పులకు శ్రీకారం చుడితే అదెలాంటి మలుపులకు దారి తీస్తుందనేది హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే బీజేపీ చేతిలో కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి.. మెజారిటీతో పని లేకుండా ప్రభుత్వ మనుగడకు ఢోకా ఉండకపోవచ్చు. ఒకవేళ అసంతృప్తితో ఎవరైనా రాజీనామాలు అంటూ ప్రకటించినా, కాంగ్రెస్ నుంచి కొత్తగా ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకోగల సత్తా, అవకాశం, ఉద్దేశాలు అయితే బీజేపీకి పుష్కలంగా ఉంటాయి!