పుకారు పుట్టించేదీ.. తూచ్ అనేదీ.. వాళ్లే!

తెలంగాణ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయా? అనే చర్చ రేగడమూ చల్లారడమూ కూడా జరుగుతోంది. ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ నిరాటంకంగా పరిపాలన సాగిస్తారు. మధ్యలో పక్కకు తప్పుకుని…

తెలంగాణ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయా? అనే చర్చ రేగడమూ చల్లారడమూ కూడా జరుగుతోంది. ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ నిరాటంకంగా పరిపాలన సాగిస్తారు. మధ్యలో పక్కకు తప్పుకుని ఎన్నికలకు పిలుపు ఇవ్వాల్సిన అగత్యం ఆయనకు ఎంత మాత్రం లేదు. 

ఇది సాధారణ పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయంటూ  పుకార్లు వచ్చాయి. ఏ కారణాల చేత కేసీఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారో ఎవరికి తోచిన విశ్లేషణల్ని వారు వండి వార్చారు. అయితే ఈ పుకార్లు ఎలా పుట్టాయి? అనే కోణంలో ఆలోచించినప్పుడు అందరి దృష్టి బిజెపి వైపు మళ్లుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ బలపడుతున్న తీరు చూసి కేసీఆర్ జడుసుకుంటున్నారని ప్రచారం చేసుకోవడం ఆ పార్టీ లక్ష్యం. తాము త్వరగా బలపడిపోతామనే భయంతో.. తమకు అవకాశం ఇవ్వకుండా మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా భారతీయ జనతా పార్టీ నే ప్రచారాన్ని ప్రారంభించింది. కేసీఆర్ అలాంటి వాతావరణం తీసుకు వస్తే అది తమ పార్టీకి బల సూచికగా చాటుకోవాలని వారి ఉబలాటం.

ఏమైందో ఏమో కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు కొత్త పాట ఎత్తుకున్నారు. అసెంబ్లీని రద్దు చేసే ఆలోచనను కేసీఆర్ విరమించుకున్నారని అంటున్నారు. అయితే ఇందుకు ఆయన చెబుతున్న కారణాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. 

కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తే గనుక… కేంద్రం ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించి, కేసీఆర్ ను, ఆయన కూతురు, కొడుకులను కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నదనే భయంతో అసెంబ్లీ రద్దుకు సాహసించడం లేదనేది బండి సంజయ్ ఉవాచ. ఎనిమిదేళ్ల లో వాళ్లు స్వాహా చేసిన సొమ్మునంతా కేంద్రం కక్కిస్తుందని వారు భయపడుతున్నారట! ఇదేదో ఆయన మోకాలికి బోడి గుండుకు ముడి పెడుతున్న వ్యవహారం లాగా కనిపిస్తోంది.

బండి సంజయ్ వ్యవహారం ఎలా ఉన్నదంటే.. పుకారును పుట్టించేది ఆయనే.. తర్వాత ‘తూచ్’ అనేసి దానిని వెనక్కి తీసుకునేది కూడా ఆయనే. అసెంబ్లీ రద్దు గురించి ఎవరు మాట్లాడుకునే అవకాశం కూడా లేని రోజుల్లోనే.. ఆ మాటను తెరపైకి తెచ్చారు బండి సంజయ్! తన మాట తుస్సు పోయిన తర్వాత మరో కొత్త కథను వినిపిస్తున్నారు. అరెస్టుల భయం వలన అసెంబ్లీ రద్దు ఆలోచన మానుకున్నారంటూ అర్థం లేని వివరణలు చెబుతున్నారు. 

నిర్మాణాత్మక పోరాటాలు, విధానాల పట్ల వ్యతిరేకతతో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ కలలు కంటే పర్వాలేదు కానీ, ఇలాంటి కుత్సితమైన చౌకబారు ఎత్తులు వేస్తే వారి పరువే పోతుంది.