‘‘మొగుడికి మందు పెట్టేసింది. యిక అప్పణ్నుంచి తల్లి మాట వినడం మానేసి, తను చెప్పినట్లే ఆడుతున్నాడు’ లాటి మాటలు వింటూంటాం కదా, ఇది దాని గురించిన కథే’’ అంటూ మొదలుపెట్టింది ముఖ్యమంత్రిణి వద్ద పని చేసే ఒక ఉన్నత ఉద్యోగిని ఉష.
ముఖ్యమంత్రిణి నవ్వుతూ ‘‘ఔనౌను, అలాటిదేదైనా దొరికితే బాగుండునని ఎప్పణ్నుంచో అనుకుంటున్నాను. అది చేతిలో ఉంటే, పార్టీలో మనకు వ్యతిరేకంగా కుట్రలు చేసేవాళ్లకి, మనం చెప్పిన మాట వినని నీబోటి ఆఫీసర్స్కి పెట్టేద్దును.’’ అన్నారు.
అందరూ గొల్లున నవ్వారు.
‘‘మీరిలా జోకులు వేస్తే ఏమీ అనలేం కానీ, అలాటిది ఉంటుంది మేడమ్, మా పెద్దన్నయ్యకు పెళ్లయిన తర్వాత వదిన మందు పెట్టేసి, తనవైపు తిప్పేసుకుంది. అంతే, మా కుటుంబాన్ని గాలికి వదిలేసి, ఆవిడతోనే ముంబయి చెక్కేశాడు. మా ఫాదర్ కూడా లేరు. చదువు కోసం డబ్బు పంపమన్నా పంపేవాడు కాడు. చాలా అవస్థలు పడ్డాం.’’ అన్నాడు వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేస్తున్న స్థానికుడు.
‘‘అది మీ అన్నయ్య స్వార్థబుద్ధి. మిమ్మల్ని వదిలించుకోవడానికి ఆవిడ పేరు వాడుకున్నాడు, ఆవిణ్ని రాక్షసి చేశాడు.’’ అన్నారు సిఎం సీరియస్గా.
‘‘ఆవిడేదో అద్భుతరసం ఊరే కథ చెప్పబోతారని మేం ఎదురు చూస్తూంటే, మధ్యలో మీ సైకో అనాలిసిస్ ఏమిటండీ?’’ అని మాట తప్పించారు సిఎం పర్శనల్ ఫిజిషియన్.
‘‘దీనిలో అద్భుతరసం ఉందని నేనేమీ హామీ యివ్వటం లేదండోయ్. నాకు ఒకావిడ స్వయంగా చెప్పినది వింతగా తోచి మీకు చెప్తున్నానంతే!’’ అంది ఉష హేండ్సప్’ పోజులో రెండు చేతులూ పైకెత్తి. ఆ తర్వాత సిఎం కేసి చూస్తూ మొదలుపెట్టింది –
‘మా ఆడపడుచు సంసారం అంత సవ్యంగా సాగలేదండి. సంబంధం చూసేటప్పుడు అబ్బాయికి ఏ అలవాట్లూ లేవు, కనీసం కాఫీ కూడా తాగడు, చాలా మెత్తటి స్వభావం, నోట్లో నాలిక లేదు. అని చెప్పారు. అన్నీ నిజమే. కానీ మెత్తదనానికి, మెతకదనానికి తేడా ఉంది. ఏ కోశాన తల్లి మాట జవదాటక పోవడం కూడా దుర్లక్షణమే. ఆవిడ అక్షరాలా రాక్షసి. ఆవిడ కోడల్ని పెట్టే ఆరడి అంతాయింతా కాదు. బండెడంత చాకిరీ, అనుక్షణం తిట్లూ మాట అలా వుంచండి, మొగుడి దగ్గర పడుక్కోనిచ్చేది కూడా కాదు. నాకు భయం వేస్తోంది, నా గదిలో పడుక్కో అనేది. ఆవిడ మొగుణ్ని హాల్లో సోఫాలో పడుక్కోమనేది. ఆయనో జజ్జురకం. కొడుక్కీ అదే నూరిపోశాడు, అమ్మ మాట వింటే అంతా సజావుగా జరిగిపోతుంది అని. పెళ్లాన్ని కొట్టినా, కోసినా తల్లిని అదేమిటని అడగని సౌమ్యుడు, అలాటి ‘మామంచి’ మొగుడు ఎవరికీ రాసిపెట్టి ఉండకూడదండి.
మా ఆడపడుచు చాలా మంచిది. రెండేళ్లు ఓర్చుకుంది. తర్వాత ఏదో సాకు చెప్పి పుట్టింటికి వచ్చి కూర్చుంది. మొగుడు వచ్చి పద, యింటికి వెళదాం అంటాడు. వేరు కాపరం పెడతావా అంటే అమ్మ నొచ్చుకుంటుంది, అసలే తన ఆరోగ్యం బాగా లేదంటాడు. పోనీ అమ్మకి గట్టిగా చెప్పి, నన్ను బాగా చూసుకునేట్లా చేస్తావా అంటే, పెద్దవాళ్లకి గౌరవం యివ్వకపోతే ఎలా? అంటాడు. ఆవిడ మాత్రం ఎంతకాలం ఉంటుంది, కొన్నేళ్లు సర్దుకుపోతే సరి అంటాడు. ఏ హామీ యివ్వడు, నా మొహం చూసి యింటికి తిరిగి రా అంటాడు. మా ఆడపడుచు ఆలోచించుకుని వస్తాలే అని పంపించేసింది. అతని వరస చూసి మా మావగారికి జాలి వేసింది. ఇలాటి మంచివాణ్ని కాదనుకోవడం ఎలా, కొద్దికాలం అవస్థ పడు అన్నారు. అత్తగారు గయ్య్మని లేచింది. మీరో బడుద్ధాయి కనక, నేనైతే మీ అమ్మతో పడాల్సి వచ్చింది కానీ యీ తరానికి చెందిన నా కూతురికి ఆ ఖర్మ పట్టలేదంది.
విడాకుల దాకా ఆలోచనలు సాగాయి. చివరకు మా మావగారు ‘మందో మాకో పెట్టేవాళ్లుంటారుగా, అలాటిది పెట్టి అతన్ని మనవైపుకి తిప్పుకుంటే సరి. విడాకులు, మరో పెళ్లి అంటే వాడు ఎలాటివాడు తగులుతాడో! ఇతనూ మంచివాడుమంచివాడంటేనే పిల్లనిచ్చాం. చివరకు యిలా తేలింది.’ అని నిట్టూర్చారు. వశీకరణం మందు గురించి వాకబులు మొదలుపెట్టాం. వచ్చిన చిక్కేమిటంటే, మేం అది వాడాం, అప్పణ్నుంచి మొగుణ్ని గుప్పిట్లో పెట్టుకున్నాం అని చెప్పినవాళ్లు ఎవరూ లేరు. నామోషీ కదా! మంత్రగాడేమో ఫలానావాళ్లకు నేనే యిచ్చాను, యిప్పుడు మొగుడూ పెళ్లాం సుఖంగా ఉన్నారు అంటాడు. వాళ్లను వెళ్లి అడిగితే వాడెవడో మాకేమీ తెలియదు, అయినా మాకేం ఖర్మం? మధ్యలో కాస్త మనస్పర్ధలు వచ్చాయి, తర్వాత సర్దుకున్నాయి. అయినా మొగుడూపెళ్లాం అన్నాక ఆ మాత్రం గొడవలుండవా అనేవారు…’’
‘‘ఆగాగు ఉషా, చూడబోతే నువ్వూ యీ ప్రయత్నాలకు సహకరించినట్లు కనబడుతోంది. ఏ కౌన్సిలింగుకో తీసుకెళ్లకుండా యిలాటి నాటు పద్ధతులకై వెంపర్లాడావని చెప్పడానికి సిగ్గు లేదా?’’ అని అడిగారు సిఎం.
‘‘అలాటి పరిస్థితులు ఎదురైనప్పుడే యిలాటి నమ్మకాల వెంట ఎందుకు పరిగెట్టామో తెలుస్తుంది. బయటివాళ్లు ఎన్ని నీతులైనా చెప్పవచ్చు. ఈ కౌన్సిలింగూ అదీ మార్పు అవసరమని గుర్తించినవాళ్లకే పని చేస్తుంది. నేను నార్మలే అనుకునేవాడు కౌన్సిలింగ్కే రాడు. పైగా ఒకటి గుర్తించండి మేడమ్, మన కాపురమే కాదు, భర్త యింట్లో అందరి కాపురాలు బాగుండాలి. అత్తగారు యవ్వనంలో వాళ్ల అత్తగారి చేతిలోనో, పెద్దయ్యాక మావగారి చేతిలోనో యాతన పడితే ఆవిడ ఏటిట్యూడ్ మారిపోయి, దాని ప్రభావం మన మీద పడుతుంది. అలాగే ఆడపడుచు సంసారంలో యిక్కట్లు ఉన్నాయంటే, అత్తగారి మనఃస్థితి సవ్యంగా ఉండదు. అమాయకురాలైన నా కూతురి జీవితం తగలడింది కానీ, దీని జీవితం చక్కగా నడుస్తోంది అనే కుళ్లు, అసూయ పుడతాయి. మన తప్పు లేకపోయినా, లేదని ఆవిడకు తెలిసినా సూటిపోటి మాటలంటుంది.
నేనిలా చెపితే ‘సాటి ఆడదాన్ని శత్రువులా చూస్తోంది. పురుషప్రపంచం కల్పించిన విషవాతావరణానికి లోనై, యిలా మాట్లాడుతోంది’ అంటూ ఫెమినిస్టులూ, మీరో కొందరూ తిట్టవచ్చు. కానీ సఫర్ అయినదాన్ని కాబట్టి చెప్తున్నాను. ఆడైనా, మగైనా మనమందరం మనుష్యులం. మనకు జరిగినదాన్ని బట్టే మన ఆలోచనాసరళి మారుతుంది. మా అత్తగారు మంచిదే. కానీ మా ఆడపడుచు కాపురం చెడిపోయాక ఆవిడ ధోరణి మారిపోసాగింది. కొన్నిసార్లు నా మీద ఉత్తిపుణ్యాన విరుచుకు పడేది. అందువలన ఏదో మార్గాన మా ఆడపడుచు సంసారం కుదుటపడితే చాలని నేనూ గట్టిగా ప్రార్థించాను. మామూలు మొక్కులూ అవీ పని చేయకపోవడంతో యీ దారీ చూద్దామనిపించింది.
చివరకు ఆ మందు పని చేసిందని ఒప్పుకున్నావిడ ఒకరు కనబడ్డారు. ఆవిడ భర్త ఓ యాక్సిడెంటులో పోయాడు. అందుకని ఫర్వాలేదనుకుని చెప్పింది. మా ఆడపడుచు పరిస్థితిపై జాలి పడడం కూడా ఒక కారణం. తన క్లయింట్లలో ఒక్కరైనా రివ్యూ యిచ్చినందుకు మంత్రగాడు హమ్మయ్య అనుకున్నాడు. అయితే అతను సున్నుండలో బహిష్టు రక్తం కలిపి మొగుడికి తినిపించడం వంటి వికారమైన పనులు చెప్పడంతో మా ఆడపడుచు ఛీ, ఛీ చేయననేసింది. మాకూ అసహ్యం వేసింది. ఇంట్లో అందరం కూర్చుని దీనిపై చర్చించడం మొదలుపెట్టాం. పక్క వాటాలో చేచీ కూడా వచ్చి కూర్చుని యీ మాటలన్నీ వింది. చేచీది పక్కవాటా అని పేరుకే కానీ, యింట్లో మనిషి లాగే లెక్క. కేరళావిడ. ఎనభై ఏళ్లు దాటుంటాయి. కొడుకు శంకరన్ దుబాయిలో ఉంటున్నాడు. మా మరిదికి ఎక్కడో పరిచయం. ‘మా అమ్మను జాగ్రత్తగా చూసుకోండి’ అని మాకు అప్పచెప్పాడు. అద్భుతంగా వంట చేసేది. తలలో నాలికలా ఉండేది. మా మావగారి దగ్గర్నుంచి, మా అమ్మాయి దాకా అందరికీ ఆవిడ చేచీయే! మలయాళంలో అక్క అని అర్థమట. తెలుగు శుబ్భరంగా మాట్లాడేది.
మా చర్చలు విన్నాక చేచీ గొంతు సవరించుకుని ‘ఈ విషయంలో నా అనుభవం చెప్తాను వినండి.’ అంటూ మొదలుపెట్టింది. ‘ఇప్పుడైతే డబ్బు వచ్చింది కానీ చిన్నపుడు మాది చాలా పేద కుటుంబం. కేరళలో సముద్రతీరంలో ఉన్న పల్లె మాది. పక్కనే పెద్ద అడవి ఉండేది. నా చిన్నపుడే మా అమ్మ పోయింది. మా నాన్నకు కొన్ని గొఱ్ఱెలుండేవి. పని కెళితే తప్ప, పొట్ట గడిచేది కాదు. గొఱ్ఱెలు మేపడానికి ఓ కాపరి ఉండేవాడు. అతనికో చిన్న కూతురు. కరుత్తమ్మ అని పేరు. మా అమ్మ పోయాక మా నాన్న మళ్లీ పెళ్లి చేసుకోలేదు. కరుత్తమ్మే నన్ను పెంచిందని చెప్పాలి. మా నాన్నకు పగలంతా పని, రాత్రంతా తాగుడు. నన్ను దగ్గరకు తీసి, ఆప్యాయంగా మాట్లాడినదే లేదు. మా ఊళ్లో చాలా తక్కువ యిళ్లు. విసిరేసినట్లు ఉండేవి. నేను కొండల్లో, కోనల్లో స్వేచ్ఛగా తిరిగేదాన్ని. సముద్రంలో ధైర్యంగా యీతలు కొట్టేదాన్ని. చదువు పెద్దగా అబ్బలేదు. స్నేహితులూ పెద్దగా లేరు.
ఆడుతూ, పాడుతూ కాలం వెళ్లబుచ్చుతూంటే వయసు వచ్చేసింది. నా అందం చూసి, కొందరు వెంటపడ్డారు కానీ నాకెవరూ నచ్చలేదు. అచ్చప్పన్ అనే డబ్బున్న ఓ వ్యాపారస్తుడు నన్ను పెళ్లి చేసుకుంటానని కబురు పెట్టాడు. అతనికి వయసెక్కువ, పెళ్లం పోయింది కానీ ఆశ చావలేదు. మా నాన్న కరుత్తమ్మ ద్వారా అడిగిస్తే చేసుకోనన్నాను. ఎవరి మీదైనా మనసు పడ్డావా అని అడిగితే అదీ లేదన్నాను. అన్న ఆర్నెల్లకు కాబోలు ఓ జాతరలో కుంజన్ కనబడ్డాడు. అతను మా ప్రాంతంవాడు కాదు. లోకసంచారి. పిల్లనగ్రోవితో పాటు మరో రెండు వాయిద్యాలు వాయిస్తూ పొట్ట పోసుకుంటాడు. ఊరూరూ తిరగడమే అతనికి సరదా. ఎక్కడా కాలు నిలవదు. మనిషి అందగాడు. అమాయకంగా నవ్వుతూ ఉంటే అమ్మాయిలు పడిపోవాల్సిందే!
నేను సహజంగా సిగ్గరినే కానీ, కుంజన్ను చూసేసరికి బెరుకూ, భయం పోయాయి. అతను ఏ సంతకు వెళ్లినా అక్కడికి వెళ్లేదాన్ని. వెంట కరుత్తమ్మ ఉండేది. నా కంటె ఇరవై ఏళ్లు పెద్దది కాబట్టి ‘జాగ్రత్త, యిలాటి దేశద్రిమ్మరులను నమ్మవద్దు, వాళ్ల మోహంలో పడవద్దు’ అంటూండేది. కానీ అతన్ని చూస్తే ఉండబట్టలేక పోయేదాన్ని. కూడాకూడా వెళ్లిపోయేదాన్ని. ఓ రోజు సంతలో కరుత్తమ్మ ఏదో కొనడానికి వెళ్లిన సమయం చూసి ‘‘నేనంటే అంత యిష్టమా? అయితే రాత్రి సముద్రపు ఒడ్డున బండల చాటుకి రా.’’ అన్నాడు కుంజన్. రాత్రి కరుత్తమ్మ నిద్రపోయాక సద్దు చేయకుండా లేచాను. తాగుడు మైకంలో ఉన్న మా నాన్న మొద్దునిద్ర పోతున్నాడు. ఎవరికీ తెలియకుండా అతను చెప్పిన చోటుకి వెళ్లాను. తెల్లవారేవరకు సుఖించాం. సూర్యోదయానికి ముందే జాలర్లు వేటకు బయలుదేరతారు. వాళ్ల కంట పడకుండా రాళ్ల మధ్య దాక్కోవలసి వచ్చింది. వాళ్లు అలా వెళ్లగా చూసి, యిలా యింటికి వచ్చి పడ్డాను.
కరుత్తమ్మ గమనించిందేమో తెలియదు. ఏమీ మాట్లాడలేదు. తనకూ పెళ్లి కాలేదు. పెళ్లి చేసేటంత డబ్బు వాళ్ల నాన్న దగ్గర లేదు. చిన్నపుడు ఎవరితోనైనా తిరిగిందో లేదో తెలియదు, ఎవరూ చెప్పుకోగా వినలేదు. మా యింట్లోనే తిండి, నిద్ర. మా నాన్నతో తనకు శారీరక సంబంధం ఉందాని నేనెన్నడూ ఆలోచించ దలచలేదు. వయసులో ఉన్న ఆడపిల్లలకు యిలాటివి తప్పవని అనుకుని ఊరుకుందేమో అనుకున్నాను. ఇలా వారం రోజులు గడిచాయి. ప్రతీ రాత్రీ నేను మాయమై పోయేదాన్ని. తెల్లవారుతూంటే ప్రత్యక్షమయ్యేదాన్ని. స్వర్గసుఖం అంటే ఏమిటో అప్పుడే తెలిసింది. చెప్పా పెట్టకుండా కుంజన్ వెళ్లిపోయాక నరకమంటే ఏమిటో కూడా అర్థమైంది. పగలంతా దిగాలుగా కూర్చునేదాన్ని. కరుత్తమ్మ తిట్టింది. ‘కుంజన్ గురించి ఆలోచిస్తున్నావా? చెప్పానుగా అలాటి కాలునిలకడ లేని వాళ్లు కుదురుగా ఉండలేరు. ఏదో ఊరుకి పోతాడు. ఒంటరివాడు. నాలుగు రాళ్లు వెనకేయాలన్న తాపత్రయం లేనివాడు. ఎక్కడి కెళ్లినా అమ్మాయిలు దొరకరన్న బెంగ లేదు. అలాటివాడు ప్రియుడిగా పనికి వస్తాడు తప్ప భర్తగా కాదు.’ అని చివాట్లు వేసింది.
కరుత్తమ్మ సర్వం గ్రహించిందని నాకర్థమైంది. కానీ నా రహస్యాన్ని కడుపులో పెట్టుకుందని సంతోషించాను. ఐదు నెలల తర్వాతనుకుంటాను, భగవతి అమ్మ జాతరకు కుంజన్ మళ్లీ వచ్చాడు. మా ఊరికి కాదు, పక్కూరికి. అక్కణ్నుంచి అటువైపు ఊళ్లకు వెళుతున్నాడు తప్ప మా ఊరికి రావటం లేదు. అతన్ని కలవడం ఎలా అని ఊహూ ఆరాటపడసాగాను. కరుత్తమ్మతో చెప్పుకుని ఏడ్చాను. ‘‘అతను నిన్ను మర్చిపోయాడు. పక్కూళ్లో అమ్ముకుట్టి కూతురితో తిరుగుతున్నాడని విన్నాను. ఇంకో ఊళ్లో ఇస్టప్పన్ కూతురితోనట! ఇస్టప్పన్కి డబ్బుంది. అతని కూతురు కుంజన్కు పులిగోరు పతకం బహుమతిగా యిచ్చిందట. అది మెడలో వేసుకుని తిరుగుతున్నాడు. నీ మీద మోజు తీరిపోయింది. ఇక అతన్ని మర్చిపోయి, వేరేవాళ్ల నెవరినైనా పెళ్లి చేసుకో.’’ అంది కరుత్తమ్మ. తను అంత చెప్పినా నేను వినలేదు. అతనిపై బెంగ నానాటికీ పెరిగిపోసాగింది. ఎలాగైనా నా వాణ్ని చేసుకోవాలని పంతం పట్టాను. అన్నం మానేసి చిక్కిపోసాగాను.
మీరు యిందాకటి నుంచి మందు పెట్టడం అంటున్నారే, అలాటివి మా దగ్గరా ఉన్నాయి. మంత్రతంత్రాలు తెలిసినవాళ్లే యిలాటివి చేస్తారు. నా బాధ చూడలేక కరుత్తమ్మ అలాటి ఒకావిడ దగ్గరకు తీసుకెళతానని మాట యిచ్చింది. కొండ మీద ఉన్న ముసలావిడ చెల్లమ్మ భూతవైద్యురాలట, అమావాస్య నాడే వెళ్లాలిట. నాలుగు రోజులాగు అంది. ‘నాది ప్రేమ సమస్య కదా, భూతవైద్యురాలెందుకు?’ అన్నాను. తను నవ్వింది. ‘భూతవైద్యులని మాటవరసకి అంటారు తప్ప భూతాలు పట్టుకోవడ మొకటే కాదు, చేతబడులు చేస్తారు, డబ్బు కావాలంటే క్షుద్రపూజలు ఎలా చేయాలో చెప్తారు. జోస్యాలు చెప్తారు. దేవుణ్ని ఎంతకాలం ప్రార్థించినా జరగని పనులన్నీ వాళ్లు అడ్డదారిలో చేసి చూపిస్తారు. అంతెందుకు, మీ అమ్మకు చాలాకాలం పిల్లలు కలగలేదు. ఎన్ని తీర్థయాత్రల కెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఈ చెల్లమ్మ దగ్గరకి వెళితే నేను చెప్పినట్లు చేస్తే నీకు సంతానం కలుగుతుంది, కానీ ఆ బిడ్డకు నాలుగేళ్లు వచ్చేలోపునే నువ్వు కాలం చేస్తావు.’ అని హెచ్చరించింది. ‘గొడ్రాలిగా చావడం కంటె బిడ్డతల్లిగా చస్తాను’ అని మీ అమ్మ నిశ్చయించుకుని తను చెప్పినట్లే చేసింది. నువ్వు కడుపున పడ్డావు.’ అంది కరుత్తమ్మ.
అమావాస్య నాడు మిట్టమధ్యాహ్నం మేమిద్దరం కొండెక్కి చెల్లమ్మ గుడిసెకు వెళ్లాం. గుట్టలెక్కలేక ఆపసోపాలు పడుతూ నేను ‘హారి దేవుడా, ఎన్ని తిప్పలు తెచ్చావురా’ అంటూంటే కరుత్తమ్మ నవ్వింది. ‘భూతవైద్యుల దగ్గరకి వెళుతూ దైవనామస్మరణ చేస్తే ఎలా? సైతానుకి కోపం వస్తుంది’ అంది. తను క్రైస్తవురాలు. నేను నవ్వాను. ‘మాకు రాక్షసులు తప్ప సైతాను లేడులే’ అన్నాను. చెల్లమ్మ నన్ను చూడగానే మా అమ్మ పేరు తలచుకుంది. ‘చూశావా, మనం వస్తున్నామని ముందుగా చెప్పకపోయినా, నువ్వు ఫలానా అని కనిపెట్టేసింది’ అంది కరుత్తమ్మ. ‘మా అమ్మ పోలికలు కనబడి ఉంటాయిలే’ అని తీసిపారేశాను నేను. చెల్లమ్మ నా కథ వింది. ఇంతకీ ఏం కావాలంటావ్ అని అడిగింది. ‘కుంజన్ నా వైపే చూడటం లేదు. నా దగ్గరకు రప్పించాలి.’ అన్నాను.
‘రప్పించడం కష్టం కాదులే, కానీ వచ్చినవాణ్ని నిలుపుకోవడం కష్టం.’ అంది చెల్లమ్మ. ‘అది నేను చూసుకుంటాను. రప్పించడం వరకు నువ్వు చేసి పెట్టు చాలు. అతన్ని ఎంత బాగా సంతోషపెడతానంటే యిక నన్ను విడిచి వెళ్లే ఆలోచనే చేయడు. మా నాన్న దగ్గర ఇరవై ఆరెల భూమి ఉంది. నన్ను పెళ్లి చేసుకుంటే మా నాన్న అది యిచ్చేస్తాడు. ఊరూరూ పట్టుకుని తిరిగే బదులు యిక్కడే స్థిరపడమని నచ్చచెప్తాను.’’ అన్నాను. చెల్లమ్మ నవ్వింది. ‘‘నీ నమ్మకం చూస్తే ముచ్చటేస్తోంది. కష్టమైన పనే చెప్తాను, చేస్తావా?’’ అంది. ఎంత కష్టమైనా చేస్తానన్నాను. ఒక మజ్జిగ కుండ తెచ్చి, చేత్తో తిప్పి వెన్న తీయాలని చెప్పింది. కవ్వం జోలికి వెళ్లకూడదట. కుడి చేత్తోనే చేయాలిట. ఒక్క క్షణమైనా ఆగకుండా తిప్పుతూ ఉండాలిట. వెన్న ముద్ద ఎంత పెద్దగా వస్తే అంత ఫలితం ఉంటుందట. ఈలోగా తను ఓ మూల కూర్చుని మంత్రాలు జపిస్తుందట.
కుంజన్ కోసం ఎంత కష్టమైనా ఓర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మొదలుపెట్టిన తర్వాత చెయ్యి తెగ పీకింది. అదేదో రాకాసి మజ్జిగలా ఉంది, ఎప్పటికీ వెన్న పడదే! మూడు గంటల తర్వాత కొద్దిగా వెన్న తేలింది. కరుత్తమ్మ భుజం తట్టి ప్రోత్సహించింది. ఇంకా బాగా, వెర్రిగా తిప్పాను. వెన్న పెద్ద ముద్దగా, బంతిలా తేలింది. మంత్రోచ్చాటన ముగించుకుని వచ్చిన చెల్లమ్మ అది చూసి తృప్తి పడింది. ‘‘తప్పకుండా నీ దగ్గరకు వస్తాడు.’’ అంది. మంత్రజలం నా మీద చల్లింది. చెల్లమ్మను మెప్పించినందుకు నాకూ ఆనందం వేసింది. నొప్పి పెట్టిన చేతులు చాచుకుంటూ వెన్న ముద్ద కేసి చూసి ‘‘గురవాయురప్పకు పెట్టే నైవేద్యంలా ఎంత పెద్దగా ఉందో!’’ అన్నాను కళ్లు పెద్దవి చేసి!
‘‘అయ్యో, పిచ్చి తల్లీ! ఈ సమయంలో దేవుడి మాట ఎత్తావేమిటి!’’ అంటూ నిర్ఘాంతపోయింది చెల్లమ్మ. నేను కొయ్యబారిపోయాను. ‘‘ఏం ఫలితం ఉండదా? మంత్రం పారదా? కుంజన్ రాడా?’’ అని అడిగాను ఆదుర్దాగా. ‘‘ఫలితం ఉంటుంది. కానీ దానిలో ఓ మార్పు ఉంటుంది. ఎలాటి మార్పో నేనూ చెప్పలేను.’’ అంది చెల్లమ్మ నిరాశగా. నేనూ దిగాలు పడ్డాను. ‘నా ప్రయత్నం నేను చేశాను. తర్వాత దైవాధీనం’ అని మనస్సులో అనుకున్నాను, తప్ప పైకి అనలేదు. అంటే దుష్ఫలితం వస్తుందనే భయం వేసింది. మేం మోసుకుని తెచ్చిన బియ్యం, ఉప్పు చేపలూ చెల్లమ్మకు యిచ్చింది కరుత్తమ్మ. తీసుకుంటూ ‘‘మూడు రోజులు పోయాక రాత్రి పది దాటాక నువ్వున్న చోటికి కుంజన్ వస్తాడు.’’ అని చెల్లమ్మ చెప్పింది.
మర్నాడు కరుత్తమ్మ ‘‘మీ నాన్నకు రబ్బరు తోటల్లో పని దొరికింది. పదిహేను రోజుల పాటు ఊరు విడిచి వెళతాడు. నువ్వు ఎల్లుండి రాత్రి వెళ్లి నేను నిన్న చూపించిన కొండ గుహలో కూర్చో. సముద్రం ఒడ్డునైతే సూర్యోదయం కాగానే లేచి రావాలి. అక్కడికైతే ఎవరూ రారు. వారం, పది రోజులు మీ యిద్దరూ ఏకాంతంగా గడపవచ్చు. బియ్యం, యితర సామాన్లు పట్టుకుని వెళ్లు. చక్కగా వండి బాగా మెక్కబెట్టు. నీ చేతి వంట కోసమేనా అతను ఒక గృహస్తుగా మారాలి.’’ అని బోధించింది. ‘‘రమ్మనమని కబురంపినా పాత చోటుకి వెళతాడు తప్ప, అక్కడికెందుకు వస్తాడు?’’ అన్నాను నేను. ‘‘చెల్లమ్మ మంత్రం పారితే నువ్వు ఎక్కడుంటే అక్కడికే వస్తాడు. పారకపోతే చేసేదేమీ లేదు.’’ అంది కరుత్తమ్మ. నాకూ నిజమే అనిపించింది. కబురూ, కాకరకాయా ఏమీ అక్కరలేదనుకున్నాను. అనుకున్న సమయానికి అక్కడికి వెళ్లి కూర్చున్నాను…’’
‘‘కుంజన్ వచ్చాడటా?’’ అడిగాడు ఉత్కంఠ భరించలేని ఓ శ్రోత.
‘‘ఆఁ వచ్చాడట’’ అని ఉష చెప్పగానే అక్కడున్న వారందరూ చప్పట్లు కొట్టారు.
‘‘స్టేటు బ్యాంకు వాళ్లు ఆ మంత్రమేదో నేర్చుకుని విజయ్ మాల్యాను వెనక్కి రప్పిస్తే మంచిదేమో’’ అని ఒకరు జోక్ చేయగానే అందరూ పగలబడి నవ్వారు.
సిఎం కూడా పకపకా నవ్వి ‘‘వాళ్లే కాదు, క్యాంప్ రాజకీయాలంటూ తప్పించుకుని పరరాష్ట్రాలలో తిరిగే ఎమ్మెల్యేలను కూడా యీ పద్ధతిలో పార్టీ ఆఫీసుకి రప్పించవచ్చన్నమాట.’’ అని జోక్ చేసి, ‘‘చెప్పు ఉషా, మంచి డ్రామా క్రియేట్ చేశావ్.’’ అన్నారు.
‘‘నేను క్రియేట్ చేసిందేమీ లేదండి. చేచీ చెప్పిన కథే చెప్తున్నాను. కుంజన్ నిజంగానే వచ్చాడు. వారం రోజుల పాటు వాళ్ల శృంగారం సాగింది. చేచీ చేసి పెట్టిన వంటలన్నీ సుష్టుగా తిన్నాడు. ఆమెను తనివితీరా తృప్తి పరిచాడు. వారం పోయాక నన్ను పెళ్లి చేసుకుని యిక్కడే ఉండిపో అన్నపుడు మాత్రం ‘అబ్బే కుదరదు’ అనేశాడు. నీకూ నాకూ బంధం యింతటితో తీరిపోయింది. నేను వేరే చోటకు వెళ్లిపోతాను. కేరళ విసుగెత్తింది. పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతాను. మళ్లీ రాను అన్నాడు. నువ్వు నాతో ఎప్పటికీ ఉండాల్సిందే అంది చేచీ కోపంగా. పోవే అని వెళ్లిపోబోయాడతను. అంతే వెంట పరిగెట్టి, ఆ కొండ చరియ మీద నుంచి కింద సముద్రంలోకి తోసేసింది. అతనికి యీత రాదు. అతని ప్రాంతం వాళ్లలో చాలా మందికి రాదట. చచ్చిపోయాడు. ఈమె యింటికి తిరిగి వచ్చేసింది…’’
‘‘అమ్మో, హత్య చేశానని తనే మీ అందరికీ చెప్పేసిందా? ఎంత ధైర్యం?’’
‘‘ఇన్నేళ్లు పోయింది కాబట్టి, సాక్ష్యం దొరకదు కాబట్టి చెప్పింది. అప్పుడు ఏమీ తెలియనట్లు ఊరుకుంది. అతను పరదేశి కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. మరో ఊరు వెళ్లిపోయాడనుకున్నారు. తండ్రి చెప్పిన అచ్చప్పన్ను పెళ్లి చేసుకుంది. రెండేళ్లకు తండ్రి పోతే అతని పేర ఉన్న అరెకరం భూమిని కరుత్తమ్మకి యిచ్చేసింది. అచ్చప్పన్ భార్యకు పడకసుఖం అందించలేక పోయినా డబ్బు, హోదా సమకూర్చాడు. కుంజన్ వల్ల కలిగినవాణ్ని తన కొడుకుగానే చెప్పుకున్నాడు, పెంచి పెద్ద చేశాడు. దుబాయిలో ఉన్న శంకరన్ తన తండ్రి అచ్చప్పన్ అనే అనుకుంటున్నాడు, కుంజన్ అని తెలియదతనికి.
చేచీ చెప్పినది విని ‘మరి కుంజన్ను నీ వద్దే ఉంచుకుంటానని అన్నావు కదా, చివరకు యిలా అయిందేమిటి?’ అని అడిగాం. ‘ఆత్మావై పుత్ర నామాసి అంటారు, కుంజనే శంకరన్ రూపంలో నా దగ్గర ఉన్నాడు కదా. నిజానికి యిలా కావాలని నేననుకోలేదు. కానీ ఆ క్షణంలో, మంత్రప్రభావమో ఏమో, అతన్ని తోసేయాలనిపించింది. తోసేశాను. ఫలితంలో మార్పు అని చెల్లమ్మ అంటే ఏమిటో అనుకున్నాను. ఇది అని తేలింది. నా కథ విని, యిలాటి వాటిల్లో దిగడం మంచిదో కాదో మీరే తేల్చుకోండి.’ అని చేచీ ముగించింది.’’ అని ఉష ఆగి, అందరి కేసి చూసింది.
అందరి మొహంలోనే విషాదం కనబడింది. ప్చ్, ప్చ్ అన్నారు. ఐదు నిమిషాలు పోయాక, సిఎం ‘‘వెరీ శాడ్, యింతకీ, ఉషా, యీ కథ విన్నాక మీ వాళ్లు ఏం చేశారు? మీ అడపడుచు సంసారం ఏమైంది?’’ అని అడిగారు. ‘‘ఇలాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనగానే భయం వేసింది. వద్దనుకున్నాం. విడాకులు తీసుకున్నారు. పై ఏడాది భార్య పోయిన ఒకతన్ని పెళ్లాడింది. ఇప్పుడు సుఖంగా ఉంది. ఇద్దరు పిల్లలు కూడా..’’ చెప్పింది ఉష.
ఈ రచనకు స్ఫూర్తి నిచ్చినది జేన్ యోలెన్ రాసిన ‘ఇన్స్క్రిప్షన్’ అనే కథానిక. అద్భుతరసయామిని సీరీస్లో మరో కథ వచ్చే నెల రెండవ బుధవారం!
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2022)