అమరావతి టూ అరసవెల్లి అటూ రాజధాని రైతులు మహా పాదయాత్ర ప్రారంభించారు. అయితే ఈ పాదయాత్ర గోదావరి జిల్లాలను దాటుకుని ఉత్తరాంధ్రా వైపు వచ్చేసరికి కొన్ని రోజులు టైం పడుతుంది. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రాలో అయితే అధికార వైసీపీ మంత్రులు నాయకులు ఇది పాదయాత్ర కాదు ఒక దండు చేసే దండయాత్ర అని అంటున్నారు.
మా వైపు ఉన్న దేవుడికి దండాలు పెట్టి వెళ్తే ఫరవాలేదని, అలా కాకుండా మా ప్రాంతం బాగుపడకూడదని మొక్కుకుంటే మేమెలా ఊరుకుంటామని మంత్రి గుడివాడ అమరనాధ్ అంటున్నారు. ఉత్తరాంధ్రాలో పుట్టి ఇక్కడ రాజకీయంగా ఎదిగి ఎన్నో పదవులు అందుకున్న వారు ఇక్కడికి రాజధాని వద్దు అంటే చూస్తూ ఊరుకుంటారా అని ఆయన టీడీపీ వారిని ప్రశ్నించారు.
ఇక ఉత్తరాంధ్రా రాజకీయం అంతా ఒక్కటి కావాలని అందరూ కలసి విశాఖ రాజధాని కోసం సంఘీభావం తెలపాలని విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ వారు నోరు విప్పాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే శాంతియుతంగానే ఉత్తరాంధా వాసులు తమ నిరసనలు తెలపాలని విశాఖ జిల్లా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పిలుపు ఇచ్చారు. ఇంకో వైపు ఏయూలోని పలువురు ప్రొఫెసర్లు, కొన్ని విద్యార్ధి సంఘాల ప్రతినిధులు ఉత్తరాంధ్రా వెంకబాటుతనం మీద ఈ మహా పాదయాత్ర గొడ్డలి పెట్టుగా పేర్కొంటున్నారు. తాము వీటిని అడ్డుకుంటామని విద్యార్ధి సంఘాల నేతలు అంటున్నారు.
మొత్తానికి చూస్తే మెల్లగా విశాఖ సహా ఉత్తరాంధ్రాలో మొదలైన ఈ రకమైన నిరసన గళాలు అన్నీ కూడా ఒక చోటకు చేరితే అది శాంతియుతంగా ఆందోళన నిర్వహించే పరిస్థితి ఉంటుందా లేక ఏమైనా ఉద్రిక్తతలు చెలరేగుతాయా అన్నదే ఇపుడు అందరికీ కలుగుతున్న సందేహం. అయితే తాము ప్రశాంతంగానే తమ ప్రాంతం గురించి నినదిస్తామని చెబుతున్నా అవతల వైపు నుంచి ఏ రకమైన రియాక్షన్ ఉంటుందో అప్పటికపుడు దాన్ని బట్టి యాక్షన్ మారుతుంది అని అంటున్నారు.
ఉత్తరాంధ్రాలోకి మహా పాదయాత్ర ప్రవేశించే నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు కానీ ఈ రోజుకు అయితే చూస్తే టీడీపీ నుంచి పెద్ద నాయకులు ఎవరూ పాదయాత్రకు స్వాగతం అని ఓపెన్ గా చెప్పకపోవడం ఈ సందర్భంగా చూడాల్సిన విషయం.