Advertisement

Advertisement


Home > Politics - Analysis

కొత్త రాజధానికి నిధులంటే అమరావతికా? విశాఖకా?

కొత్త రాజధానికి నిధులంటే అమరావతికా? విశాఖకా?

కేంద్ర ప్రభుత్వం ఏపీకి సంబంధించి చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రజలలో ఒక చర్చనీయాంశమైంది. టీడీపీ, వైసీపీ పార్టీలు ఆ ప్రకటనపై తమకు తోచిన రీతిలో భాష్యం చెప్పుకుంటున్నాయి. కేంద్రం ప్రకటనతో ఎల్లో మీడియా మహా ఉత్సాహంగా ఉంది. బీజేపీ- టీడీపీ పొత్తు దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. తాజాగా సీఎం జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మూడు రాజధానుల విషయంలో మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విభజన సమస్యలపై ఈ నెల 27న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. దీనిపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. సమావేశం ఎజెండా కూడా ఇచ్చిది కేంద్రం. 

విభజన చట్టం షెడ్యూల్ 9 ,10లోని ఆస్తుల పంపకాలపైనా చర్చించనున్నట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థిక అంశాలను కేంద్రం చర్చించనుంది. అయితే కేంద్ర హోంశాఖ ఎజెండాలో మూడు రాజధానుల ప్రస్తావన లేదు. కొత్త రాజధానికి నిధులు అని మాత్రమే చేర్చింది. ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్ర నిధులు, విద్యాసంస్థల ఏర్పాటు, రాజధాని నుంచి ర్యాపిడ్ రైల్ అనుసంధానం వంటి అంశాలను ఎజెండాలో చేర్చింది. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే ... కొత్త రాజధాని అంటే ఏది? చంద్రబాబు చేపట్టిన అమరావతా? జగన్ స్వప్నం విశాఖ పట్టణమా? కేంద్రం దేనికి నిధులు ఇస్తుంది? జగన్ మూడు ప్రాంతాల ప్రజలను తృప్తి పరచడానికి మూడు రాజధానులు అన్నారు.

కానీ వాస్తవానికి ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒక్కటే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్రమైనా దానికే డబ్బు ఖర్చు చేయాలి. దాన్నే అభివృద్ధి చేయాలి. ఆల్రెడీ విశాఖ అభివృద్ధి చెందిన నగరమే కాబట్టి దానికి మరో పది వేల కోట్లు ఖర్చుపెడితే చాలని జగన్ ప్రభుత్వ వాదన. అమరావతిని శాసన రాజధాని చేస్తామన్నారు. అందుకు కావలసిన అసెంబ్లీ భవనం అక్కడ ఉంది. హైకోర్టును కర్నూలుకు తరలిస్తే సరిపోతుంది. జగన్ ఆశించిన మూడు రాజధానులు తయారైపోతాయి. ఈ మూడు నగరాలు ఎంతమేరకు అభివృద్ధి చెందుతాయనేది తరువాతి ప్రశ్న. కేంద్ర సర్కార్ తాజా ఎజెండాలో కొత్త రాజధానికి నిధులు అని చేర్చడం ద్వారా ఏకైక రాజధానికే మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నది స్పష్టమైంది.

మూడు రాజధానుల బిల్లును వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో మళ్లీ జగన్ సర్కార్ ప్రవేశపెడుతుందనే  ప్రచారం జరుగుతోంది. అమరావతే రాజధానిగా ఉండాలన్న హై కోర్టు తీర్పును కూడా జగన్ సర్కారు సుప్రీం కోర్టులో సవాలు చేస్తుందని చెబుతున్నారు. కొత్త రాజధానికి నిధులిస్తామని కేంద్రం చెప్పిందంటే అది విశాఖకేనని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇటీవలే పలుసార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు సీఎం జగన్. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. మూడు రాజధానుల గురించే కేంద్రం పెద్దలతో జగన్ మాట్లాడారనే ప్రచారం జరిగింది. అయితే  తాజా పరిణామాలతో  రాజధాని విషయంలో జగన్ కు మోడీ సర్కార్ షాక్ ఇచ్చారని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. 

అదే సమయంలో అమరావతి రాజధాని కోసం ఉద్యమిస్తున్న టీడీపీతో ఏకభవించినందున.. ఆ పార్టీతో పొత్తు దిశగా బీజేపీ పెద్దలు అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వలేదని, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపిస్తూ బీజేపీకి బైబై చెప్పారు చంద్రబాబు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరంటూ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. కాంగ్రెస్ కూటమితో చేతులు కలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కలిసి పలు రాష్ట్రాల్లో సభలు నిర్వహించారు. ప్రధాని మోడీపై వ్యక్తిగతంగా తీవ్రమైన ఆరోపణలు చేశారు చంద్రబాబు. తిరుపతికి వచ్చిన అమిత్ షా కాన్వాయ్ ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడం సంచలమైంది. దీంతో కాంగ్రెస్ తో చేతులు కలిపిన చంద్రబాబును బీజేపీ పూర్తిస్థాయిలో టార్గెట్ చేసింది. 

2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి కోసం ఏపీలో వైసీపీకి బీజేపీ సహకరించిందనే టాక్ ఉంది. జగన్ కు నిధులు సమకూర్చడంతో పాటు చంద్రబాబు ఆర్థికమూలాలను దెబ్బతీసిందని అంటారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ విషయంలో చంద్రబాబు రూట్ మార్చారు. గత మూడున్నర ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కేంద్రంలో మళ్లీ మోడీనే అధికారంలోకి వస్తారని అంచనా వేసిన చంద్రబాబు.. బీజేపీతో తిరిగి పొత్తు కోసం తాపత్రయపడుతున్నారు. సమయం దొరికితే చాలు బీజేపీ పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక్కడే చంద్రబాబుకు మరో వ్యూహం ఉందంటున్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. టీడీపీతో పొత్తుకు జనసేన సిద్దంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. అయితే బీజేపీ మాత్రం పొత్తులపై క్లారిటీ ఇవ్వలేదు. బీజేపీతో పొత్తు కుదిరితే జనసేన కూడా కూటమిలో ఉంటుంది. అదే జరిగితే వైసీపీని ఓడించడం సులభమని చంద్రబాబు లెక్కలేస్తున్నారని అంటున్నారు. అందుకే బీజేపీ పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారు. త్యాగాలకు కూడా సిద్దమయ్యారు. రాజధాని విషయంలో కేంద్ర సర్కార్ తాజా నిర్ణయంతో టీడీపీ, బీజేపీ పొత్తుకు గ్రీన్ సిగ్నల్ పడిందనే చర్చ ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?