పవర్ స్టార్, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం చేస్తారో? ఎప్పుడు ఏం చేయాలనుకుంటారో ఆయనకే క్లారిటీ వుండదు అని ఎవరైనా అంటే అవాస్తవం అయితే కాదు. అతిశయోక్తి అంతకన్నా కాదు. ఆయన పని తీరు, వ్యవహారాలు గమనిస్తే ఎవరైనా అలాగే అంటారు.
ఈ క్షణం అనుకున్నది రేపు వుంటుందో వుండదో తెలియదు. కాస్సేపు హరిహర వీరమల్లు సినిమా పక్కన పెడతారు. వినోతసిత్తం రీమేక్ అంటారు. మరునాడు కాదు ఇది పక్కన, అది ముందుకు అంటారు. ఆ తరవాత ఇవి రెండూ కాదు రాజకీయ సమావేశాలు అంటారు. ఒకటి రెండు రోజులు రాజకీయ సమావేశాలు నిర్వహిస్తే మళ్లీ కొన్నాళ్ల పాటు పత్తా వుండరు. ఇంట్లోకి వెళ్లిపోతే, మళ్లీ ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. పార్టీ జనాలకు కూడా ఓ షెడ్యూలు, సమాచారం వుండదు. ఆయన ఎప్పుడు చెబితే అప్పుడే.
కొన్నాళ్ల క్రితం వున్నట్లుండి ఓ ప్రకటన చేసారు. దసరా నుంచి రధాయాత్ర చేయబోతున్నా అంటూ. అంతకు ముందో తరువాతనో, ఆంధ్రలోని నారసింహ క్షేత్రాలు, పనిలో పనిగా తెలంగాణలోని ఒకటో రెండు నారసింహ క్షేత్రాలు సందర్శిస్తూ ఈ యాత్ర సాగుతుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు అయితే ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్న దాఖలాలు లేవు. దసరా మరో ఇరవై రోజుల దూరంలో వుంది. ఇప్పటి వరకు ఈ మేరకు పార్టీ వర్గాల్లో కూడా ఎటువంటి సన్నాహాలు లేవు.
వాహనం రెడీ అవుతోంది
కానీ ఒకటి మాత్రం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర కోసం ఓ ప్రత్యేక వాహనం మాత్రం ముంబాయిలో రెడీ అవుతోందట. ఆంధ్రలో టీ టైమ్ అవుట్ లెట్ లతో ఫేమస్ అయిన ఉదయ్ కు ఈ వాహనం తయారీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
చాలా ధృఢంగా వుండేలా ఈ వాహనాన్ని రెడీ చేస్తున్నారు. ఈ వాహనానికి మిలటరీ గ్రీన్ కలర్ వుంటుంది. ఓ వార్ వెహికిల్ మోడల్ అని అనుకోవచ్చు. వాహనం అటు ఇటు బలమైన బార్ లు, ప్లాట్ ఫారమ్ లు వుంటాయి. బాడీగార్డులు అటు ఇటు కనీసం అరడజను మంది నిలబడి వుండేలా దీన్ని తయారు చేస్తున్నారు. వాహనం లోపల నుంచి టాప్ మీదకు పవన్ చేరుకునేలా ఏర్పాటు వుంటుంది. ఎన్టీఆర్ చైతన్యరథం ఎలా అయితే కాస్త యాంటిక్ లుక్ వుంటుదో పవన్ వాహనం కూడా అలా మిలటరీ యాంటిక్ ట్రక్ లా వుంటుందని తెలుస్తోంది.
యాత్ర కాదట
దసరా నుంచి యాత్ర అంటూ ప్రచారం జరిగిపోయింది కానీ యాత్ర కాదని పవన్ కళ్యాణ్ కార్యాలయ వర్గాల బోగట్టా. విడతలు విడతలుగా రాజకీయ కార్యక్రమాలు మాత్రం వుంటాయట. వాటి మధ్యలో సినిమాల షూటింగ్ లు ప్లాన్ చేస్తారట. అంతే తప్ప రెగ్యులర్ ఫార్మాట్ రాజకీయ యాత్ర మాదిరిగా సాగదు అని తెలుస్తోంది.
అమరావతి యాత్ర వుండగా
అమరావతి యాత్ర ఆంధ్రలో సాగుతుండగా మళ్లీ మరో పోటీ యాత్ర వుండకూడదు. తెలుగుదేశం – జనసేన కార్యక్రమాలు ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంంటాయి అని వాటిని అబ్జర్వ్ చేసేవారికి అర్థం అవుతూనే వుంటుంది. వీళ్ల కార్యక్రమం వుంటే వాళ్లు సైలంట్ గా వుంటారు. వాళ్ల కార్యక్రమం వుంటే వీళ్లు సైలంట్ గా వుంటారు. అందువల్ల ఇప్పుడు అమరవాతి కార్యక్రమం జరుగుతోంది కనుక జనసేన యాత్ర స్టార్ట్ చేయడానికి ఇంకా టైమ్ పట్టొచ్చు.