షర్మిల టార్గెట్ అయిందంటే రాజకీయంగా మైలేజీ వచ్చినట్లేనా?

తెలంగాణలో ఇంత కాలం కాంగ్రెస్ ను, బీజేపీని టార్గెట్ చేస్తున్న అధికార టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కొత్తగా వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిలను టార్గెట్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా ఆమెకు రాజకీయంగా గుర్తింపు…

తెలంగాణలో ఇంత కాలం కాంగ్రెస్ ను, బీజేపీని టార్గెట్ చేస్తున్న అధికార టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కొత్తగా వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిలను టార్గెట్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా ఆమెకు రాజకీయంగా గుర్తింపు వచ్చినట్లేనా? పొలిటికల్ మైలేజీ వచ్చినట్లే అనుకోవాలా? షర్మిల తెలంగాణా రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు టీఆర్ఎస్ నాయకులు ఆమెను ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా ఆంధ్రాకు చెందినామెకు తెలంగాణా రాజకీయాలతో ఏంపని అని నిరసించారు. 

ఆంధ్రావాళ్ళు తెలంగాణను దోపిడీ చేయడానికి మళ్ళీ వస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కూడా షర్మిలను పట్టించుకోలేదు. బీజేపీయే ఆమెతో పార్టీ పెట్టించింది కాంగ్రెస్ వాళ్ళు అంటే, కాంగ్రెస్ వాళ్ళే పెట్టించారని బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేశారు. రెండు పార్టీలు కలిసి టీఆర్ఎస్ పార్టీయే షర్మిలను రప్పించిందని అన్నారు. ఇలా రకరకాలుగా మాట్లాడారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆమె నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వం అరెస్టు చేసింది. షర్మిల తమకు పోటీగా వచ్చిందని అన్ని పార్టీలు భావించాయి. వాస్తవానికి షర్మిల పార్టీలో పెద్ద నాయకులు లేరు. పార్టీ సంస్థాగత నిర్మాణం లేదు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి ఆమెకు లేదు. అయినప్పటికీ కాబోయే ముఖ్యమంత్రిని తానే అన్నది. రాజన్న రాజ్యం తెస్తానంది. కేవలం రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలను నమ్ముకొని రాజకీయాలు చేస్తోంది. అలాగే తండ్రి చేసిన పాదయాత్రను నమ్ముకొని తానూ పాదయాత్ర చేస్తోంది. మొత్తమ్మీద పట్టుదలగా రాష్ట్రమంతా తిరుగుతోంది. 

ఈ నేపథ్యంలో ఇటీవల ప్రజాప్రస్థానం పాదయాత్రలో గతంలో మంత్రి నిరంజన్ రెడ్డి తనపై మంగళవారం మరదలు అంటూ చేసిన వ్యాఖ్యలపై  షర్మిల ఎవడ్రా నీకు మరదలు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడి ఆయనను వీధికుక్కతో పోల్చిన విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో వైఎస్ షర్మిల ను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ నేతలు వైయస్ షర్మిల పై చర్య తీసుకోవాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. శాసనసభ్యుల గౌరవాన్ని వైయస్ షర్మిల కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై మంత్రులు ఎమ్మెల్యేలతో చర్చించి స్పీకర్ తగిన చర్యలు తీసుకుంటామంటూ, సభ్యుల హక్కులను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. షర్మిలపై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదును సభా హక్కుల ఉల్లంఘన కమిటీకి పంపించారు. ఇక దీనిపై సభా హక్కుల ఉల్లంఘన కమిటీ  సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తనపై షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర డిజిపికి ఫిర్యాదు చేశారు. దీంతో వైయస్ షర్మిల ఏ మాత్రం తగ్గకుండా ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టారు.

సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వం పై, ప్రధాని నరేంద్ర మోడీ పై సీఎం కేసీఆర్ తిట్ల దండకానికి సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేసి మరి దీన్నేమంటారు అంటూ ప్రశ్నించారు. స్పీకర్ గారు తన పై చర్యలు తీసుకునే ముందు కేసీఆర్ దొరగారి నోటినుంచి జాలువారిన ఆణిముత్యాలు చూసి, విని ఆయనపైన ముందు చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అని పేర్కొన్నారు. అంతేకాదు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నాపై చర్యలకు ఆలోచించే ముందు పరాయి ఆడదాన్ని, ఒక తల్లిని మరదలంటు నన్ను కించపరిచి నన్ను, నాతోటి మహిళలను అవమాన పరిచిన సంస్కార హీనుడైన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని వైయస్ షర్మిల పేర్కొన్నారు. తనను అవమానపరిచిన వ్యక్తిని తాను ఎందుకు ప్రశ్నించొద్దు అన్నట్టు వైఎస్ షర్మిల ఇదెక్కడి న్యాయం అని తన పోస్ట్ ద్వారా నిలదీశారు. 

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రాజకీయంగా అనేకమంది అనేకమందిపై ఏవేవో ఫిర్యాదులు చేస్తునే ఉంటారు. రాజకీయంగా ఒకరిపై మరొకరు చేసుకునే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ ఉండవు. ఏదో రాజకీయంగా ప్రత్యర్ధులపై బురదచల్లటమే టార్గెట్ గా మీడియా సమావేశాల్లోను ఇతర సందర్భాల్లోనూ  ఆరోపణలు చేస్తుంటారు. కేసీయార్ మీద బీజేపీ చీఫ్ బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఏమున్నాయి? అలాగే నరేంద్ర మోడీ మీద కేసీయార్ తో పాటు మంత్రులు చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. మరి వాటన్నింటికీ ఆధారాలుండే ఆరోపణలు చేస్తున్నారా?

నిజంగానే తాముచేసే ఆరోపణలకు ఏవైనా ఆధారాలుండేట్లయితే కచ్చితంగా వాటిని మీడియాకు అందచేస్తారు. మీడియాకు ఆధారాలు ఇవ్వకుండా సమయం వచ్చినపుడు అన్నీ ఆధారాలను బయటపెడతామని చెప్పారంటేనే ఆరోపణలు చేసేవారి దగ్గర ఆధారాలు లేవని అర్ధమైపోతోంది. రాజకీయంగా చేసుకునే ఆరోపణలు, ప్రత్యారోపణలకు జనాలు కూడా అలవాటు పడిపోయారు.

కాబట్టి జనాలు నేతల ఆరోపణలను ఏదో కాలక్షేపానికి వింటున్నారే కానీ నిజంగా ఎవరూ సీరియస్ గా తీసుకోవటం లేదు. ఇంతోటి దానికి సభా హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని షర్మిలపై స్పీకర్ యాక్షన్ తీసుకోవాలని కోరడం విచిత్రంగా ఉంది. ఇంతకూ షర్మిల మీద ఏం చర్యలు తీసుకుంటారో. మొత్తమ్మీద షర్మిల ఒక రాజకీయ నాయకురాలిగా, పార్టీ అధినేతగా గుర్తింపు లభించినట్లే అనుకోవాలా?