సంక్రాంతి సినిమా ల డేట్ లు ఫిక్స్ అవుతున్నాయి. ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ డేట్ ఇప్పటికే ఫిక్స్ అయింది.
జనవరి 12న ఆదిపురుష్ థియేటర్లలోకి వస్తుంది. దానికి ఒక రోజు వెనుకగా జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి-బాబి కాంబినేషన్ మూవీ ‘వాల్తేర్ వీరయ్య’ విడుదల కాబోతోంది. ఈ మేరకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. థియేటర్ అగ్రిమెంట్లు చేసుకోమని డిస్ట్రిబ్యూటర్లకు వాల్తేర్ వీరయ్య నిర్మాతలు అయిన మైత్రీ మూవీ మేకర్స్ చెప్పేసారు.
అంత వరకు బాగానే వుంది. మరి అదే సంస్థ నిర్మిస్తున్న బాలకృష్ణ సినిమా సంగతి ఏమిటి? ఎందుకంటే డిసెంబర్ లో ఈ సినిమా విడుదల అనుకున్నారు. కానీ బాలకృష్ణ ఈ సారి సంక్రాంతికి తన సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు. కానీ చిరంజీవి కూడా సంక్రాంతికే వస్తామంటున్నారు. దీంతో నిర్మాతలు అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.
ప్రస్తుతానికి అయితే మెగాస్టార్ సినిమాను సంక్రాంతికి ఫిక్స్ చేసారు. బాలయ్య సినిమాను అఖండ మాదిరిగా డిసెంబర్ లో తేవడానికి బాలయ్యను ఒప్పించే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. ఈ రెండూ కాక అదే సంస్థ నిర్మిస్తున్న మరో రెండు సినిమాలు కూడా వున్నాయి. కళ్యాణ్ రామ్ తో చేస్తున్న సినిమాను డిసెంబర్ 2 కు విడుదల చేస్తున్నారు. విజయ్ దేవరకొండతో చేస్తున్న ఖుషీ సంగతి మాత్రం ఇంకా తేలలేదు.
ప్రస్తుతం రెస్ట్ లో వున్న సమంత సెట్ మీదకు రావాలి. షూట్ కంప్లీట్ కావాలి. అప్పుడు కానీ ఓ క్లారిటీ రాదు.