కేంద్రం సమావేశానికి తెలంగాణ డుమ్మా!

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం తాజాగా పూనిక వహిస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలను పరిష్కరించడానికి.. కేంద్రం తాజాగా…

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం తాజాగా పూనిక వహిస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలను పరిష్కరించడానికి.. కేంద్రం తాజాగా ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఈనెల 27వ తేదీన ఢిల్లీలో జరిగే సమావేశంలో విభజన చట్టంలోని అనేక అంశాలు వాటి మీద రేగుతున్న వివాదాల గురించి చర్చించబోతున్నారు. అయితే కేంద్రం నిర్వహిస్తున్న ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం గైర్హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ద్రోహం తలపెట్టే విధంగా ఈ సమావేశం ఎజెండా ఉన్నదని ఆరోపిస్తూ.. అసలు సమావేశాన్ని బహిష్కరించే ఉద్దేశం తెలంగాణకు ఉన్నట్లుగా కనపడుతోంది.

విభజన సమస్యల గురించి సమావేశం ఏర్పాటు చేసిన కేంద్రం చాలా మొక్కుబడిగా వ్యవహారాన్ని నెట్టివేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అనే అంశాన్ని వారు ఎప్పుడో తుంగలో తొక్కేసినప్పటికీ… రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతో కీలకంగా భావిస్తున్న కొత్త రైల్వే జోన్ గురించి గానీ, కడప స్టీల్ ప్లాంట్ గురించి గానీ ఈ సమావేశం ఎజెండాలో పొందుపరచలేదు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఈ ఎజెండాలో వారు పేర్కొనలేదు. విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో ఉండే దుగరాజపట్నం పోర్టు లాంటివి కూడా వారి అజెండాలో లేవు.

ఇదంతా ఒక ఎత్తు అయితే… తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశం మీద ప్రత్యేకంగా ఆగ్రహించడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న షెడ్యూలు తొమ్మిదిలోని ప్రభుత్వ కంపెనీలు కార్పొరేషన్ల విభజన, రాష్ట్రస్థాయి సంస్థల విభజన.. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ విభజన.. లాంటి అనేక అంశాలు ఈ ఎజెండాలో ఉన్నాయి. పైగా తెలంగాణ పౌరసరఫరాల కార్పొరేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన క్యాష్ క్రెడిట్ బకాయిలు తదితర వ్యవహారాలు కూడా ఉన్నాయి.

వీటన్నింటినీ ఒక నెపంగా చూపించి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించడానికి.. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నదని, చర్చలకు ఆహ్వానిస్తున్నదని తెలంగాణ సర్కారు ఆరోపించే అవకాశం ఉంది. అందువలన ఈ సమావేశాన్ని బహిష్కరిస్తామని ప్రకటించే అవకాశం పుష్కలంగా ఉంది.

అసలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్– కేంద్రం మీద బహిరంగ యుద్ధం సాగిస్తున్నారు. తెలంగాణకు ద్రోహం తలపెడుతున్న దంటూ అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఈ సమావేశం ఎజెండాను, కేసీఆర్ కేంద్రం మీద దాడి చేయడానికి మరో అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేయడానికే ఈ అజెండాలో అంశాలన్నీ ఉన్నాయని.. చర్చల్లో కేంద్ర ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందని విశ్వాసం తమకు లేదని… ఆరోపిస్తూ గైర్హాజరు కావడానికి అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.